Wednesday, January 27, 2010

బంగారు తల్లిని :)


జన్మనిచ్చే మాకు జీవించే హక్కు లేదా?
జ్యోతిగారి టపా చదివినప్పుడు మనసు కలచివేసినట్టైంది.నేనూ ఇటువంటివి టీవీ లో చూసినప్పుడు ,పేపర్లో చదివినప్పుడు బాధపడుతూ ఉంటాను.హోమ్స్ లో ఉయ్యాలల్లో వదిలేసే వాళ్లలోనూ ఎక్కువ శాతం ఆడపిల్లలే ఉంటారు.ఈమధ్య టీవీలో అమ్మకానికి పిల్లలు అని ఒక న్యూస్ చూపించినపుడు కూడా ఎక్కవ ఆడపిల్లల్నే అమ్మకానికి పెడుతున్నారట !ఆడపిల్లని తెలియగానే గర్భస్త శిశువుల్ని చిదిమేసేవారు , ఇప్పుడు ముందే లింగ నిర్ధారణ చేయటం నేరం కాబట్టి పుట్టిన తర్వాత విసిరి పారేస్తున్నారు .పుట్టిన తర్వాత తప్పక పెంచుతూ ఆడపిల్లల్ని చిన్నచూపు చూసేవారు కూడా చాలామంది ఉంటారు .ఇవన్నీ చూస్తుంటే ఇటువంటివారూ ఉంటారా అని ఎంతో బాధగా ఉంటుంది .

ఐతే నేను అదృష్టవంతురాల్ని అందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి మా నాన్నగార్ని నాకిచ్చినందుకు ! నేను మాత్రమే కాదు కూతుర్ని అపురూపంగా చూసుకొనే తల్లితండ్రులున్న వారందరూ అదృష్టవంతులే !

అందరూ ఆడపిల్లల్ని మొగ్గలోనే తుంచేయక పోయినా ...మగపిల్లాడు కావాలని ముడుపులు కట్టేవారు ,మొక్కుకొనేవారు చాలామందే ఉంటారు .ఐతే మా నాన్నగారికి మాత్రం ఆడపిల్లలంటే చాలా ఇష్టం .ఐతే ముందు అన్నయ్య పుట్టేశాడు .అన్నయ్య పుట్టేసరికి నాన్నగారు ఇంకా ట్రైనింగ్ లోనే ఉండటం వల్ల అమ్మ అమ్మమ్మగారి ఇంటిదగ్గరే ఉండేదట !నాన్నగారు అక్కడికి వెళ్ళినప్పుడు పాలకోసం వచ్చే చిన్నపిల్లల్ని (అమ్మమ్మగారికి పాడి ఎక్కువే ఉండేదట పాలు ,పెరుగు అమ్మటంవల్ల చాలామంది పిల్లలువచ్చేవారట ) ఎత్తుకొని ముద్దుచేసేవారట !వాళ్ళ ముక్కుకారుతున్నా కూడా :) పిన్నిలు ఇప్పటికీ చెప్పి నవ్వుతుంటారు . రెండోసారైనా ఆడపిల్ల పుట్టకపోతుందా అని అనుకొంటే అదేంటో అన్నయ్య పుట్టాక చాన్నాళ్ళు పిల్లలు కలగలేదు .ఇక నాన్నగారు ఒక పాప కావాలని కనిపించిన దేవుడికల్లా మొక్కుకొనేవారట!అమ్మమ్మ ఎప్పుడూ చెప్పేది చెట్టుకి ,పుట్టకి ఆఖరుకి పసుపు పూసిన రాయి కనిపించినా అమ్మవారిగా తలచి మొక్కేవారట .చివరికి అన్నయ్య పుట్టిన పన్నెండేళ్ళకి దేవీ నవరాత్రుల రోజుల్లో నేను పుట్టానట !

ఇక నేను పుట్టింది మొదలు కళ్ళల్లో పెట్టుకొని ఎంతో అపురూపంగా చూసుకొనేవారట అలా నేను నాన్నగారి బంగారు తల్లిని అయ్యానన్నమాట ! పెరిగి పెద్దయ్యాక తెలిసింది అందరూ మా నాన్నగారిలా ఉండరు కొందరు ఇలా చేతులారా ఆడపిల్లల్ని చంపుకోనేవారూ ఉంటారని ! ఏది ఏమైనా ఈ నాన్నని నాకిచ్చినందుకు దేవుడికి సదా కృతజ్ఞురాలిని !మీకూ నాన్న గుర్తుకొస్తున్నారు కదూ ! వెంటనే ఫోన్ అందుకోండి మరి :)

19 comments:

