Sunday, February 13, 2011

ప్రేమకు అర్ధం చెప్పే కవిత !

ఈ కవిత చాలా ఏళ్ళక్రితం ఆంద్ర భూమి అనుకుంటా...వార పత్రికలో వచ్చింది కాగితంపై రాసిపెట్టుకున్నాఏదో వెదుకుతుంటే ఒక పుస్తకంలో శిధిలావస్థలో ఆ కాగితం కనపడింది నా అజాగ్రత్తకు తిట్టుకుంటూ ఈ అద్భుతమైన కవితని మీతో పంచుకోవాలని ఈ టపా! పెద్దదిగా ఉందని అనుకోకుండా పూర్తిగా చదవండెం.ప్రేమకు అర్ధం చెప్పే కవిత !ఈ ప్రేమికుల రోజు గులాబీలు , గిఫ్ట్ లు ఇచ్చుకొని మళ్ళీ ప్రేమికులరోజు వచ్చేసరికి విడిపోయి కొత్తవారి వేటలో ఉండే వారు ఎక్కువై నిజమైన ప్రేమికులు కరువైన (అసలు లేరని కాదు)ఈ రోజుల్లో ఈ కవిత నిజమైన ప్రేమకు ప్రతిబింబంగా నిలుస్తుంది.
***ఈ కవితకు ఇంగ్లీషు మూలం జాన్ డన్ గారు...తెలుగు అనువాదం గోదావరి శర్మ గారు.
వీడ్కోలు
గొప్పవారు మరణంలో ఒప్పుకోరు ఓటమిని
రట్టులేక రభసలేక గుట్టుగానే పోతారు
బంధుమిత్రులెంతమంది చెంతచేరి గోలచేసి
వింతరీతి ఎంతఏడ్చినా వారుమటుకు వీరులే !

ఆరీతిగా నేనుకూడ వెళుతున్నానిన్నువీడి
కార్చబోకు కన్నీళ్లను విడవబోకు నిట్టూర్పులు
మనప్రేమ అనురాగం మనలోనే మననియ్యి
మనసులేని లోకానికి మనసంగతి చెప్పొద్దు

చిన్నచిన్నకష్టాలకి చిన్నబోవు లోకమిది
అత్యున్నత విషయాల్లో వ్యత్యాసం చూడలేదు
రోడ్డుమీది ట్రాఫిక్కే గడ్డు సమస్యవుతుంటే
గెలాక్సీల గమనాలని గమనించే కళ్ళేవీ ?

కళ్ళుచూసి ఒళ్ళుచూసి ప్రేమలో పడేవాళ్ళు
మనిషి దూరమవగానే ప్రేమలోంచి పడతారు
మనసుమనసుకలుపుకున్న మనమాదిరిప్రేమికులను
శరీరాలు ఎడమైనా విరహ బాధ వేదించదు

మనతనువులు రెండింటిలో మనసొకటే ఉందికనుక
కనకమొకటే ఆమనసుకు సాటివచ్చు మేటికనక
సాగుతుంది ఎడతెగక బంగారపు తీగలాగా
ఎంత మనం ఎడమైతే అంతమేర వ్యాపిస్తూ ....

అలాకాక ఇద్దరిలో ఇరుమనసులు ఉండాలని
ఎవరైనా శాసిస్తే ఎదురాడక ఔనందాం...
అద్వైతం సాధించిన ఆరెండిటి ఐక్యాన్నీ
విద్యార్ధులువాడు వృత్త లేఖినితో పోలుద్దాం

కేంద్రంలో ఉన్నకాలు ఇంటిలోని నిన్నుపోలు
పరిధివెంట పరిగెత్తే మరోకాలు నన్నుపోలు
ఏ వైపుకి నే వెళితే ఆ వైపే వొరుగుతావు
తిరిగినిన్నుచేరువేళ నిటారుగా నిలుస్తావు

నిలకడగా నువ్వుంటే నా వృత్తం చేదిరిపోదు
విరహాన్నే విరచించే నా యత్నం వృధాపోదు
వ్యాసార్ధం సున్నాచేసి నన్ను నిన్ను చేరుకోనీ
బయలుదేరు బిందువులో తిరిగివచ్చికలిసిపోనీ!

10 comments:

  1. పెద్దదేంటి?! ఇంకా వుంటే బావుండనిపిస్తుంది...భావాలు సుదూర పాశ్చాత్యమైనా మనసుకు చాలా దగ్గరగా ఉన్నాయ్...

    ReplyDelete
  2. బయలుదేరు బిందువులో తిరిగివచ్చి కలిసిపోనీ ...కవిత చాలా బాగుందండి పదిలపరిచి పంచినందుకు కృతజ్ఞతలు

    ReplyDelete
  3. Wow... Superb Parimala garu.. Thanks for sharing :))

    ReplyDelete
  4. వృత్త లేఖిని ఉపమానం చాలా బాగుంది

    ReplyDelete
  5. చాలా బావుందండీ

    ReplyDelete
  6. gud one! copy rites meevi kadani nijaitheaga chepparu

    ReplyDelete
  7. నాకు నచ్చిన కవిత మీక్కూడా నచ్చి స్పందించిన మిత్రులకు ధన్యవాదాలు!

    ReplyDelete
  8. పెద్దది కాదు అసలు చదువుతుంటే సమయమే తెలియలేదు! చాలా బాగుంది!

    ReplyDelete