Monday, July 16, 2012

తిరిగొచ్చిన బాల్యం!

నాన్నా...నాన్నా!
ఏంటి నాన్నా?
అదేంటి నాన్నా?
అది కాకిరా బాబూ....
అదేంటి?మళ్ళీ అడిగాడు కొడుకు.... అదికాకి నాన్నా...బదులిచ్చాడు తండ్రి.]
ఆమర్నాడు కొడుకు మళ్ళీ అడిగాడు.అదేంటి? అది కాకినాన్నా...
ప్రతిరోజూ వీధిఅరుగుమీద కూర్చుని ఒడిలోకొడుకుని కూర్చోబెట్టుకొని ఆడించడం...కావుకావుమని ఎదోక కాకివచ్చి చుట్టుపక్కల వాలటం....కొడుకు పదేపదే అదేంటి?అని అడిగేవాడు...తండ్రి ఓపిగ్గామళ్ళీ మళ్ళీ అడికాకి అని బదులిస్తూఉండేవాడు.

కొన్నేళ్ళు గడిచాయి కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు.పెళ్లైంది..కొడుకు పుట్టాడు.అతని తండ్రి ముసలివాడయ్యాడు.ఆస్తిపాస్తులన్నీ కొడుక్కి అప్పగించి బాధ్యత దించేసుకున్నాడు.ఐతే వృత్తిరీత్యా కొడుకుకోసం ఎవరొకరు ఇంటికి వస్తూండేవారు.ముసలితండ్రి....ఎవరుబాబూ వచ్చిందిఅని అడిగాడు కొడుకు విసుగ్గా వచ్చినతని పేరు చెప్పాడు.మర్నాడు తండ్రి మళ్ళీఅడిగాడు ఎవరూ వచ్చింది?అని.ఎవరైతే మీకెందుకండీ...తిని ఓమూల కృష్ణా రామాఅనుకొంటూ కూర్చోక...ఒకటే ఆరాలు పనీపాటా లేకుండా అంటూకేకలేశాడు కొడుకు.

ముసలితండ్రి ముఖం చిన్నబోయింది.వణుకుతున్న చేతులతో పైకండువా తీసి రాబోతున్న కన్నీటినివత్తుకున్నాడు.ఎందుకుతాతా ఏడుస్తున్నావ్అంటూ మనవడు ఒడిలో చేరాడు.ఏంలేదుబాబూ చిన్నప్పుడు మీనాన్న అదేమిటి? ఇదేమిటి? అని వందసార్లు అడిగినా నేను అన్నిటికీ ఓపిగ్గా సమాధానం చెప్పేవాడిని.కాని ఇప్పుడు నేను ఒకసారి అడిగితేనే విరుచుకుపడుతున్నాడు అంటూ ఎంతో బాధగాచెప్పాడు.మనవడు తన చిట్టి చేతులతోతాతని ఓదార్చాడు.

మరికొన్నేళ్ళు కాలచక్రంలో తిరిగిపోయాయి.ఇప్పుడు కొడుకు ముసలి తండ్రి అయ్యాడు, మనవడు కొడుకు స్థానంలోకి వచ్చాడు. కంటిచూపు మందగించి ప్రతిదాన్నీ ఇదేమిట్రా అంటూ కొడుకును వేధించసాగాడు తండ్రి. కాని కొడుకు ఏమాత్రం కసురుకోకుండా అన్నిటికీ ఓపిగ్గా సమాధానం చెపుతూ తండ్రికి ఏలోటూ రాకుండాఅన్ని జాగర్తలూ తీసుకొంటూ చిన్న పిల్లాడిలా చూసుకొనేవాడు.

