Sunday, December 30, 2012

కొవ్వొత్తులతో కాదు నాకు నివాళి!

ముగిసిపోయే కధనుకాను
రగులుతున్న వ్యధను నేను
చనిపోలేదు నేను......
మీ కొవ్వొత్తుల వెలుగులో జీవించే ఉన్నాను
అత్యాచార తిమిరాన్ని తరిమికొట్టే ఆయుధంగా
నా చావు మీ ఉద్యమానికి స్ఫూర్తి ఐతే
నా మరణం కూడా ధన్యం!
నా మరణానికి కారణమైన కామాంధుల
తలలు తక్షణం తీసి కోటగుమ్మానికి  వ్రేలాడగట్టమని
ఆజ్ఞాపించే రాజే లేడా ఈ లోకంలో
రాచరికానికి సెలవిచ్చేసి, ప్రజలే ప్రభువులన్న
ప్రజాస్వామ్యంలో నా మరణానికి సమాధానం
కోట్లు ఖర్చుపెట్టి ఓట్లు కొనుక్కున్న
ఏ ప్రభువు నడగాలి ?
మరోసారి ఆడపిల్ల పై చేయి వేయాలంటే ఒణుకు పుట్టేలా
ఏ ప్రభువు శిక్షవేస్తాడు ఆ దుర్మార్గులకు?
ఎంతకాలానికి ?
 కన్నీళ్ళతోనో, కొవ్వొత్తులతోనో కాదు నాకు నివాళి
యత్రనార్యస్తు పూజ్యంతే అని పుస్తకాలకే పరిమితం చేయకండి
ప్రాధమిక విద్యనుండే పిల్లలకు బోధించండి
 మానవత్వమున్న మనుషులుగా తీర్చిదిద్దండి
స్త్రీలను పూజించక్కర్లేదు 
వారి ముఖంపై చిరునవ్వు చెదరనీయకండి
భయం నీడన బ్రతుకు వెళ్ళదీయకుండా 
కొంచెం ధైర్యంగా నడిచేలా రక్షణ కల్పించండి
హింసకు గురైన వారిపట్ల  కాస్త సానుభూతి చూపించండి
చులకనగా మాట్లాడి మా ఆత్మలకు కూడా
శాంతి లేకుండా చేయకండి 
ఇదే నాకు, నాలాంటి ఎందరో అభాగినులకు
నిజమైన నివాళి!!

** నేనుసైతం అంటూ  ఓ టపా రాసి చేతులు దులిపేసుకోవటం తప్ప ఏమీ చేయలేని నానిస్సహాయతకు బాధపడుతూ నిర్భయకు అశ్రునివాళి! రాబోయే సంవత్సరమైనా ఇటువంటి చేదు జ్ఞాపకాలు మిగల్చకుండా అంతా మంచే జరగాలి, అందరికీ మంచే జరగాలని కోరుకుంటూ ఈ వత్సరానికి వీడ్కోలు!



6 comments:

  1. "రెండు కళ్ళల్లోనుంచి
    చూపులు సూదుల్లా వచ్చి
    మాంసపు ముద్దలపై విచ్చలవిడిగా తిరుగుతుంటాయి.
    ఆ కళ్ళల్లో ఏప్పుడు ఒకే సంకేతం.
    సొంగ కార్చే కుక్కలాంటి ఆకలుంటుంది.
    ఆ కళ్ళను వేటాడటానికి కళ్ళతోనే యుద్దం చెస్తాను.
    ఆడదాని ఒక్కంత ముళ్ళుండే రోజుకోసం ఏదురుచూస్తాను"....పరిమళం గారు మీ పోస్ట్ చదువుతుంటే ఏప్పుడో చదివిన ఈ కవిత గుర్తుకు వచ్చింది..కోట్లు ఖర్చుపెట్టి ఓట్లు కొనుక్కున్న ఏ ప్రభువు మీ ప్రశ్నకు సమాధానం చెప్పలేడు.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుడదంతే ఆడ వాళ్ళతో ఎల మెలగాలో ప్రతి తల్లి తమ కొడుకులకు ఉగ్గుపాలతో నేర్పాలి..ఎంత కటినమైన శిక్షలు వేసిన ఇలాంటివి పుణరావృతమవుతూనే ఉంటాయి. గతంలో వరంగల్ లో ఇద్దరి అమ్మయిలపై యాసిడ్ దాదులకు పాల్పడిన వ్యక్తులను వెంటనే ఎంకౌంటర్ చెసినా రాష్ట్రంలో యాసిడ్ దాడులు తగ్గలేదు..

    ReplyDelete
  2. "స్త్రీలను పూజించక్కర్లేదు
    వారి ముఖంపై చిరునవ్వు చెదరనీయకండి"

    "రాబోయే సంవత్సరమైనా ఇటువంటి చేదు జ్ఞాపకాలు మిగల్చకుండా అంతా మంచే జరగాలి, అందరికీ మంచే జరగాలని కోరుకుంటూ ఈ వత్సరానికి వీడ్కోలు!"

    well said !

    ReplyDelete
  3. /అత్యాచార తిమిరాన్ని తరిమికొట్టే ఆయుధంగా
    నా చావు మీ ఉద్యమానికి స్ఫూర్తి ఐతే
    నా మరణం కూడా ధన్యం!/

    wow

    ReplyDelete
  4. ఎప్పటికీ మర్చిపోకూడని విధంగా ఈ సంవత్సరం ఈ చేదు సంఘటన అందరి హృదయాలనూ కాల్చేస్తోంది. ఇదే స్ఫూర్తితో కొత్త సంవత్సరం కూడా అటువంటి దుర్మార్గుల అంతు తేల్చేదాకా విశ్రమించకూడదని అందరం శపథం చెసుకోవాలి..

    ReplyDelete
  5. ఎంత మందిని ప్రశ్నించి ఏం లాభం! వెలుగు చూడని దుశ్చర్యలు, ఎంతో మంది మూగగా జీవితాల్ని కోల్పోయిన అభాగిణులు...ఇకముందు ఉండరని ఆశపడ్డా, ఇంకా జరిగేవి జరుగుతూనే ఉన్నాయి....

    ReplyDelete
  6. నిరాశావాదంతో ఏమీ సాధించలేం. అందరం కలసి ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. ఒక్క నేలలోనో సంవత్సరంలోనే సాధించలేకపోవచ్చు. మార్పు తప్పకుండా వస్తుంది. చివరివరకు నిలబడే శక్తి మనలో నిలుపుకోవాలి. మన బాధ, అవేదనల రాతలు అర్ధవంతమవ్వాలంటే అడుగు ముందుకు వెయ్యాలి.

    ReplyDelete