Thursday, April 26, 2012

గుర్తుకొస్తున్నాయీ ....గుర్తుకొస్తున్నాయి

చాలా ఏళ్ళ తర్వాత పెళ్ళికి వెళ్ళిన నేను నా చిన్ననాటి జ్ఞాపకాల నిధిని తవ్వి తీసుకున్నా! ఆ ఆనందాన్ని మీతో పంచుకోవాలనిపించింది.

ఈ రైల్వే స్టేషన్ లోనే ఎన్నోసార్లు మెయిల్ ఎక్కి రాజమండ్రి స్టేషన్లో దిగేవాళ్ళం .ఇప్పుడు కొత్త హంగులతో ముస్తాబయిందనుకోండి.ఆ కనిపించే బ్రిడ్జ్ కి అటువైపు రైల్వే క్వార్టర్స్ ఉండేది ఇటువైపు మాస్కూల్ ఉండేది.బజారుకి ,సినిమాకి దేనికి వెళ్ళాలన్నా బ్రిడ్జ్ దాటాల్సిందే అలా4,5,6  తరగతులు పూర్తయ్యాక 7 వ తరగతిలో బ్రిడ్జ్ కి ఇటువైపు స్కూల్ లో జాయిన్ చేశారు.అంటే ఆరవ తరగతిలో తెలివితేటలు పెరిగిపోయి బ్రిడ్జ్ ఎక్కకుండా పట్టాలు దాటి వెళ్లిపోతుంటే నాన్నగారు రెండుమూడు సార్లు రెడ్ హాన్డేడ్ గా పట్టుకొని తక్షణ రక్షణ చర్యగా అమలు చేశారన్న మాట :)  :)



ఇది నేను 7 , 8 , 9 తరగతులు చదివిన స్కూల్ .



ఇక్కడే ప్రేయర్ జరిగేది. ఆ షెడ్ ఒకప్పటి స్టేజ్ అక్కడ డ్రామాలు కూడా వేశాం:)


ఏడవ తరగతి వరకు క్రింది గదుల్లో .....ఎనిమిది నుండి పది వరకు పైన! ఎనిమిదో క్లాసులో అడుగుపెట్టిన మొదటి రోజు మెట్లేక్కుతున్నప్పటి గర్వం,ఏదో సాధించేసినట్టు ఆ ఆనందం గుర్తుకొచ్చి నవ్వొచ్చేసింది :)


పైన గదుల్లో సైన్స్ లాబ్ ,టీచర్స్ రూం ఉండేవి సెలవులు కదా అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి.ఎవ్వరూలేరు .ఇంతకూ మా బడి బావుందాండీ :)


ఇది మా నాన్నగారు పనిచేసిన ఆఫీస్! ఎన్నోసార్లు నాన్నగారి వేలుపట్టుకొని ఇక్కడకు వచ్చాను.ముఖ్యంగా దసరాకు దేవీపూజ చాలా బాగా చేసేవారు నాన్నగారు నన్ను తప్పకుండా తీసుకెళ్ళేవారు.మరమరాలు బెల్లం సెనగపప్పు కలిపి పంచేవారు.బయట నిలబడి ఫోటో తీసుకుంటుంటే ఎవరమ్మా అంటూ వచ్చిన పెద్దాయన నాన్నగారి దగ్గర పనిచేసిన గాంగ్ మేన్ అవటం ,ఆయన నాన్నగారిగురించి గుర్తుచేసుకుని చెప్పిన మాటలు ఆయన కూతురుగా మరోసారి గర్వపడేలా మర్చిపోలేని మధురానుభూతిని మిగిల్చింది.



ఈ బల్ల చూశారా నేను అక్కడనుండి వచ్చేసే టప్పుడు స్టేషన్లో కూర్చున్న బల్ల! ఈ బెంచి మీదకూర్చునే మాస్నేహితులందరం వెక్కి వెక్కి ఏడ్చాం !ఇక్కడే నా స్నేహితులు నాకు కళ్ళనిండా నీళ్ళతో....గుండె నిండా ప్రేమతో వీడ్కోలు పలికారు.స్టేషన్ ఎంత మార్పులు చేర్పులు చేసినా ఆ బల్లను అలాగే ఉంచడంతో నాకు ఆశ్చర్యం,ఆనందం రెండూ కలిగాయి.

ఇంకా మేము ఉన్న క్వార్టర్స్ , నేను ఆడుకున్నప్రదేశాలూ,స్కూల్ హాండ్ పంపులో నీళ్ళు తాగుతున్నపుడు ఇవి మినరల్ వాటర్ కాదు అంటూ మావాళ్ళ వెళాకోలాల మధ్య అన్నీ తిరిగి తిరిగి ,జ్ఞాపకాల్ని తడిమి చూసుకొని భారమైన మనసుతో తిరుగు ప్రయాణమయ్యాను. 