ఒకరోజు కొడుకు స్నేహితుడు అతడ్ని కలవటానికి ఇంటికివచ్చాడు.ఎవర్రా అదీ....అంటూ వివరాలుఅడగసాగాడు తండ్రి.ఏదో ముక్తసరిగా జవాబిచ్చిలోపలికెళ్ళిన అతను ఎలా భరిస్తున్నావురా బాబూ ఈముసలాయాన్నిఏదైనా వృద్ధాశ్రమంలో చేర్పించక అని విసుగ్గా అన్నాడు తన స్నేహితుడితో.
అదేంట్రా అలా మాట్లాడతావ్...మనల్ని పెంచి పెద్ద చేయడానికి అమ్మానాన్నా ఎంత కష్టపడి వుంటారు? మనల్ని ఎంత ప్రేమగా చూసేవారో,మనమెన్ని అల్లరిపనులు చేసినా ఓర్పుగా భరించేవారు.మనకు చదువుసంధ్యలు చెప్పించి,ఒంట్లో శక్తి ఉన్నన్నాళ్ళూ మనకోసం కష్టపడి కూడబెట్టి,మనల్నిఅందలం ఎక్కించడంకోసం ఎలా వారి చెమటతో సోపానం ఏర్పరిచారో ఒక్కసారి గుర్తు తెచ్చుకో.ఇప్పుడు వారు మనపట్ల బాధ్యతలన్నీ నెరవేర్చి వయసుడిగి వృద్ధులైతే...వారు పనికిరానివారైనట్లుకాదు. వారికి వారిబాల్యం తిరిగొచ్చినట్టు. అందుకే మనం వారిని చిన్నపిల్లలతో సమంగా చూసుకోవాలి.

కొడుకు తనస్నేహితుడితో చెబుతున్న మాటలువిన్న తండ్రికి తన తండ్రిపట్ల తనెంత అనుచితంగా ప్రవర్తించింది గుర్తుకువచ్చి సిగ్గుతో కృంగిపోయాడు. తలపైకెత్తి కన్నీళ్ళతో....నాన్నా..ఏలోకంలో ఉన్నావో, నన్ను క్షమించు నాన్నా!ఆర్తిగా వేడుకున్నాడు. అలలా ఓ చిరుగాలి అతన్ని స్పృశించింది ఓదార్పుగా....నాన్న మనసులా....

**ఆదివారం సత్యమేవజయతే చూసినప్పుడు, తాము అడుక్కున్న డబ్బుతో కూడా తమను తరిమేసిన పిల్లలకు,మనవలకు ఏదైనా కొనుక్కుని తీసుకెల్తారని విన్నపుడు మనసు ద్రవించింది.అందుకే అన్నారు అమృతం తాగినవాళ్ళూ...దేవతలూ, దేవుళ్ళూ....అవి కన్నబిడ్డలకు పంచే వాళ్ళూ అమ్మానాన్నలూ...అన్నారు.
** చిన్నపుడెపుడో విన్న కధకు కొనసాగింపునిచ్చాను. బావుందాండి?

Sunday, July 1, 2012

కన్నులపండుగ !

మావూరిదేవుడ్నిచూశారుకదండి....గుడిప్రతిష్ఠ సందర్భంగా కోలాటం పెట్టించారు.మన ప్రాచీనజానపదకళలో ఒకటైన కోలాటానికిఆదరణ తగ్గిపోయిన ఈరోజుల్లోతిరిగి ప్రాణం పోయటానికి శాయశక్తులా కృషిచేస్తున్నఆ ట్రూప్ ని చూస్తేఎంతసంతోషంకలిగిందోచెప్పలేను. గణపతినిస్తుతిస్తూ మొదలైన కోలాటం వెంకటేశుడ్నికీర్తిస్తూ, ఈశ్వరుడ్నిప్రార్థిస్తూ, సకలదేవతల్నీ ఆహ్వానిస్తూ,వరదయ్య పదాలతోపాటుమా కృష్ణయ్యను ఆటపట్టిస్తూకోలాహలంగా సాగింది.గొల్లవారివాడలకు కృష్ణమూర్తి...నీవు ఏమిపనికివచ్చినావు కృష్ణమూర్తి అంటూ ముద్దుపాపలు,పల్లెపడుచులు ఆడుతుంటే గోకులం కళ్ళముందు ఆవిష్కృతమైంది.జడకోలాటంలో భాగంగా ఆడుతూనే తాళ్ళను జడలాగాఅల్లి తిరిగి విప్పటం కన్నులపండుగే!

