
నాన్నగారూ
కుశలమే కదా ? ప్రతిరోజూ ఫోన్ చేసుకున్నా ఇలా ఎపుడైనా అడిగానా అని సందేహం!మీరు మాత్రం నా గొంతులోనిచిన్న
మార్పును కూడా పసిగట్టేసి ఏంట్రా అలా ఉన్నావేం ఒంట్లో బాగానే ఉందికదా...మీ గొంతులో ఎంత ఆత్రుత...మరింత ఆర్ద్రత!ఆ పక్కనే తనపని చేసుకుంటూనే ఓచెవి ఇటువేసి ఉంచిన అమ్మ ఖంగారూ ! ఎందుకు నాన్నగారు ఇంకా ఇంతప్రేమ! నాకు జరపాల్సిన విధులన్నీ శక్తికి మించి జరిపేసి...బాధ్యతలన్నీ తీరిపోయి, ఉద్యోగ విరమణలో హాయిగా కాలం గడపాల్సిన వయసులో ఇంకా మా బాధ్యతల్ని కూడా మోస్తూ మాకు స్పూర్తిగా నిలుస్తున్నారు.మేం మిమ్మల్నిచూసుకోవాల్సిన ఈ వయసులో కూడా నన్నొక గాజుబొమ్మలాఅతి జాగ్రత్తగా చూసుకుంటారు.
నాన్నగారూ! దగ్గరగా ఉన్నప్పుడు ప్రతి పండుగా మీ సమక్షంలోనే....ఇప్పుడు మీ ఇద్దర్నీవదిలి.... పండుగలు చేసుకుంటున్నాం అంటే అక్కడ మీరిద్దరే ఉన్నారన్న గిల్టీ ఫీలింగ్ గుండె లోపలిపోరల్లోకి తోసేసి చిరునవ్వుల పూత వేసుకొని చేసుకోవాలి కాబట్టి అన్నట్టు చేసుకుంటున్నాం!
మీకు గుర్తుందా నాన్నగారు, ఏ పండుగ వచ్చినా షాపింగ్ కి మనిద్దరం కలిసే వెళ్ళేవాళ్ళం మీరు నాచేతిని బలమైన మీ గుప్పిట్లో గట్టిగా పట్టుకొని కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళం! మీకు తెలుసా ఆ వెళ్ళేదారిలో మీ ఆఫీస్ వాళ్ళు కాని మీ ఫ్రెండ్స్ కాని తారసపడకూడదని వెయ్యి దేవుళ్ళకి మొక్కుకునేదాన్ని! ఎందుకంటే ఎవరు కనపడినా ఓ అరగంట తక్కువకాకుండా మాట్లాడేసేవారు మీరు (ఇప్పటికీ అంతే మీరు) ...నాకు బోర్ ! అంతసేపు నాచేయిమాత్రం మీ గుప్పిట్లోనే ఉండేది.
వినాయక చవితి వస్తే బొమ్మ , గొడుగు నాకు నచ్చినవే కొనేవారు.దీపావళి వస్తే నా ఫ్రెండ్స్ అందరూ ఇద్దరు , ముగ్గురు పిల్లలకి వికొనే టపాసుల కంటే నా ఒక్కదానివే ఎక్కువ ఉండేవి.వారం రోజులు ముందే మీరు కొనిచ్చిన టపాసుల బుట్ట అమ్మకిచ్చి ప్రతి రోజు స్కూల్ కి వెళ్లేముందు ఎండలో పెట్టమని ఆర్డర్ వేసేసి...మళ్ళీ సాయంత్రం అన్నీ సరిచూసుకొనే దాన్ని! దీపావళి రోజు అందరికన్నా ముందే టపాకాయల శబ్దానికి భయపడతానని నాచేత మందులు కాల్పించేవారునాన్నా! ఇప్పటికీ మీ అల్లుడు,మనుమలూ కూడా అంతే.. ఏడుగంటలకల్లా టపాసులు కాల్చేసి తలుపులన్నీ మూసేస్తారు ఓ పక్క నన్ను వెక్కిరిస్తూనే !మతాబులు, కాకర పువ్వొత్తులు కూడా పొడవాటి చువ్వకి కట్టి స్టూల్ మీద నించోబెట్టి ఫెన్సింగ్ ఇవతలనుండి బైటకి కాల్పించేవారు నాన్నగారు , అప్పుడు మా ఫ్రెండ్స్ వెక్కిరిస్తుంటే మీ చాదస్తానికి విసుగానిపించేది కాని ఇప్పుడు ఎంత గర్వంగా ఉంటుందో !
నాన్నగారూ ! గుర్తుందా మీకు!బైటకి వెళ్ళినప్పుడు చాలాసార్లు నాకు గోల్డ్ స్పాట్ కొనిచ్చి మీరు షోడా తాగేవారు అదేంటి నాన్నా అని అడిగిన గుర్తులేదు తలుచుకొన్న కొద్దీ కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి సంతోషమో..దుఃఖమో తెలీదు గొంతుకడ్డం పడుతోంది.మీరు డ్యూటీ నుండి ఎంతాలస్యంగా వచ్చినా నాతో ముచ్చట్లు ఐతేకాని అమ్మ ఎంత ఉడికిపోయినాస్నానానికి వెళ్ళేవారుకాదు. మీ ఎడమ తొడపై నన్ను కూర్చోబెట్టుకొని ముందుగా నాకు గోరుముద్దలు
తినిపించకుండా మీరు తినేవారుకాదు.ఆ తర్వాత స్కూల్ లో జరిగిన విశేషాలు అడుగుతూ ...ప్రతిరోజూ ఓ కధ చెపుతూ చెప్పినవే ఐనా మీరు చెపుతుంటే వినాలనిపించేది నిద్రపుచ్చేవారు.గుర్తు చేసుకోవడం కాదు నాన్నా...మనసు బావిలో జ్ఞాపకాల ఊటలు ఇవి ఏనాటికీ ఇంకిపోయేవికాదు...ఇవన్నీ తలుచుకొంటుంటే మీరు చూపించిన శ్రద్ధలో ఎన్నోవంతు మా పిల్లలమీద చూపిస్తున్నామో ...ఎలా పెంచుతున్నామా అనిపిస్తుంది.
ఫోనులు వచ్చిన కొత్తల్లో ...ఎందుకు నాన్నగారు ఉత్తరాలు ? ఏముంటాయి ఫోన్ లో చెప్పినవే రాస్తారు...రాసినవే ఫోన్ లో చెపుతారు అనేదాన్ని! కాని నాన్నగారూ! అనీ ఫోన్లో మాట్లాడలేం ఫీలింగ్స్ తెలియచేయటానికి ఉత్తరానికి మించినది ఏముంటుంది ? అందుకే బాల్యంలోని నా అపురూప క్షణాల్ని పోస్ట్ చేయని ఈ ఉత్తరం ద్వారా మీతో పంచుకుంటున్నా...ఇక సెలవా మరి! ఆరోగ్యం,అమ్మ జాగ్రత్త !