  1. ఎంతో నిజమండి. మా నాన్న లాంటి నాన్న నిచ్చినందుకు నేను కూడా సదా దేవుడీకి కృతజ్ఞురాలిని. మా అమ్మ కు మా అక్క నేను ఇద్దరు పుట్టేక ఆరోగ్యం పూర్తి గా పాడయ్యంది అట, అప్పుడు మా అమ్మ అబ్బాయి/వంశాంకురం కోసం పట్టుబడితే మా అమ్మ కు చెప్పకుండా సర్జరీ చేయించుకుని ఎవరైతే ఏమి మన బిడ్డలు అలాంటి పిచ్చి ఆలోచనలు మాను బిడ్డలకు తల్లి అవసరం వుంది అందునా ఆడ పిల్లలకు, వున్న పిల్లలకు తల్లి లేకుండా చేసే మొగ పిల్ల వాడు నాకు వద్దు అని చెప్పేరట. I am so grateful to my dad for all the love and affection he showed and all the knowledge and wisdom he gave me to distinguish good and bad and all the ethical values he taught us. He left us at age of 45 but gave such strong imprints in our lives that we always carry with us and pass it to our future generations. Sorry చాలా ఎమోషనల్ అయ్యనా, నాన్న అంటే నేను అలా ఐపోతాను సారి.

    ReplyDelete
  2. ఇంకా ఇలాటివి జరుగుతూ ఉండడం శోచనీయం. మా ఇంట్లో, మా దగ్గర బంధువులు, నా కజిన్స్ అందరూ ముందుగా ఆడపిల్లే కావాలి అనుకున్నవాళ్ళు , ఆడపిల్లే కలగాలని మొక్కుకున్న వాళ్ళే. ఆడపిల్ల తో ఇంటికి వచ్చే అందమే వేరని మేమందరం అనుకుంటూ ఉంటాం. ఈ జెనరేషన్ లో కూడా చదువుకున్న వారిలో కూడా ఇంకా ఈ వివక్ష ఉంటె అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదు.

    ReplyDelete
  3. మా అమ్మాయిని గుర్తుకుతెప్పించారు,అయినా ఎప్పుడు మరచిపోయాం గనుక గుర్తుకుతెచ్చుకోవడానికి.
    నవరాత్రులలో పుట్టానంటున్నారు,మరి మీదే రూపమో! అదేనండి నవరాత్రులలో అమ్మవారు రోజుకో రూపంలో ధర్శనమిస్తారు కదా! :)

    ReplyDelete
  4. మీ కామెంట్ స్పేస్ ను వాడుతున్నందుకు ముందుగా క్షమాపణలు. దయచేసి ఒక్కసారి జీవని వెబ్సైట్ ను చూసి మార్పులు చేర్పులు సూచించవలసిందిగా కోరుతున్నాము. మి అమూల్యమైన సలహా తప్పక ఉపయోగపడుతుంది.

    మీ,

    జీవని.

    ReplyDelete
  5. పరిమళ గారు మీరు నిజంగానే అదృష్టవంతులు. ఎంత అంటే నేను చెప్పలేనంత! అటువంటి నాన్న, అన్నయ్య... భర్త కూడా! మీరు ఎప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను.

    ReplyDelete
  6. నవరాత్రి రోజుల్లో పుట్టారు అంటే చూసారా....పూజలు వృధా కాలేదన్నమాట!:)

    ReplyDelete
  7. అదృష్టవంతులు . మేం నలుగురు ఆడపిల్లలం మా నాన్న ,అమ్మలకి "బంగారు తల్లులమే "-:)
    @భావన
    మనసు చివుక్కుమందండీ ఒక్కసారే ...ఏమైనా అంతటి ఉన్నతమైన వ్యక్తి మీకు తండ్రి కావడం అదృష్టం .

    ReplyDelete
  8. మా ఇంట్లో ఆడపిల్లలకే అగ్రాసనం.. ఇప్పుడే కాదండి, కొన్ని తరాలుగా..చక్కని టపా..

    ReplyDelete
  9. అంతగా పూజలు చేయలేదు కానీ... నేను కూడా మా అన్న పుట్టిన చాలా కాలానికే పుట్టాను :)
    మా నాన్నగారికి కూడా నేనంటే ఆపేక్ష ఎక్కువ!
    నేను ఎటైనా ఊరెళ్ళి ఒకటి రెండు రోజులు ఇంట్లో లేకపోతే పాపం ఆయనకి కాళ్ళు చేతులు ఆడవు. ప్రతిదీ నాకే చెప్తారు, అమ్మ కంటే ముందు.
    హ్మం... నా పెళ్ళయ్యాక ఎలా ఉంటారో అని తలుచుకుంటేనే ఏదోలా ఉంటుంది నాకు :(

    ReplyDelete
  10. మీ నాన్నగారికి ఇంకా బంగారుతల్లులను అపురూపంగా చూసుకుంటున్న ప్రతి అమ్మా నాన్నకీ కూడా నమస్సులు.