జాతరలకు,నవరాత్రులకు మొదలైనవాటికి సినిమాలు,మ్యూజికల్ నైట్ లు పెడుతున్న రోజుల్లో ఇలా పిలిచేవారు అరుదని...తిరుమలతిరుపతి దేవస్థానం వారు బ్రహ్మోత్సవాలకు,ఇతర పర్వదినాలలోను వీరిని ఆహ్వానించి టికెట్స్,వసతి కల్పించి స్వామివారిఊరేగింపులోపాల్గొనే అవకాశం కల్పిస్తూవుంటారని విజయలక్ష్మిఅనే కళాకారిణి చెప్పారు.కోలాటం చేసినందుకు వారేమీ ప్రతిఫలం ఆశించట్లేదు.బస్ చార్జీలు పెట్టుకొని ఆపూట ఫలహారం ఏర్పాటుచేస్తేచాలు. చుట్టుపక్కల గ్రామాలలో ఇటువంటిసందర్భాలలో ఆహ్వానిస్తే తప్పకవస్తామనిచెప్పారు.అంతేకాక ఎవరైనాకోలాటం నేర్చుకోవాలన్న ఔత్సాహికులుంటే ఉచితంగా నేర్పిస్తామని కూడా తెలియచేశారు.ఆకళాకారులకు వందనం!

ఆజనంలో నావీలును బట్టి కొన్ని ఫోటోలు తీశాను మీరూచూడండి.

గోపస్త్రీ పరివేష్టితో విజయతేగోపాలచూడామణీ....

















































































Monday, June 25, 2012

మావూరి దేవుడు!

మా ఊరిలో కోదండరామచంద్రస్వామి వారి విగ్రహ ప్రతిష్ట జరిగింది.దాని వెనక చిన్నకధకూడావుంది. కధంటేకధకాదండోయ్ నిజంగా జరిగింది.చాలా ఏళ్ళక్రితం అంటే దాదాపు ఓ ఎనభై ఏళ్ళక్రితం సంగతి! ఒక కుమ్మరి కుండలుచేసుకుంటూ ఒకచిన్నగుడిశలో ఉండేవాడట!తర్వాత ఏమైందో అతను ఎక్కడికో వెళ్ళిపోయాడట!అతనిగుడిశ అలాగేఖాళీగా ఉండటం చూసి ఒక అవ్వమూడు కొయ్యముక్కలు పాతి వాటికి పసుపుకుంకుమ పెట్టి సీతారామలక్ష్మణులని పూజించేదట!కాలక్రమంలో అవ్వ చనిపోయినాగ్రామస్తులు ఆకొయ్యముక్కలనే రామునిగాభావించి ప్రతిశ్రీరామనవమికి కల్యాణం చేస్తున్నారట!ఇన్నేళ్ళకి గ్రామస్తులంతా అక్కడ చిన్నగుడికట్టి రాముడ్ని ప్రతిష్టించాలని సంకల్పించారు.సంకల్పం మాత్రమే మనది...కార్యభారం ఆయనదేకదా...అనుకున్నదే తడవుగా అందరూ తలోచేయివేసి గుడిపూర్తి చేశారు.ఇన్నాళ్ళుగా పూజలందుకున్నకొయ్యరాముడ్ని సముద్రంలోనిమజ్జనం చేసి ఆస్థానంలో కోదండరాముడ్ని ప్రతిష్టించారు.అన్న సంతర్పణ, కోలాటం, భజనలు, ఊరేగింపులు...వైభవంగా స్వామివారి ప్రతిష్ట జరిగింది.

సీతాలక్ష్మణసమేతరామచంద్రమూర్తిని మీరూచూడండి!






రామునివెంటే రాంబంటు!



Sunday, May 6, 2012

సత్యమేవజయతే!


