చాన్నాళ్ళ క్రితం మాట! మేము ఒక ఫ్లాట్ లో రెంట్ కి ఉండేవాళ్ళం. మా ఫ్లాట్ లో ఒక ప్రేవేట్ స్కూల్ టీచర్ ఉండేవారు. ఆమె కోసం ప్రతి రోజు స్కూల్ బస్సు రోడ్డుకి అటువైపు ఆగేది. డ్రైవర్ హార్న్ కొట్టగానే ఆవిడ వెళ్లి బస్సుఎక్కేవారు. ఒకరోజు నేను బాల్కనీ లో నిలబడి ఉండగా బస్సు వచ్చింది నేను చూస్తున్నాను వెనకనుండి నాలుగో వరుస కిటికీలోంచి ఓ చిన్నచేయి బయటపెట్టి టాటా చెప్తున్నట్టు ఊగింది. ఎవరో ఎవరికో అన్నట్టు నేను అటు ఇటు చూస్తుండగానే టీచర్ ఎక్కడం బస్సు వెళ్ళిపోడం జరిగింది
మర్నాడు బట్టలారేస్తూ ఉండగా బస్సు రావటం మళ్ళీ చేయి బయటపెట్టి బై చెప్పటం... బస్సు వెళ్ళిపోయింది. తఆ ర్వాత రోజు బస్ హార్న్ వినపడగానే బైటకి వెళ్లాను ఈసారి చేయ్యితోపాటు ఒక నవ్వు మొహం కూడా బైట కొచ్చింది. అప్పటికి గాని అర్ధం కాలేదు వాడు టాటా చెప్పేది నాకే అని :)
ఇక ఆ రోజు నుండి హార్న్ వినపడగానే ఎంతపనిలో ఉన్నా పరిగెత్తుకొని బాల్కనీ లోకి రావటం ఒక్కోసారి ముందే వచ్చి బాల్కనీలో వేచివుండటం వాడికి బై చెప్పటం మామూలై పోయింది తర్వాత తనని చూసి మరికొంత మంది పిల్లలు చేతులూపేవారు ఒక్కోసారి ఆదివారం కుడా మర్చిపోయి టైం చూసుకోనేదాన్ని .ఇంకా బస్ రాలేదేంటాని :)
తర్వాత మా స్నేహం ముదిరి పాకాన పడి సైగలతో సంభాషించుకొనేవాళ్ళం అలా వాడి గురించి సెకండ్ క్లాస్ చదువుతున్నాడని తెలిసింది.చేతులు బైట పెట్టకూడదని జాగ్రత్తలు చెప్పటం, హాప్పీ న్యూ ఇయర్ లు చెప్పుకోవడం, పరీక్షలప్పుడు వాడు అట్ట చూపిస్తే నేను బొటన వేలు పైకెత్తి ఆల్ ది బెస్ట్ చెప్పటం ఇలా సాగిపోయింది మా స్నేహం. సెలవులు వచ్చాయంటే ఏదో వెలితిగా ఉండేది నాకు. బహుశా వాడిక్కూడా ఎందుకంటే నేను ఎప్పుడైనా ఊరెళ్ళి వస్తే ఎంత ఆత్రంగా వెదికేవాడు నేను కనపడగానే అమాయకమైన నవ్వు ముఖమంతా అలముకునేది. వేసవి సెలవుల తర్వాత స్కూల్ తెరిచే రోజు కోసం ఆత్రంగా ఎదురు చూసేదాన్ని. వాడి ముఖం లోనూ అదే ఆనందం అదే స్వచ్చమైన నవ్వు.
వింటే నవ్వొస్తోంది కదూ! ఇలా మూడేళ్ళు గడిచిపోయాయ్ ఎప్పుడూ వాడు బస్సు దిగే సాహసం చెయ్యలేదు నేనూ ఎప్పుడూ రోడ్డు దాటి బస్సు దగ్గరికి వెళ్ళలేదు. వాడి పేరు తెలీదు ఎప్పుడూ ఒక్క చాక్లెట్ కూడా ఇవ్వలేదు. అయినా మా స్నేహం కొనసాగింది.
అనుకోకుండా కొన్ని అనివార్య కారణాల వాళ్ళ ఆ ఫ్లాట్ ఖాళీ చెయ్యాల్సి వచ్చింది. మేం ఇల్లు మారిపోయాం నా స్నేహితుడికి రేపట్నుంచి ఈ బాల్కనీలో కనపడనురా ఎక్కడికెళ్ళానో అని చూడొద్దు అని చెప్పనే లేదు. నాకోసం చూస్తాడేమోని అనిపించేది చాలా రోజులు ... కాదు నెలలు... కాదు దాదాపు రెండేళ్ళు గుర్తొస్తూనే ఉండేవాడు.
ఆ తర్వాత మేం సొంత ఫ్లాట్ కి మారిపోయాం ఏ స్కూల్ బస్ చూసినా గుర్తొచ్చేవాడు. ఐదారేళ్ళు పైనే గడిచిపోయాయ్. దాదాపు మర్చిపోయా. కాని మళ్ళీ ఈమధ్య ఎందుకో తెలీదు ఆ అబ్బాయి జ్ఞాపకాలు వాడి పసి నవ్వు చిన్న చేతులూ మరీ మరీ గుర్తొస్తున్నాయి.అపరాధభావంతో మనసు ముడుచుకుపోతోంది. బహుశా బోల్డంత ఖాళీ దొరికేసిందేమో నాకు పాత జ్ఞాపకాలు నెమరేసుకోడానికి :)
అసలు ఆ అబ్బాయెవరో నాకే ఎందుకు టాటా చెప్పలనిపించిందో తెలీదు కాని ఓ మూడేళ్ళు రోజూ చూడటం బై చెప్పటం వల్ల అది అలవాటుగా మారి కలిగిన బాధా లేక అది మా మధ్య పెరిగిన అనుబంధమో తెలీదు. అలవాటుకీ , అనుబంధానికి తేడా ఏవిటో అసలు?
నిర్మలమైన స్నేహ పరిమళాన్ని వెదజల్లి హృదయాన్ని ద్రవింపజేసారు. అభినందనలు!
ReplyDeleteధన్యవాదాలు ఫణీంద్రగారు!
ReplyDeleteఎంత అందమైన స్నేహమో.. :)
ReplyDeleteధాత్రిగారూ :) :)
ReplyDelete