    ReplyDelete
  11. మీ నాన్న గారికి మీరెంత ఇష్టమో మీ ఉప్మా టపాలోనే తెలిసిపోయిందండీ...ప్రతీ ఒక్క ఆడపిల్లకి ఇలాంటి అదృష్టం వరిస్తే ఎంత బాగుంటుందో!

    ReplyDelete
  12. ముగ్గరము ఆడపిల్లలమైనా అబ్బాయి కావలనుకోలేదు , మా అమ్మా నాన్నగారు . అమ్మాయైనా , అబ్బాయైనా ఒకటే అనుకున్నారు. నేనూ మా నాన్నగారి కూచినని మావారు ఎప్పుడూ ఏడిపిస్తూవుంటారు . మా నాన్నగారు గుర్తొచ్చి పోన్ అందుకుందా మన్నా , అందంత దూరానికి వెళ్ళిపోయారు .

    ReplyDelete
  13. మా యింట్లో ఆడపిల్లలదే అగ్రాసనం. కానీ నాకు పుట్టిన మొదటి సంతానం premature delivery కావడంతో నా బంగారు తల్లి పుట్టిన 8 రోజులకే blue baby కావడంతో చనిపోయింది. ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నా. మీ పోస్టు చదువుతుంటే తన రూపం కదలాడుతోంది.

    ReplyDelete
  14. baavundi parimalam gaaru..free gaa vunte naa blog lo article chadavandi

    ReplyDelete
  15. నేనూ మా ఇంట్లో బంగారు తల్లినే, ఎంత అదృష్టం కదూ..!
    మీ టపా చదివాక నాక్కూడా బోలెడు సంఘటనలు, సంగతులు గుర్తొచ్చాయి :)

    ReplyDelete
  16. @ భావన గారు !మీరు ఎంత అదృష్టవంతులో అనుకుంటూ ఉండగానే మనసంతా బాధతో నిండిపోయిన్దండీ ....మనుషులు కాలం చెల్లి వెళ్ళిపోయినా వారి మమతలు మాత్రం చిరకాలం మనతోనే ఉంటాయండి .సారీ ఎందుకండీ మీ ఎమోషన్ ను మాతో పంచుకున్నారంటే మేం మీ మిత్రులమనే కదా !

    @ వాసుగారు, అవునండీ లక్ష్మీ స్వరూపం కదా ఆడపిల్లంటే ! ధన్యవాదాలు .

    @ విజయమోహన్ గారు, మీ అమ్మాయిని తలుచుకున్నారన్న మాట ! ధన్యవాదాలు ! ఇక నారూపం అందరూ ప్రతిపూటా తలుచుకోనేదే :)

    @ సవ్వడి ! మీరు పాత టపాలను భలే గుర్తుపెట్టుకున్నారే ! థాంక్స్ !
    @ చిన్నిగారు ,ఐతే మీరూ మాజట్టే !

    ReplyDelete
  17. @ మురళిగారు , మరి మేం బంగారు తల్లులం కదండీ :) ధన్యవాదాలు

    @ ప్రణీత స్వాతిగారు , ధన్యవాదాలు .

    @ చైతన్య గారు ,ఐతే ఒక ఐడియా అల్లుడ్ని ఇల్లరికం తెచ్చుకోమనండి లేదా నాన్నగార్నే అల్లుడరికం వచ్చేయమనండి :) ధన్యవాదాలు .

    @ వేణూశ్రీకాంత్ గారు ,ధన్యవాదాలు .

    @ శేఖర్ గారూ ! నా ఉప్మాని మీరింకా మర్చిపోలేదన్న మాట :) ధన్యవాదాలండీ !

    ReplyDelete
  18. @ మాలాగారు , ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపిగురుతులన్నారు కదండీ ....పిల్లల్లోనో లేక వారి పిల్లల్లోనో చూసుకొని ఆనందపడితే పైనుండి ఆయన ఆశీర్వదిస్తారు .చివరిలో అనవసరంగా ఫోన్ అని రాసి బాధపెట్టినట్టున్నాను sorry !

    @ వర్మగారు , క్షమించాలి మీమనసు కష్టపెట్టిఉంటే ! మీ పాప నక్షత్రాలతో జతకట్టి చందమామతో ఆడుకోవాని వెళ్లి ఉంటుందండీ ..నక్షత్రం శాశ్వతం కదా ..అలాగే తనూ మీ జ్ఞాపకాల్లో శాశ్వతం !

    @ స్వామిగారు , మీ బ్లాగ్ చూశాను మీరాక మా అదృష్టంగా భావిస్తున్నాను .ధన్యవాదాలండీ .

    @ మధురవాణిగారు , గుర్తుకోచ్చేశాయా ..ఐతే మీరూ మాజట్టే ...మీరూ మాజట్టే ..:) :)

    ReplyDelete