ఏమాత్రం లాజిక్ మాత్రమే కాదు ముగింపే లేని సీరియళ్ళు,చూస్తుంటేనే కంపరం పుట్టించే రియాలిటీ షోలు,ప్రతి ఎలిమినేషన్ లో ఏడుపులు,తిట్టుకోవడాలు చూసేవాళ్ళని వెర్రి వాళ్ళని చేసే మరికొన్ని షోలు,వంటలు,రిటైర్ ఐన నటీమణులు వాళ్ళ టాలెంట్ చూపిస్తూ చేసే షోలు,ఏ హిందీ చానెల్ వాళ్ళో చేసిన ప్రోగ్రామ్స్ ని ప్రేక్షకులమీద రుద్దుతూవాళ్ళు వేసుకునే పిచ్చి జోకులకి వాళ్ళే పగలబడి నవ్వుతూ కత్తితో పొడవకుండా,తుపాకితో కాల్చకుండా మనుషుల్ని చంపడం వీరికే సాధ్యం !ఇక వేసిన సినిమాలనే మళ్ళీ మళ్ళీ వేసినా వేరే దిక్కులేక వాటినే చూస్తూ పొద్దు పుచ్చటం అలవాటైపోయిన సగటు బుల్లితెర ప్రేక్షకులకి ......టివి పెట్టాలంటేనే భయపడిపోతున్న వారికి శుభవార్త!ఎడారిలో ఒయాసిస్సులా....మండువేసవిలో చిరుజల్లులా,ఒక ప్రయోజనకరమైన ఒక కార్యక్రమం!నిజమేనండీ .....మీరు నమ్మాలి!

అది అమీర్ఖాన్ సత్యమే వజయతే! ఈ ప్రోగ్రాం మిగిలిన భాషల్లో ఎప్పుడు మొదలైందో నాకు తెలీదుకాని నేను మాత్రం ఈరోజు ఈటివిలో ఉదయం పదకొండు గంటలకు చూశాను. మొదటి రోజే గుండెల్ని పిండేసే సత్యాలను తెలుసుకుంటుంటే మనం సభ్య సమాజంలో ఉన్నామా అనిపిస్తుంది,,అసలు మనుషులమధ్య మసిలే మృగాలు, మనుషులుగా చలామణి అవుతున్న రాక్షసుల గురించి వింటుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.టివిలో అన్నీ చెత్త ప్రోగ్రామ్స్ అని అనను కాని ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే కార్యక్రమాలు మన తెలుగులో చాలా తక్కువనే చెప్పాలి.

నిజాల్ని వెలికితీసి ప్రజల్ని చైతన్య వంతుల్ని చేయాలనే అమీర్ఖాన్ ప్రయత్నం విజయవంతం కావాలని ఆశిద్దాం!ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటలకి తెలుగులో ఈటివిలోను,హిందీలో స్టార్ ప్లస్ లోను ప్రసారమవుతుంది.ఈ చైతన్య యాత్రలో మనంకూడా చేయి కలపొచ్చు www.satyamevajayate.in ద్వారా మన అభిప్రాయాలను పంచుకోవచ్చు.

* ఎపిసోడ్ మిస్ ఐనవారు ఈ లింక్ లో చుడండి (స్టార్ ప్లస్ లో హిందీలో వచ్చింది)
http://www.youtube.com/watch?feature=player_embedded&v=u1vASMbEEQc

Thursday, April 26, 2012

గుర్తుకొస్తున్నాయీ ....గుర్తుకొస్తున్నాయి

చాలా ఏళ్ళ తర్వాత పెళ్ళికి వెళ్ళిన నేను నా చిన్ననాటి జ్ఞాపకాల నిధిని తవ్వి తీసుకున్నా! ఆ ఆనందాన్ని మీతో పంచుకోవాలనిపించింది.

ఈ రైల్వే స్టేషన్ లోనే ఎన్నోసార్లు మెయిల్ ఎక్కి రాజమండ్రి స్టేషన్లో దిగేవాళ్ళం .ఇప్పుడు కొత్త హంగులతో ముస్తాబయిందనుకోండి.ఆ కనిపించే బ్రిడ్జ్ కి అటువైపు రైల్వే క్వార్టర్స్ ఉండేది ఇటువైపు మాస్కూల్ ఉండేది.బజారుకి ,సినిమాకి దేనికి వెళ్ళాలన్నా బ్రిడ్జ్ దాటాల్సిందే అలా4,5,6  తరగతులు పూర్తయ్యాక 7 వ తరగతిలో బ్రిడ్జ్ కి ఇటువైపు స్కూల్ లో జాయిన్ చేశారు.అంటే ఆరవ తరగతిలో తెలివితేటలు పెరిగిపోయి బ్రిడ్జ్ ఎక్కకుండా పట్టాలు దాటి వెళ్లిపోతుంటే నాన్నగారు రెండుమూడు సార్లు రెడ్ హాన్డేడ్ గా పట్టుకొని తక్షణ రక్షణ చర్యగా అమలు చేశారన్న మాట :)  :)



ఇది నేను 7 , 8 , 9 తరగతులు చదివిన స్కూల్ .



