Saturday, February 20, 2016

ఎండమావి?


ఇన్నాళ్ళూ నువ్వులేని
 ఒక్కో రోజు గడుస్తుంటే 
నిన్నుకలిసే రోజుకి 
ఒక్కోరోజు దగ్గరవుతున్నానని 
సంబర పడిపోయాను
ఎండమావిని ఒయాసిస్ అనుకొని
భ్రమలో బతికేసా ఇన్నాళ్ళూ 
ఐనా ...... 
నువ్వొస్తే నీకివ్వడానికి
 నాదగ్గర ఏముందని?
నా ధైర్యాన్ని, స్థైర్యాన్నీ... 
అభిమానాన్ని,అహంకారాన్ని
ఆప్యాయతనీ, ఆదర్శాన్ని
మనసుని, మమతని 
నా ఆఖరి చిర్నవ్వునీ 
చివరి కన్నీటి బొట్టునూ
సమస్తం నీకిచ్చేసి.... 
బీడువారిన మనసుతో 
మోడువారిన చెట్టులా 
ఇలా... మిగిలాను 

Thursday, February 4, 2016

టి.విలో పంచాయితీలు


ఈ మధ్య మధ్యాహ్నం ఖాళీ అవగానే కాస్సేపు రిలాక్స్డ్ గా టివి చూద్దామని ఆన్ చేస్తే కొన్ని మన తెలుగు చానెల్స్ లో భార్యాభర్తల మధ్య తగువులు తీర్చే ప్రోగ్రామ్స్వస్తున్నాయ్ . ఇంతకు ముందు కూడా అటువంటివి వచ్చినా నేను ఎప్పుడూ గమనించలేదు, ఇదేదో కోర్టుకి వెళ్ళక్కర్లేకుండా న్యాయం చేస్తున్నారు కోర్టుల చుట్టూ తిరిగితే ఏళ్ళు గడిచిపోతాయి కొన్నిసార్లు తిరగలేక బాధితులు రాజీ పడిపోతుంటారు సరే ఇదేదో మంచి విషయమే అనుకున్నా.గత కొద్దిరోజులుగా చూస్తుంటే సెక్షన్లు తెలిసాయి కాని న్యాయం ఎవరికి జరుగుతుందో తెలీలేదు :)

విషయంలోకొస్తే ఇంచుమించుగా ప్రతీ ఎపిసోడ్ లోనూ ఇద్దరు పెళ్ళాల శోభన్ బాబులే :) అది సినిమా చెల్లుతుంది ఇక్కడకొచ్చిన బాబూ ఇద్దర్ని చూసుకుంటానంటాడు అదేంటో :) :)

ఒక్కోసారి అక్కడ అడిగే విధానం చూస్తే నా తల తిరిగి పోతుంది. నువ్వు రెండో భార్యవి అతనేమన్నా ఓర్పుగా ఉండాలి అతనెలా తిరిగితే ఎక్కడికెళ్తే నీకెందుకు నిన్ను నీ పిల్లల్ని చూసుకుంటాడు ఈ రకంగా ఉంటుంది ఇక్కడ నేను రెండో ఆమెని సపోర్ట్ చేయమనట్లేదు అతడూ తప్పుచేసాడు ఒక్కోసారి ముందు పెళ్లి సంగతి చెప్పకుండా చేసుకున్న మహానుభావులూ ఉ న్నారు.అప్పుడప్పుడూ ఏకైక భార్యకూ ఇలాంటి జ్ఞానబోదే జరుగుతుంది బైట ఎలా వున్నా ఫరావాలేదంట వాళ్ళని బాగా చూసుకుంటే చాలంట ఇదేం లాజిక్? నేనిలా అనటం సభ్యత కాదు కాని  ఇంట్లో భార్యని ప్రేమగా చూసుకుంటూ వుంటే బయట అంటురోగాలు తెచ్చి అంటించినా ఓకే నా ఇలా మాట్లాడతారా?

