Thursday, June 4, 2015
Wednesday, May 27, 2015
Sunday, May 17, 2015
శూన్యం!
కరిగి పోయిన కలేమో మన
పరిచయం అనుకుందామంటే ...
నీ జ్ఞాపకాల ఊటను కన్నుల్లో
నింపుతున్న గతం నన్ను
నీడలా వెంటాడుతోంది....
కట్టెను వదిలి ప్రాణం పయనమై పోతుంటే
కళ్ళప్పగించి చూస్తూండి పోయిన క్షణం!
బాధ్యతల ఉక్కు సంకెళ్ళ మధ్య
బందీనై నిలుచుండి పోయాను
నేస్తం!
ఇన్నేళ్ళ మన సావాసంలో
ఎన్నో విలువైన కానుకలిచ్చావు
అవన్నీ నాతోనే వున్నాయి
నువ్వు మాత్రం నన్ను విడిచి
దూరపుకొండల వైపు సాగిపోయావు
నువ్విచ్చిన చివరి కానుకేమో ఈ శూన్యం!
బహుశా అదే తోడుగా వుంటుంది
నా ఈ ఏకాంత వాసంలో....
Sunday, May 10, 2015
Wednesday, December 17, 2014
ఆ పాత మధురాలు :)
చాలా రోజుల తర్వాత బోలెడంత ఖాళీ దొరికేసి పాతపుస్తకాల దొంతర్లు (ఎన్నో అనుకొనేరు ఓ బుల్లి చిన్న అల్మారా అన్నమాట) దులుపుతుంటే కృష్ణశాస్త్రి గారి 'బదరిక 'లోంచి ఓ కాయితం జారిపడింది. చూద్దునుకదా నా స్వహస్త లిఖితమే. జ్ఞాపకాల్ని నెమరే.సుకోగా అది చాలా ఏళ్ల క్రితం మా అత్తగారి ఊరిలో ఉంటున్నప్పుడు రోజువారి అద్దెకు పుస్తకాలు ఇచ్చే కిరాణా కొట్టుఉండేది. అక్కడ ఎలాఉండేదంటే అసలే నాకు పుస్తకాల గురించి పెద్దగా తెలీదు. తెలిసిన పుస్తకాల(తులసిదళం, వెన్నెల్లో ఆడపిల్ల వంటివి) పేర్లు రాసి మా పాలేరు చేతికివ్వడం వాడు అక్కడ ఏదుంటే అది తేవడం జరిగేది. అక్కడ నుండి పుస్తకాలు తెప్పించుకొని కాలక్షేపం చేసే రోజుల్లో నచ్చి రాసుకున్న కొన్ని పేరాలు ఇవి. బహుశా రంగనాయకమ్మగారి 'అంధకారంలో'వి అనుకుంటాను.
"సంగీతాలు, చిత్రలేఖనాలు మాత్రమే కళలనుకుంటాం కాని హాయిగా జీవించడం కూడా గొప్ప కళ. ఆ కళలో మనం నిష్ణాతులం కావాలి అంటే జీవితాన్ని గౌరవించి ప్రేమించడమే దానికి మార్గం."
రంగనాయకమ్మ గారి కొన్ని రచనలపై ఎన్ని విమర్శలున్నా. ఆవిడ సిద్ధాంతాల పట్ల కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేసినా వైవిధ్యంగల రచనలు, ముక్కుసూటితనం మరికొంత మందిని ఆమెకు అభిమానుల్ని చేసింది. దాంపత్యం గురించి ఆవిడ రాసిన పేరాలు ఇంతకు ముందు ఒక టపా రాశాను ఆ లింకు ...
దాంపత్యం సాఫల్యత ....
దాంపత్యం గురించి ఇంతచక్కగా రాసి చదివిన వారికి ప్రేరణ కలిగించిన వారి వైవాహిక జీవితం ఎందుకు విఫలమైందో నాకు అర్ధం కాలేదు. ఏది ఏమైనా పైవి పాటిస్తే మాత్రం జీవితం పూలబాటే కదూ!
Friday, November 21, 2014
గోవర్ధనగిరిధారి..... మురారి!