ఇక్కడే ప్రేయర్ జరిగేది. ఆ షెడ్ ఒకప్పటి స్టేజ్ అక్కడ డ్రామాలు కూడా వేశాం:)


ఏడవ తరగతి వరకు క్రింది గదుల్లో .....ఎనిమిది నుండి పది వరకు పైన! ఎనిమిదో క్లాసులో అడుగుపెట్టిన మొదటి రోజు మెట్లేక్కుతున్నప్పటి గర్వం,ఏదో సాధించేసినట్టు ఆ ఆనందం గుర్తుకొచ్చి నవ్వొచ్చేసింది :)


పైన గదుల్లో సైన్స్ లాబ్ ,టీచర్స్ రూం ఉండేవి సెలవులు కదా అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి.ఎవ్వరూలేరు .ఇంతకూ మా బడి బావుందాండీ :)


ఇది మా నాన్నగారు పనిచేసిన ఆఫీస్! ఎన్నోసార్లు నాన్నగారి వేలుపట్టుకొని ఇక్కడకు వచ్చాను.ముఖ్యంగా దసరాకు దేవీపూజ చాలా బాగా చేసేవారు నాన్నగారు నన్ను తప్పకుండా తీసుకెళ్ళేవారు.మరమరాలు బెల్లం సెనగపప్పు కలిపి పంచేవారు.బయట నిలబడి ఫోటో తీసుకుంటుంటే ఎవరమ్మా అంటూ వచ్చిన పెద్దాయన నాన్నగారి దగ్గర పనిచేసిన గాంగ్ మేన్ అవటం ,ఆయన నాన్నగారిగురించి గుర్తుచేసుకుని చెప్పిన మాటలు ఆయన కూతురుగా మరోసారి గర్వపడేలా మర్చిపోలేని మధురానుభూతిని మిగిల్చింది.



ఈ బల్ల చూశారా నేను అక్కడనుండి వచ్చేసే టప్పుడు స్టేషన్లో కూర్చున్న బల్ల! ఈ బెంచి మీదకూర్చునే మాస్నేహితులందరం వెక్కి వెక్కి ఏడ్చాం !ఇక్కడే నా స్నేహితులు నాకు కళ్ళనిండా నీళ్ళతో....గుండె నిండా ప్రేమతో వీడ్కోలు పలికారు.స్టేషన్ ఎంత మార్పులు చేర్పులు చేసినా ఆ బల్లను అలాగే ఉంచడంతో నాకు ఆశ్చర్యం,ఆనందం రెండూ కలిగాయి.

ఇంకా మేము ఉన్న క్వార్టర్స్ , నేను ఆడుకున్నప్రదేశాలూ,స్కూల్ హాండ్ పంపులో నీళ్ళు తాగుతున్నపుడు ఇవి మినరల్ వాటర్ కాదు అంటూ మావాళ్ళ వెళాకోలాల మధ్య అన్నీ తిరిగి తిరిగి ,జ్ఞాపకాల్ని తడిమి చూసుకొని భారమైన మనసుతో తిరుగు ప్రయాణమయ్యాను. 

Thursday, March 22, 2012

ఉగాది శుభాకాంక్షలతో.....


చైత్రమింకా బొట్టిపెట్టి పిలిచిందో లేదో ...
తనుమాత్రం కుహూ మంటూ వచ్చేసింది
కోయిలమ్మ !
వసంతలక్ష్మికి స్వాగత గీతిక పాడుతూ ...
దారికిరువైపులా ఎర్రగా ...
విరగబూసిన మోదుగ పూలు
రాబోయే రోజుల్లో భానుని ప్రతాపానికి
చిహ్నాల్లా కనిపిస్తున్నాయ్
పిల్లల పరీక్షల కష్టాన్ని రాబోయే
సెలవులు మరిపించినట్టు ...
పగటి వేసవి తాపాన్ని
సాయంత్రం మల్లెలు మరిపిస్తున్నాయ్
వేపపూత సౌరభాన్ని మోసుకొస్తున్న
చిరుగాలులు రాత్రిళ్ళని ...
పరిమళభరితం చేస్తున్నాయ్
కొత్త చివుళ్ళు తొడిగిన చెట్లూ ..
విరగబూసిన మల్లె పొదలూ ...
మధుమాసాన్ని మధురంగా
మార్చేస్తున్నాయ్ !
ఆరు ఋతువుల్లోనూ వసంతాన్ని
మహారాణిని చేస్తున్నాయ్!
మరి మనం కూడా ఆరు రుచుల ఉగాదిని
ఆహ్లాదభరితంగా జరుపుకుందామా
ఉగాది శుభాకాంక్షలతో.....మీ పరిమళం.

Sunday, March 18, 2012

అబ్బాయిల్ని పొగడాలంటే ......?


శిశిరంలోంచి వసంతంలోకి వచ్చేశాం ...నేనూ బాధ్యతల సుడిగుండంలోనుంచి ఒడ్డున పడిపోయా .రావటం రావటమే సందేహాన్ని వెంటబెట్టుకు వచ్చానని అనుకుంటున్నారా :) ఇది నాకు చాలా ఏళ్ళ నుండీ బుర్ర తొలుస్తున్న సందేహమే !
అమ్మాయిల్ని బుట్టలో వేయడానికి అతి సులువైన దారి పొగడ్తే అని చాలా మంది అదే ఫాలో అయిపోవడం చూశాను. అదిగో సరిగ్గా అప్పుడే నాకు ఈ సందేహం పుట్టుకొచ్చింది. అమ్మాయిల్ని పొగడాలంటే ...
* చిలిపితనం జాలువారే నీ సోగ కళ్ళని చూస్తూ ఉంటే అసలు టైమే తెలీదు (లోపల... ఆఫీస్ అయ్యాక ఉన్న కాస్త టైమూ నిన్ను పొగడడానికే సరిపోతుంది ఖర్మ) ఎన్ని గంటలైనా నీ కళ్ళల్లోకి చూస్తూ గడిపేయగలను.
* నువ్వు ఫక్కున నవ్వితే గుప్పెడు మల్లెలు జల జలా రాలినట్టు ఉంటుందనుకో (లోపల ....ఈమె టూత్ పేస్ట్ ఏంటో బ్రాండ్ మారిస్తే బావుండు హు ..అనుకున్నాసరే)
* మొన్న నువ్వు మాఇంటి కొచ్చి వెళ్ళినప్పటి నుంచీ మా పెంపుడు పిల్లి కొత్తగా నడుస్తోంది బహుశా నీ నడక చూసే అనుకుంటా (లోపల...దాని కాలికేదో గుచ్చుకున్నట్టుంది)
* అరె వసంతం రాక ముందే కోయిల కూస్తుందేవిటి అనుకుంటున్నా మీరు హలో అన్నారా (లోపల....వాయిస్ విని మోసపోవడం లేదుకదా)
ఇంకా ఇలాగే నీ ముక్కు చూసి సంపెంగలు సిగ్గు పడుతున్నాయ్ , నిన్ను చూసే నెమళ్లు హొయలు నేర్చాయ్ , నీ పలుకులు విని రాచిలకలు మూగపోయాయ్ వగైరా వగైరా .....చాలా ఉన్నాయి కాని అమ్మాయిలు అబ్బాయిల్ని ఎలా పొగుడుతారో ఏం చెప్తే వాళ్ళు ఫ్లాట్ అవుతారో...అవుతున్నారో .... నా మట్టి బుర్రకి తెలియలేదు ఒకవేళ 100% లవ్ సినిమాలో లాగా యు ఆర్ ది గ్రేట్ అంటూ ఉండాలా ? మీకెవరికైనా తెలిస్తే చెప్తారా ప్లీజ్ ....