.అటూ ఇటూ కూడా న్యాయం మాట్లాడతారు ఇద్దర్నీ దుయ్యబడతారు వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపుతారు అక్కడకి వచ్చినవాళ్ళని ఏం కావాలని అడుగుతారు వాళ్ళేమో న్యాయం కావాలని వచ్చామంటారు అంతా చూసాక నాకు మాత్రం ఎవరికి న్యాయం జరిగిందో అర్ధమే కాదు 


చివరికి మానసిక విశ్లేషణలు చేస్తారు, సెక్షన్ లు చెప్పి భయపెడతారు అంతా అయ్యాక ఎవరో ఒకరితో అంటే మొదటి భార్య హక్కు కాబట్టి నువ్వెందుకు చేసుకున్నావ్ నీకు భార్తమీద హక్కులేదు అంటూ కొంత మైంటినెన్స్ ఇప్పించి పంపేస్తారు. అదే మొదటి ఆమె ఛీ ఇతను నాకొద్దు ఆమెతోనే ఉండనివ్వండి నాకు ఆస్తి లో వాటా ఇప్పించండి అంటే రెండో ఆమె అదృష్టం. ఇంతకూ ఇద్దరి స్త్రీలకూ న్యాయం జరిగినట్టేనా. అతడు అంటే రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న అతనికి పెద్దామో, చిన్నామో ఒకరితో చక్కగా కాపురం చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట!
అంతేకాదు అప్పుడప్పుడూ ఇద్దర్నీ చూసుకొనే అవకాశమూ ఉంటుంది అతనికి ఈ మధ్య తెలివి మీరిపోయి నేనేం పని చెయ్యట్లేదు అనేస్తున్నారు నెల నెలా భత్యం ఇవ్వక్కర్లేదని. ఏదో కొద్దిపాటి ఆస్తి చూపించి సింగిల్ పేమెంట్ సెటిల్ మెంట్ చేసేసి వదిలించుకోవచ్చని.

రెండు పెళ్ళిళ్ళు చేసుకోవడం అనే పెద్దనేరం స్వయంగా చేసినోడు బాగుంటాడు ఇద్దరిలో ఒకరు ఒంటరి జీవితం గడపాలి (వాళ్ళు వేరే పెళ్లి చేసుకుంటారో లేదో వాళ్ళ మానసిక పరిస్థితి కుటుంబ నేపద్యాలు ఇక్కడ అప్రస్తుతం అనుకుంటున్నాను) ఇది స్త్రీలు స్వయంగా న్యాయ నిర్ణేతలుగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో స్త్రీలకు జరుగుతున్న న్యాయం. 

వచ్చిన వాళ్లందరికీ ఇలాగే జరుగుతుందని అనను కొందరికి మంచిజరిగి ఉండొచ్చు.నేను చూసినవి చాలా వరకు ఇలానే వున్నాయి. అసలు తప్పు చేసినవాడు  ఎటువంటి శిక్ష లేకుండా హాప్పీగా వెళ్తుంటే ఇదేం న్యాయం అనిపించి ఇలా వెళ్ళగక్కేశాను.   

*పై విషయాలు కేవలం నా అభిప్రాయం మాత్రమే. ఎవ్వరినీ కించపరిచే ఉద్దేశ్యం కాదు. 

Thursday, January 28, 2016

అలవాటో .... అనుబంధమో?


చాన్నాళ్ళ క్రితం మాట! మేము ఒక ఫ్లాట్ లో రెంట్ కి ఉండేవాళ్ళం. మా ఫ్లాట్ లో ఒక ప్రేవేట్ స్కూల్ టీచర్ ఉండేవారు. ఆమె కోసం ప్రతి రోజు స్కూల్ బస్సు రోడ్డుకి అటువైపు ఆగేది. డ్రైవర్ హార్న్ కొట్టగానే ఆవిడ వెళ్లి బస్సుఎక్కేవారు. ఒకరోజు నేను బాల్కనీ లో నిలబడి ఉండగా బస్సు వచ్చింది నేను చూస్తున్నాను వెనకనుండి నాలుగో వరుస కిటికీలోంచి ఓ చిన్నచేయి బయటపెట్టి టాటా చెప్తున్నట్టు ఊగింది. ఎవరో ఎవరికో అన్నట్టు నేను అటు ఇటు చూస్తుండగానే టీచర్ ఎక్కడం బస్సు వెళ్ళిపోడం జరిగింది

