Friday, November 21, 2014

గోవర్ధనగిరిధారి..... మురారి!

చాలా రోజులైంది కృష్ణయ్యను చూసి అనుకుంటూ నిన్న సాయంత్రం వేణుగోపాలస్వామి గుడికి వెళ్ళాము. నాలుగ్గంటలకే వెళదామని అలా లేటైపోయి వెళ్లేసరికి ఆరుగంటలైంది.వెళ్లేసరికి ఆకాశదీప పూజ జరుగుతోంది. ఆలశ్యంగా వెళ్ళటం మంచిదైంది పూజలో పాల్గొనే అదృష్టం మాత్రమే కాదు గోపూజలో పాల్గొనే అవకాశం కూడా దక్కింది.

kphb కాలనీ మలేషియాటౌన్ షిప్ opp లో ఉంది గోవర్ధనగిరిపై శ్రీ వేణుగోపాలస్వామి గుడి. చాలామందికి తెలీదు అక్కడో గుడి ఉందని. నగరం మధ్యలో ఉన్నా చిన్న కొండపై ఉండటంవల్ల అక్కడ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కొండపై అడుగు పెట్టగానే ఆలయం,ధ్వజస్తంభం, ఒక పక్కగా గోశాల, పరుగులిడుతూ తిరుగాడే ఓ బుజ్జి తువ్వాయి{పేరు గోపాలుడు),మంద్రంగా వినిపించే అన్నమాచార్య కీర్తనలూ.....  ఇవన్నీ మనకు ఆధ్యాత్మిక చింతనతో పాటూ ఆహ్లాదాన్నీ కలిగిస్తాయి. ఇక రుక్మిణీ సత్యభామలనిరువైపులా నిలుపుకున్న వేణుగోపాల స్వామిని చూడటానికి రెండుకళ్ళూ సరిపోవు.ఆయన మృదు మధుర సుందర వదనారవిందం మనసును దోచుకుంటుంది. మహాలక్ష్మి అమ్మవారు, గోదాదేవి కూడా అదే మండపంలో కొలువై ఉన్నారు. ప్రధాన ఆలయానికి కాస్త పక్కగా చిన్న ఆంజనేయస్వామి గుడి ఉంది. 

నేను మొదటిసారి ఓ రెండేళ్ళ క్రిందట వెళ్లాను. ఆతర్వాత నుండి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము .అప్పటికి ఇప్పటికీ గుడి చాలా అభివృద్ధి చేశారు. కాని కొండపైకి దారి అంతగా బావుండదు కార్లు వెళతాయి కాని రాళ్ళతో కూడిన మట్టి రోడ్డు. దాతల సహకారంతోనే గుడి నడుస్తుందని చెప్పారు. ప్రస్తుతం రోడ్డు,కొండపైకి ప్రవేశించే చోటఅందరికీ తెలిసేలా  ఒక ఆర్చి నిర్మించాలని సంకల్పించారట.స్వామి ఆశీస్సులు దాతల సహకారం ఉంటే అవి కూడా పూర్తవుతాయని ఆశిస్తున్నామని చెప్పారు. 

ప్రతి ఏటా కృష్ణాష్టమి,గోవర్ధనగిరి తిరునాళ్ళు , కార్తీక, ధనుర్మాసాలలో విశేష పూజలు జరుగుతాయట! రాబోయే 29వ తేదీ మాధవాష్టమి కూడా బాగా చేస్తారట!

భక్తీ, ఆధ్యాత్మిక చింతన అనేవి పక్కన పెడితే అక్కడ ఉన్నంతసేపూ కనులకు ఆహ్లాదం, మనసుకి ప్రశాంతత కలుగుతుందనేది నిజం! పైన ఉన్నది బుజ్జి గోపాలుడే :) గుడి ఫొటోస్ కూడా తీసి ఉంటే  బావుండేది ప్చ్.... ఈసారి వెళ్ళినప్పుడుతీస్తాను.

Monday, November 10, 2014

ఓ అమ్మ!

