Monday, November 10, 2014

ఓ అమ్మ!

చందమామ రావే జాబిల్లి రావే 
కొండెక్కి రావే కోటి పూలు తేవే
అంటూ గోరుముద్దలు తినిపించాను
నిదురపో నాపాప నిదురపో తల్లీ
 నిద్రలకు నూరేళ్ళు నీకు నూరేళ్ళు
 అంటూ జోలపాడి నిద్రపుచ్చేను
 నీలాలు కారితే నేచూడలేను 
పాలైన కారవే బంగారు కళ్ళు 
అంటూ పువ్వులా పెంచుకున్నాను 
మందారంలాపూస్తే మంచి మొగుడొస్తాడు 
గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు
 అంటూ అరచేత గోరింట పెట్టాను 
రెక్కల గుర్రమెక్కి ఓ రాజకుమారుడొస్తాడు 
ఈబుల్లి రాణీగార్ని తీసుకెళ్తాడు 
అంటూ కధలు చెప్పాను 
చిట్టితల్లీ..... అప్పుడు తెలీలేదు 
 నిజంగానే రాజకుమారుడొచ్చి 
 ఏడు సముద్రాలకావల 
ఒంటి స్థంభం మేడలో నిన్నుంచితే 
అన్నిసముద్రాలుదాటి నీ దగ్గరికి
 రావటానికి నాకు రెక్కు లేవని 
నీతో మాట్లాడాలంటే దూరవాణిలూ 
నిన్ను చూడాలంటే దూరదర్శినిలూ 
కావాలని....,,,  కాని 
నిన్నుహృదయానికి హత్తుకోవాలంటే 
ఏ మంత్రం తంత్రాలున్నాయో మరి!

4 comments:

  1. Hello parimalam gaaru..how r u? Hope everything is fine at your end.

    ReplyDelete
  2. పరిమళగారు...చాన్నాళ్ళకి మిమ్మల్ని ఇలా బ్లాగ్ లో చూస్తుంటే ఆనందంగా ఉందండి. పాత నెచ్చెలిని కలిసిన ఫీల్. కుశలమే అని తలుస్తాను.
    మీరు రాసిన "ఓ అమ్మ" ఆర్ద్రతగా ఉంది. ఇకపై రాస్తూ ఉంటారని ఆశిస్తూ....

    ReplyDelete
  3. నిన్న బయట నుండి ఆ కాస్త కామెంట్ రాసానండీ.. ఇంటికొచ్చాకా తెలుగులో రాద్దామనుకున్నా.. ఇప్పుడు గుర్తొచ్చింది. అమ్మాయి పెళ్ళి చేసారా? బెంగగా ఉందా? అమ్మానాన్నలకు తప్పదండి మరి.. ఇప్పుడు దూరాల్ని తగ్గించడానికి ఐ ఫోన్లు, వీడీయో చాట్స్, వాట్సప్ లు వచ్చేసాయి కదా వాటితో కాలక్షేపం చేసేయండి.. అలవాటు పడేదాకా.. టేక్ కేర్ అండీ.

    ReplyDelete
  4. @ తృష్ణ ధన్యవాదాలు... మీ ఓదార్పుకు.... ఇంకా నన్ను గుర్తుంచుకున్నందుకు :)
    @ పద్మార్పితగారు " పాత నెచ్చెలిని కలిసిన ఫీల్" ఎంత ఆనందం కలిగిందో థాంక్స్ :)

    ReplyDelete