మర్నాడు బట్టలారేస్తూ ఉండగా బస్సు రావటం మళ్ళీ చేయి బయటపెట్టి బై చెప్పటం... బస్సు వెళ్ళిపోయింది. తఆ ర్వాత రోజు బస్ హార్న్ వినపడగానే బైటకి వెళ్లాను ఈసారి చేయ్యితోపాటు ఒక నవ్వు మొహం కూడా బైట కొచ్చింది. అప్పటికి గాని అర్ధం కాలేదు వాడు టాటా చెప్పేది నాకే అని :)

ఇక ఆ రోజు నుండి హార్న్ వినపడగానే ఎంతపనిలో ఉన్నా పరిగెత్తుకొని బాల్కనీ లోకి రావటం ఒక్కోసారి ముందే వచ్చి బాల్కనీలో వేచివుండటం వాడికి బై చెప్పటం మామూలై పోయింది తర్వాత తనని చూసి మరికొంత మంది పిల్లలు చేతులూపేవారు ఒక్కోసారి ఆదివారం కుడా మర్చిపోయి టైం చూసుకోనేదాన్ని .ఇంకా బస్ రాలేదేంటాని :)

తర్వాత మా స్నేహం ముదిరి పాకాన పడి సైగలతో సంభాషించుకొనేవాళ్ళం  అలా వాడి గురించి సెకండ్ క్లాస్ చదువుతున్నాడని తెలిసింది.చేతులు బైట పెట్టకూడదని జాగ్రత్తలు చెప్పటం, హాప్పీ న్యూ ఇయర్ లు చెప్పుకోవడం, పరీక్షలప్పుడు వాడు అట్ట చూపిస్తే నేను బొటన వేలు పైకెత్తి ఆల్ ది బెస్ట్ చెప్పటం ఇలా సాగిపోయింది మా స్నేహం. సెలవులు వచ్చాయంటే ఏదో వెలితిగా ఉండేది నాకు. బహుశా వాడిక్కూడా ఎందుకంటే నేను ఎప్పుడైనా ఊరెళ్ళి వస్తే ఎంత ఆత్రంగా వెదికేవాడు నేను కనపడగానే అమాయకమైన నవ్వు ముఖమంతా అలముకునేది. వేసవి సెలవుల తర్వాత స్కూల్ తెరిచే రోజు కోసం ఆత్రంగా ఎదురు చూసేదాన్ని. వాడి ముఖం లోనూ అదే ఆనందం అదే స్వచ్చమైన నవ్వు. 

వింటే నవ్వొస్తోంది కదూ! ఇలా మూడేళ్ళు గడిచిపోయాయ్ ఎప్పుడూ వాడు బస్సు దిగే సాహసం చెయ్యలేదు నేనూ ఎప్పుడూ రోడ్డు దాటి బస్సు దగ్గరికి వెళ్ళలేదు. వాడి పేరు తెలీదు ఎప్పుడూ ఒక్క చాక్లెట్ కూడా ఇవ్వలేదు. అయినా మా స్నేహం కొనసాగింది. 
అనుకోకుండా కొన్ని అనివార్య కారణాల వాళ్ళ ఆ ఫ్లాట్ ఖాళీ చెయ్యాల్సి వచ్చింది. మేం ఇల్లు మారిపోయాం నా స్నేహితుడికి రేపట్నుంచి ఈ బాల్కనీలో కనపడనురా ఎక్కడికెళ్ళానో అని చూడొద్దు అని చెప్పనే లేదు. నాకోసం చూస్తాడేమోని అనిపించేది చాలా రోజులు ... కాదు నెలలు... కాదు దాదాపు రెండేళ్ళు గుర్తొస్తూనే ఉండేవాడు.