చాలా రోజులైంది కృష్ణయ్యను చూసి అనుకుంటూ నిన్న సాయంత్రం వేణుగోపాలస్వామి గుడికి వెళ్ళాము. నాలుగ్గంటలకే వెళదామని అలా లేటైపోయి వెళ్లేసరికి ఆరుగంటలైంది.వెళ్లేసరికి ఆకాశదీప పూజ జరుగుతోంది. ఆలశ్యంగా వెళ్ళటం మంచిదైంది పూజలో పాల్గొనే అదృష్టం మాత్రమే కాదు గోపూజలో పాల్గొనే అవకాశం కూడా దక్కింది.
kphb కాలనీ మలేషియాటౌన్ షిప్ opp లో ఉంది గోవర్ధనగిరిపై శ్రీ వేణుగోపాలస్వామి గుడి. చాలామందికి తెలీదు అక్కడో గుడి ఉందని. నగరం మధ్యలో ఉన్నా చిన్న కొండపై ఉండటంవల్ల అక్కడ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కొండపై అడుగు పెట్టగానే ఆలయం,ధ్వజస్తంభం, ఒక పక్కగా గోశాల, పరుగులిడుతూ తిరుగాడే ఓ బుజ్జి తువ్వాయి{పేరు గోపాలుడు),మంద్రంగా వినిపించే అన్నమాచార్య కీర్తనలూ..... ఇవన్నీ మనకు ఆధ్యాత్మిక చింతనతో పాటూ ఆహ్లాదాన్నీ కలిగిస్తాయి. ఇక రుక్మిణీ సత్యభామలనిరువైపులా నిలుపుకున్న వేణుగోపాల స్వామిని చూడటానికి రెండుకళ్ళూ సరిపోవు.ఆయన మృదు మధుర సుందర వదనారవిందం మనసును దోచుకుంటుంది. మహాలక్ష్మి అమ్మవారు, గోదాదేవి కూడా అదే మండపంలో కొలువై ఉన్నారు. ప్రధాన ఆలయానికి కాస్త పక్కగా చిన్న ఆంజనేయస్వామి గుడి ఉంది.
నేను మొదటిసారి ఓ రెండేళ్ళ క్రిందట వెళ్లాను. ఆతర్వాత నుండి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము .అప్పటికి ఇప్పటికీ గుడి చాలా అభివృద్ధి చేశారు. కాని కొండపైకి దారి అంతగా బావుండదు కార్లు వెళతాయి కాని రాళ్ళతో కూడిన మట్టి రోడ్డు. దాతల సహకారంతోనే గుడి నడుస్తుందని చెప్పారు. ప్రస్తుతం రోడ్డు,కొండపైకి ప్రవేశించే చోటఅందరికీ తెలిసేలా ఒక ఆర్చి నిర్మించాలని సంకల్పించారట.స్వామి ఆశీస్సులు దాతల సహకారం ఉంటే అవి కూడా పూర్తవుతాయని ఆశిస్తున్నామని చెప్పారు.
ప్రతి ఏటా కృష్ణాష్టమి,గోవర్ధనగిరి తిరునాళ్ళు , కార్తీక, ధనుర్మాసాలలో విశేష పూజలు జరుగుతాయట! రాబోయే 29వ తేదీ మాధవాష్టమి కూడా బాగా చేస్తారట!
భక్తీ, ఆధ్యాత్మిక చింతన అనేవి పక్కన పెడితే అక్కడ ఉన్నంతసేపూ కనులకు ఆహ్లాదం, మనసుకి ప్రశాంతత కలుగుతుందనేది నిజం! పైన ఉన్నది బుజ్జి గోపాలుడే :) గుడి ఫొటోస్ కూడా తీసి ఉంటే బావుండేది ప్చ్.... ఈసారి వెళ్ళినప్పుడుతీస్తాను.
Monday, November 10, 2014
ఓ అమ్మ!
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే కోటి పూలు తేవే
అంటూ గోరుముద్దలు తినిపించాను
నిదురపో నాపాప నిదురపో తల్లీ
నిద్రలకు నూరేళ్ళు నీకు నూరేళ్ళు
అంటూ జోలపాడి నిద్రపుచ్చేను
నీలాలు కారితే నేచూడలేను
పాలైన కారవే బంగారు కళ్ళు
అంటూ పువ్వులా పెంచుకున్నాను
మందారంలాపూస్తే మంచి మొగుడొస్తాడు
గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు
అంటూ అరచేత గోరింట పెట్టాను
రెక్కల గుర్రమెక్కి ఓ రాజకుమారుడొస్తాడు
ఈబుల్లి రాణీగార్ని తీసుకెళ్తాడు
అంటూ కధలు చెప్పాను
చిట్టితల్లీ..... అప్పుడు తెలీలేదు
నిజంగానే రాజకుమారుడొచ్చి
ఏడు సముద్రాలకావల
ఒంటి స్థంభం మేడలో నిన్నుంచితే
అన్నిసముద్రాలుదాటి నీ దగ్గరికి
రావటానికి నాకు రెక్కు లేవని
నీతో మాట్లాడాలంటే దూరవాణిలూ
నిన్ను చూడాలంటే దూరదర్శినిలూ
కావాలని....,,, కాని
నిన్నుహృదయానికి హత్తుకోవాలంటే
ఏ మంత్రం తంత్రాలున్నాయో మరి!
Subscribe to:
Posts (Atom)







