Sunday, September 9, 2012

కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారికి నివాళులు !

ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావుగారి అబ్బాయి రోహిణీప్రసాద్ గారు కన్నుమూశారన్న వార్త పేపర్లో చూడగానే చాలా బాధగా అనిపించింది. 1949 సెప్టెంబర్ 14న జన్మించిన ఆయన నిన్న (శనివారం) ఉదయం 11గంటలకు ముంబాయి జస్లోక్ హాస్పటల్ లో కన్నుమూశారట!

బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో శాస్త్రవేత్తగా పనిచేసిన ఆయన మంచి సాహితీవేత్తకూడా.సైన్సుకు సంబంధించిన పుస్తకాలతోపాటు ఆయన అంతర్జాలంలో సరళమైన రీతిలో తెలుగులోవ్యాసాలు రాసారు.అవి బహుశా మీకందరికీ సుపరిచితమే! రోహిణీప్రసాద్ గారికి సాహిత్యం పట్లఎంత మక్కువో సంగీతంపట్లకూడా అంతే మక్కువ!ఆయన గురించి ఆయన బ్లాగ్ 'Rohiniprasad Kodavatiganti'లో చూడొచ్చు.

ఆయన ఎంత  గొప్పవారైనా నిగర్వి.ఈవిషయం నేను అనుభవపూర్వకంగా చెబుతున్నాను.ఆయన నా చిన్న బ్లాగులో కృష్ణశాస్త్రి గారి గురించి రాసిన పోస్ట్ చదివి కామెంట్ చేయడమే కాకుండా నన్ను ఏవిధంగా వెన్నుతట్టి ప్రోత్సహించారో ఈక్రింది కామెంట్స్ చూస్తే మీకూ తెలుస్తుంది.మీతో పంచుకోవాలని ఆయన రాసినవి అలాగే పెస్ట్ చేస్తున్నా!

## రెండే రెండు మాటల్లో కవిత్వం రాయగలిగినది ఒక్క కృష్ణశాస్త్రేనని మానాన్న కుటుంబరావుగారనేవారు. సినిమా పాటల్లోనే దీనికెన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. 'ఎందుకీ సందెగాలి', 'ఏదీ బృందావనమిక, ఏదీ విరహ గోపిక', 'పగలైతే దొరవేరా రాతిరి నా రాజువురా'.

కొడవటిగంటి రోహిణీప్రసాద్


## ప్రస్తుత పరిస్థితుల్లో మీకు నచ్చిన తెలుగు సాహిత్యం (కృష్ణాశాస్త్రి వగైరా) గురించిన మీ స్పందనను చిన్న వ్యాసాల రూపంలో రాసి, ఈమాట, పొద్దు వంటి వెబ్ పత్రికలకు పంపిస్తే ఈ తరం పాఠకులకు వాటిని పరిచయం చెయ్యగలుగుతారు. ఇటువంటి ప్రయత్నం మీ పాండిత్య ప్రదర్శనకు కాక మీ ఆసక్తిని నలుగురితో పంచుకునేందుకు ఉపయోగపడుతుంది. మంచి పుస్తకాలు కొని, చదివి, అర్థంచేసుకునేంత ఆసక్తిగాని, వ్యవధిగాని లేనివారికి ఇటువంటి రచనలు ఉపయోగపడతాయి. తెలుగు రీడర్‌షిప్ పెరిగేంతవరకూ ఇలాంటివి జరగడం చాలా ఆరోగ్యకరం అనుకుంటాను. మీ మోడెస్టీని అర్థం చేసుకోగలను. దాన్ని గురించి అంతగా పట్టించుకోకుండా రచనలు కొనసాగించండి. బ్లాగ్ రాయడం కన్నా ఎడిటర్లు ఎంపిక చేసే పత్రికలకు రచనలు పంపడం మంచి పని.   
రో.ప్ర.

సర్!మీకు ఆత్మశాంతి కలగాలని కోరుకొంటున్నాను.4 comments:

 1. బాగుంది. రోహిణీ ప్రసాద్ గారిని నేను డెట్రాయిటులో కలిసాను. వాళ్ళ నాన్న గురించి మాకు చాలా మంచి విషయాలు చెప్పారు.

  ReplyDelete
 2. రోహిణీ ప్రసాద్ గారు లేని లోటు తీర్చలేనిది.. సైన్సు విషయాలను సామాన్య పాఠకులకు కూడా అర్థమయ్యే రీతిలో రాసే ఆయన ఉపన్యాసం కూడా సభలలో విన్నాను. ఇంతటి మేధావికి ఈ తెలుగు నేలలో రావాల్సినంత ప్రచారం కూడా రాలేదు. మీడియా ఇటువంటి వారి మరణ వార్తలకే పరిమితం కావడం మన దురదృష్టం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.

  ReplyDelete
 3. మీకు తెలిసిన రోహిణీ ప్రసాద్ గారి గురించిన మంచి జ్ఞాపకాలు పంచుకున్నారు. ధన్యవాదాలు.

  చిన్న సూచన. ఆత్మే లేదన్న వారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నారు. సాంప్రదాయిక పరిభాష సందర్భానుసారం ఉపయోగించడం తప్పదేమో.

  కాని ఆయన మీనుంచి దేన్ని ఆశించారో దాన్ని నెరవేర్చండి చాలు. ఆయనకు నిజమైన సంతోషం అక్కడే ఉంటుంది.

  వీలయితే నా చందమామలు బ్లాగ్ చూడండి.

  blaagu.com/chandamamalu

  ReplyDelete
 4. @ శ్రీ గారు
  @ వర్మ గారు
  @ నెలవంక గారు
  మీ అనుభవాల్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  ReplyDelete