ఆ తర్వాత మేం సొంత ఫ్లాట్ కి మారిపోయాం ఏ స్కూల్ బస్ చూసినా గుర్తొచ్చేవాడు. ఐదారేళ్ళు పైనే గడిచిపోయాయ్. దాదాపు మర్చిపోయా. కాని మళ్ళీ ఈమధ్య ఎందుకో తెలీదు ఆ అబ్బాయి జ్ఞాపకాలు వాడి పసి నవ్వు చిన్న చేతులూ మరీ మరీ గుర్తొస్తున్నాయి.అపరాధభావంతో మనసు ముడుచుకుపోతోంది. బహుశా బోల్డంత ఖాళీ దొరికేసిందేమో నాకు పాత జ్ఞాపకాలు నెమరేసుకోడానికి :)

అసలు ఆ అబ్బాయెవరో నాకే ఎందుకు టాటా చెప్పలనిపించిందో తెలీదు కాని ఓ మూడేళ్ళు రోజూ చూడటం బై చెప్పటం వల్ల అది అలవాటుగా మారి కలిగిన బాధా లేక అది మా మధ్య పెరిగిన అనుబంధమో తెలీదు. అలవాటుకీ , అనుబంధానికి తేడా ఏవిటో అసలు? 

Sunday, September 27, 2015

అంతటా నేనే !


నేను రాసే లేఖలు మోసుకొచ్చేది కాలమే 
సూర్యుడు చంద్రుడు తపాలా బంట్రోతులు 
నీ చుట్టూ నిండిన  చీకటి వెలుగులు.. అవి.... 
నా ఆనవాళ్ళు....  నా పలకరింతల నకళ్ళు 
రాత్రి కురిసే వెన్నెలంతా  నా కలవరింతే 
అమావాస్య రోజు  నక్షత్రాలు నా అక్షరాలే 
వర్షపు రాత్రి చినుకులన్నీ నా కన్నీటి చుక్కలే 
సాయంసంధ్యలన్నీ నా ఎదురు చూపులే 
నానుంచి దాక్కోవాలంటే నువ్వు......  
చీకటి వెలుగులు లేని చోటు వెతుక్కోవాలి 
దొరుకుతుందా మరి ఆ చోటు నీకు?

Thursday, July 2, 2015

సుదీర్ఘ నిరీక్షణ


మనసులో సంతోషం పెదవులపై చిర్నవ్వైతే
ఆనంద బాష్పం కంటి చివర మెరుస్తుంది 
కాని గుండెల్లో బాధ కళ్ళల్లో పొంగితే 
కన్నీరు వరదై ముంచేస్తుంది 
నీ తొలివలపు నేనేమో...... కాని 
నా తుది తలపు నీవే 
నా నీడ కూడా నన్ను విడిచి వెళ్ళిన వేళ 
నిశ్శబ్దానికీవల సడి చేయక రోదిస్తున్నా 
ఈ సుదీర్ఘ నిరీక్షణలో అలసి సొలసి 
తుదకు రాలిపోతానేమోని  భయమేస్తుంది 

Wednesday, June 17, 2015

ఎందుకిలా?


ఒకప్పుడు 
నువ్వు నాతో ఉన్నప్పుడు .... ఎప్పుడూ
నాపై ప్రేముందా నీకు అని..ఎంతుందో అని 

కొలమానాలతో ఉక్కిరిబిక్కిరౌతూ సంధిగ్ధత!
ఇప్పుడు
నువ్వు నాతో లేనప్పుడు.... ఎప్పుడూ 
గుర్తున్నానా నీకు అని..తలుస్తావా నన్నుఅని  
మనసును బలహీన పరుస్తూ సందేహం
ఎల్లప్పుడూ..... 
నా కనురెప్పల క్రింద నీ రూపం కరిగి
జారిపోతూంటే ఎదలో పొదువుకుంటున్నా
అపురూపంగా ఈ అశ్రువు సాక్షిగా.... 

Thursday, June 4, 2015

ఒంటరిని....


నేను ఒంటరినయినపుడు 
నా నీడవై నా వెంటే వున్నావు 
ఇప్పుడు నువ్వే నన్నొదిలి వెళ్ళావ్ 
నిన్నెంత కోల్పోయానో నీకెలా చెప్పను 
లిపిలేని భాషను ఎలా చూపను  
మౌనమే భాష్యమైతే ఎలా చెప్పను 
అది... చుస్తే.... 
నీ కంటిపాపలోనే  కనిపిస్తుంది 
వినాలంటే.... 
అది నీగుండె సవ్వడిలో వినిపిస్తుంది