Thursday, March 22, 2012

ఉగాది శుభాకాంక్షలతో.....


చైత్రమింకా బొట్టిపెట్టి పిలిచిందో లేదో ...
తనుమాత్రం కుహూ మంటూ వచ్చేసింది
కోయిలమ్మ !
వసంతలక్ష్మికి స్వాగత గీతిక పాడుతూ ...
దారికిరువైపులా ఎర్రగా ...
విరగబూసిన మోదుగ పూలు
రాబోయే రోజుల్లో భానుని ప్రతాపానికి
చిహ్నాల్లా కనిపిస్తున్నాయ్
పిల్లల పరీక్షల కష్టాన్ని రాబోయే
సెలవులు మరిపించినట్టు ...
పగటి వేసవి తాపాన్ని
సాయంత్రం మల్లెలు మరిపిస్తున్నాయ్
వేపపూత సౌరభాన్ని మోసుకొస్తున్న
చిరుగాలులు రాత్రిళ్ళని ...
పరిమళభరితం చేస్తున్నాయ్
కొత్త చివుళ్ళు తొడిగిన చెట్లూ ..
విరగబూసిన మల్లె పొదలూ ...
మధుమాసాన్ని మధురంగా
మార్చేస్తున్నాయ్ !
ఆరు ఋతువుల్లోనూ వసంతాన్ని
మహారాణిని చేస్తున్నాయ్!
మరి మనం కూడా ఆరు రుచుల ఉగాదిని
ఆహ్లాదభరితంగా జరుపుకుందామా
ఉగాది శుభాకాంక్షలతో.....మీ పరిమళం.

Sunday, March 18, 2012

అబ్బాయిల్ని పొగడాలంటే ......?


శిశిరంలోంచి వసంతంలోకి వచ్చేశాం ...నేనూ బాధ్యతల సుడిగుండంలోనుంచి ఒడ్డున పడిపోయా .రావటం రావటమే సందేహాన్ని వెంటబెట్టుకు వచ్చానని అనుకుంటున్నారా :) ఇది నాకు చాలా ఏళ్ళ నుండీ బుర్ర తొలుస్తున్న సందేహమే !
అమ్మాయిల్ని బుట్టలో వేయడానికి అతి సులువైన దారి పొగడ్తే అని చాలా మంది అదే ఫాలో అయిపోవడం చూశాను. అదిగో సరిగ్గా అప్పుడే నాకు ఈ సందేహం పుట్టుకొచ్చింది. అమ్మాయిల్ని పొగడాలంటే ...
* చిలిపితనం జాలువారే నీ సోగ కళ్ళని చూస్తూ ఉంటే అసలు టైమే తెలీదు (లోపల... ఆఫీస్ అయ్యాక ఉన్న కాస్త టైమూ నిన్ను పొగడడానికే సరిపోతుంది ఖర్మ) ఎన్ని గంటలైనా నీ కళ్ళల్లోకి చూస్తూ గడిపేయగలను.
* నువ్వు ఫక్కున నవ్వితే గుప్పెడు మల్లెలు జల జలా రాలినట్టు ఉంటుందనుకో (లోపల ....ఈమె టూత్ పేస్ట్ ఏంటో బ్రాండ్ మారిస్తే బావుండు హు ..అనుకున్నాసరే)
* మొన్న నువ్వు మాఇంటి కొచ్చి వెళ్ళినప్పటి నుంచీ మా పెంపుడు పిల్లి కొత్తగా నడుస్తోంది బహుశా నీ నడక చూసే అనుకుంటా (లోపల...దాని కాలికేదో గుచ్చుకున్నట్టుంది)
* అరె వసంతం రాక ముందే కోయిల కూస్తుందేవిటి అనుకుంటున్నా మీరు హలో అన్నారా (లోపల....వాయిస్ విని మోసపోవడం లేదుకదా)
ఇంకా ఇలాగే నీ ముక్కు చూసి సంపెంగలు సిగ్గు పడుతున్నాయ్ , నిన్ను చూసే నెమళ్లు హొయలు నేర్చాయ్ , నీ పలుకులు విని రాచిలకలు మూగపోయాయ్ వగైరా వగైరా .....చాలా ఉన్నాయి కాని అమ్మాయిలు అబ్బాయిల్ని ఎలా పొగుడుతారో ఏం చెప్తే వాళ్ళు ