Thursday, July 2, 2015

సుదీర్ఘ నిరీక్షణ


మనసులో సంతోషం పెదవులపై చిర్నవ్వైతే
ఆనంద బాష్పం కంటి చివర మెరుస్తుంది 
కాని గుండెల్లో బాధ కళ్ళల్లో పొంగితే 
కన్నీరు వరదై ముంచేస్తుంది 
నీ తొలివలపు నేనేమో...... కాని 
నా తుది తలపు నీవే 
నా నీడ కూడా నన్ను విడిచి వెళ్ళిన వేళ 
నిశ్శబ్దానికీవల సడి చేయక రోదిస్తున్నా 
ఈ సుదీర్ఘ నిరీక్షణలో అలసి సొలసి 
తుదకు రాలిపోతానేమోని  భయమేస్తుంది 

Wednesday, June 17, 2015

ఎందుకిలా?


ఒకప్పుడు 
నువ్వు నాతో ఉన్నప్పుడు .... ఎప్పుడూ
నాపై ప్రేముందా నీకు అని..ఎంతుందో అని 

కొలమానాలతో ఉక్కిరిబిక్కిరౌతూ సంధిగ్ధత!
ఇప్పుడు
నువ్వు నాతో లేనప్పుడు.... ఎప్పుడూ 
గుర్తున్నానా నీకు అని..తలుస్తావా నన్నుఅని  
మనసును బలహీన పరుస్తూ సందేహం
ఎల్లప్పుడూ..... 
నా కనురెప్పల క్రింద నీ రూపం కరిగి
జారిపోతూంటే ఎదలో పొదువుకుంటున్నా
అపురూపంగా ఈ అశ్రువు సాక్షిగా.... 

Thursday, June 4, 2015

ఒంటరిని....


నేను ఒంటరినయినపుడు 
నా నీడవై నా వెంటే వున్నావు 
ఇప్పుడు నువ్వే నన్నొదిలి వెళ్ళావ్ 
నిన్నెంత కోల్పోయానో నీకెలా చెప్పను 
లిపిలేని భాషను ఎలా చూపను  
మౌనమే భాష్యమైతే ఎలా చెప్పను 
అది... చుస్తే.... 
నీ కంటిపాపలోనే  కనిపిస్తుంది 
వినాలంటే.... 
అది నీగుండె సవ్వడిలో వినిపిస్తుంది

Wednesday, May 27, 2015

వీడుకోలు....


సెలవా మరి అంటున్న నీ కళ్ళనుండి 
నా కళ్ళను విడదీయటానికి 
వెళ్ళనా మరి అంటున్న నీచేతి స్పర్శనుండి 
నాచేతిని విడిపించడానికి 
నా మనసు పడిన మూగవేదన
నీవు తెలుసుకోక నేను తెలుపలేక 
వీడ్కోలు చెప్పటానికి మొరాయిస్తున్న 
నా మనసును సముదాయించలేక 
ఆ క్షణమే మరణించాను.

Sunday, May 17, 2015

శూన్యం!


కరిగి పోయిన కలేమో మన
పరిచయం అనుకుందామంటే ... 
నీ జ్ఞాపకాల ఊటను కన్నుల్లో 
నింపుతున్న గతం నన్ను 
నీడలా వెంటాడుతోంది....  
కట్టెను వదిలి ప్రాణం పయనమై పోతుంటే 
కళ్ళప్పగించి చూస్తూండి పోయిన క్షణం!
బాధ్యతల ఉక్కు సంకెళ్ళ మధ్య 
బందీనై నిలుచుండి పోయాను
నేస్తం! 
ఇన్నేళ్ళ మన సావాసంలో 
ఎన్నో విలువైన కానుకలిచ్చావు 
అవన్నీ నాతోనే వున్నాయి 
నువ్వు మాత్రం నన్ను విడిచి 
దూరపుకొండల వైపు సాగిపోయావు 
నువ్విచ్చిన చివరి కానుకేమో ఈ శూన్యం! 
బహుశా అదే తోడుగా వుంటుంది 
నా ఈ ఏకాంత వాసంలో.... 

Sunday, May 10, 2015

Tears are the words the heart can't say.


పెద్ద పెద్ద కళ్ళనిచ్చిన దేవుడు
ఛత్రాలవంటి రెప్పలనిచ్చివుంటే
రెప్పల మాటున స్వప్నం
కరిగి జారుతున్న వేళ
కంటిచివరి నీటి చుక్కని
రెప్పవాల్చి దాచుకునేదాన్ని
ముఖం దాచుకొనేందుకు
నీ గుండె వెదుక్కొనే
అవసరం ఉండేదికాదు!

Wednesday, December 17, 2014

ఆ పాత మధురాలు :)



చాలా రోజుల తర్వాత బోలెడంత ఖాళీ దొరికేసి పాతపుస్తకాల దొంతర్లు (ఎన్నో అనుకొనేరు ఓ బుల్లి చిన్న అల్మారా అన్నమాట) దులుపుతుంటే కృష్ణశాస్త్రి గారి 'బదరిక 'లోంచి ఓ కాయితం జారిపడింది. చూద్దునుకదా నా స్వహస్త లిఖితమే. జ్ఞాపకాల్ని నెమరే.సుకోగా అది చాలా ఏళ్ల క్రితం మా అత్తగారి ఊరిలో ఉంటున్నప్పుడు రోజువారి  అద్దెకు పుస్తకాలు ఇచ్చే కిరాణా కొట్టుఉండేది.  అక్కడ ఎలాఉండేదంటే అసలే నాకు  పుస్తకాల గురించి పెద్దగా తెలీదు.  తెలిసిన పుస్తకాల(తులసిదళం, వెన్నెల్లో ఆడపిల్ల వంటివి) పేర్లు రాసి మా పాలేరు చేతికివ్వడం వాడు అక్కడ ఏదుంటే  అది తేవడం జరిగేది. అక్కడ నుండి పుస్తకాలు  తెప్పించుకొని కాలక్షేపం చేసే రోజుల్లో నచ్చి రాసుకున్న కొన్ని పేరాలు ఇవి. బహుశా రంగనాయకమ్మగారి 'అంధకారంలో'వి అనుకుంటాను.

"సంగీతాలు, చిత్రలేఖనాలు మాత్రమే కళలనుకుంటాం కాని హాయిగా జీవించడం కూడా గొప్ప కళ. ఆ కళలో మనం నిష్ణాతులం కావాలి అంటే జీవితాన్ని గౌరవించి ప్రేమించడమే దానికి మార్గం."

రంగనాయకమ్మ గారి కొన్ని రచనలపై ఎన్ని విమర్శలున్నా. ఆవిడ సిద్ధాంతాల పట్ల కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేసినా వైవిధ్యంగల రచనలు, ముక్కుసూటితనం మరికొంత మందిని ఆమెకు అభిమానుల్ని చేసింది. దాంపత్యం గురించి ఆవిడ రాసిన పేరాలు ఇంతకు ముందు ఒక టపా రాశాను ఆ లింకు ...
దాంపత్యం సాఫల్యత ....

దాంపత్యం గురించి ఇంతచక్కగా రాసి చదివిన వారికి ప్రేరణ కలిగించిన వారి వైవాహిక జీవితం ఎందుకు విఫలమైందో నాకు అర్ధం కాలేదు. ఏది ఏమైనా పైవి పాటిస్తే మాత్రం జీవితం పూలబాటే కదూ!