చందమామ రావే జాబిల్లి రావే 
కొండెక్కి రావే కోటి పూలు తేవే
అంటూ గోరుముద్దలు తినిపించాను
నిదురపో నాపాప నిదురపో తల్లీ
 నిద్రలకు నూరేళ్ళు నీకు నూరేళ్ళు
 అంటూ జోలపాడి నిద్రపుచ్చేను
 నీలాలు కారితే నేచూడలేను 
పాలైన కారవే బంగారు కళ్ళు 
అంటూ పువ్వులా పెంచుకున్నాను 
మందారంలాపూస్తే మంచి మొగుడొస్తాడు 
గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు
 అంటూ అరచేత గోరింట పెట్టాను 
రెక్కల గుర్రమెక్కి ఓ రాజకుమారుడొస్తాడు 
ఈబుల్లి రాణీగార్ని తీసుకెళ్తాడు 
అంటూ కధలు చెప్పాను 
చిట్టితల్లీ..... అప్పుడు తెలీలేదు 
 నిజంగానే రాజకుమారుడొచ్చి 
 ఏడు సముద్రాలకావల 
ఒంటి స్థంభం మేడలో నిన్నుంచితే 
అన్నిసముద్రాలుదాటి నీ దగ్గరికి
 రావటానికి నాకు రెక్కు లేవని 
నీతో మాట్లాడాలంటే దూరవాణిలూ 
నిన్ను చూడాలంటే దూరదర్శినిలూ 
కావాలని....,,,  కాని 
నిన్నుహృదయానికి హత్తుకోవాలంటే 
ఏ మంత్రం తంత్రాలున్నాయో మరి!

Sunday, February 23, 2014

శాశ్వతం కాని బంధం!?


నీవూ నేనూ నిన్నా ఉన్నాము, నేడూ ఉన్నాము
ఉందో లేదో తెలియని రేపటికోసం ఏ కలకనను?
అహంకారం మనిద్దరిమధ్యా గోడ కడుతూ వుండేది
వెనువెంటనే మమకారం దాన్ని పడగోట్టేసేది
ఇది నిరంతరం..... శాశ్వతం అనుకున్నాను కాని
చుక్కాని లేని నావలా నన్ను నడి సంద్రంలో విడిచిపెట్టి
నువ్వుమాత్రం దూరతీరాలకు పయనమౌతున్నావు
లేనిది ఎప్పటికీ వుండదు వున్నది ఎప్పటికీ లేకపోదు
అంటూ వేదాంతం చెబుతున్నావు అది నిజమేనేమో
ఐనా.....
నీలా తామరాకుపై నీటి బొట్టులా ఉండలేకపోతున్నా
శాశ్వతం కాని బంధాల్ని ఓ కన్నీటి బొట్టుతో విడువలేకున్నా!

Friday, February 14, 2014

ఇది చూడండి!



Woh Din - A tribute to the 90's


you tube నుండి..... 

Wednesday, January 22, 2014

మరపురాని మనిషి!




అక్కినేని నాగేశ్వరరావుగారికి నేను వీరాభిమానిని కాకపోయినా అప్పుడప్పుడూ ఆయన పాత చిత్రాలను చూస్తూ ఉంటాను. ఆయన చిత్రాలు చూస్తున్నప్పుడల్లా ఆయనలోని మహానటుడ్ని చూసి అబ్బురపడిన సందర్భాలు చాలానే వున్నాయి. ఈమధ్యే అటువంటి ఆణిముత్యంవంటి చిత్రాన్ని చూడటం జరిగింది. అదే "మరపురాని మనిషి". విశ్వాసానికి, మానవీయవిలువలకు అద్దంపడుతూ తీసిన ఈ చిత్రాన్నిచూస్తున్నంతసేపూ నాగేశ్వరరావుగారు ఆపాత్రలో నటిస్తున్నారనే అనిపించదు. చిన్నతనం నుండే అన్యాయాన్ని సహించని,ముక్కుసూటి మనిషిగా కష్టజీవిగా బాబు పాత్రలో జీవించినతీరు చిరస్మరణీయం! ఒకరోజు ఒక కుటుంబం అభిమానంతో పెట్టిన పట్టెడన్నానికి బదులుగా ఆకుటుంబ పెద్ద చనిపోయి తల్లీ బిడ్డలు కష్టంలో వున్నప్పుడు వారిని ఆదుకోవటానికి తన జీవితాన్ని ధారపోసిన రిక్షాఅబ్బిగా.....చివరికి తాను పెంచిన అమ్ములే తనను చీత్కరించినా క్షమించి ఆమె వివాహం జరిపించి కానుకగా విశ్వాసానికి ప్రతీక ఐన కుక్కబొమ్మ కానుకగా ఇవ్వడం చూసినప్పుడు కంటతడి పెట్టనివారు వుండరు. ఎక్కడో లేడులే దేవుడు మమతలున్న మనసులో కొలువుంటాడు... అంటూ ఆనాడు మరపురాని మనిషిగా నటించారు ఈనాడు మరపురాని మనిషిగా నిష్క్రమించారు.తెలుగు సినిమాఉన్నంతవరకూ ఆయన మరపురాని మనిషిగానే వుంటారు. ఆయన ఆత్మకుశాంతికలగాలని ప్రార్ధిస్తున్నాను. 


Friday, October 25, 2013

Quotation of Bob Marley!


Sunday, December 30, 2012

కొవ్వొత్తులతో కాదు నాకు నివాళి!

ముగిసిపోయే కధనుకాను
రగులుతున్న వ్యధను నేను
చనిపోలేదు నేను......
మీ కొవ్వొత్తుల వెలుగులో జీవించే ఉన్నాను
అత్యాచార తిమిరాన్ని తరిమికొట్టే ఆయుధంగా
నా చావు మీ ఉద్యమానికి స్ఫూర్తి ఐతే
నా మరణం కూడా ధన్యం!
నా మరణానికి కారణమైన కామాంధుల
తలలు తక్షణం తీసి కోటగుమ్మానికి  వ్రేలాడగట్టమని
ఆజ్ఞాపించే రాజే లేడా ఈ లోకంలో
రాచరికానికి సెలవిచ్చేసి, ప్రజలే ప్రభువులన్న
ప్రజాస్వామ్యంలో నా మరణానికి సమాధానం
కోట్లు ఖర్చుపెట్టి ఓట్లు కొనుక్కున్న
ఏ ప్రభువు నడగాలి ?
మరోసారి ఆడపిల్ల పై చేయి వేయాలంటే ఒణుకు పుట్టేలా
ఏ ప్రభువు శిక్షవేస్తాడు ఆ దుర్మార్గులకు?
ఎంతకాలానికి ?
 కన్నీళ్ళతోనో, కొవ్వొత్తులతోనో కాదు నాకు నివాళి
యత్రనార్యస్తు పూజ్యంతే అని పుస్తకాలకే పరిమితం చేయకండి
ప్రాధమిక విద్యనుండే పిల్లలకు బోధించండి
 మానవత్వమున్న మనుషులుగా తీర్చిదిద్దండి
స్త్రీలను పూజించక్కర్లేదు 
వారి ముఖంపై చిరునవ్వు చెదరనీయకండి
భయం నీడన బ్రతుకు వెళ్ళదీయకుండా 
కొంచెం ధైర్యంగా నడిచేలా రక్షణ కల్పించండి
హింసకు గురైన వారిపట్ల  కాస్త సానుభూతి చూపించండి
చులకనగా మాట్లాడి మా ఆత్మలకు కూడా
శాంతి లేకుండా చేయకండి 
ఇదే నాకు, నాలాంటి ఎందరో అభాగినులకు
నిజమైన నివాళి!!

** నేనుసైతం అంటూ  ఓ టపా రాసి చేతులు దులిపేసుకోవటం తప్ప ఏమీ చేయలేని నానిస్సహాయతకు బాధపడుతూ నిర్భయకు అశ్రునివాళి! రాబోయే సంవత్సరమైనా ఇటువంటి చేదు జ్ఞాపకాలు మిగల్చకుండా అంతా మంచే జరగాలి, అందరికీ మంచే జరగాలని కోరుకుంటూ ఈ వత్సరానికి వీడ్కోలు!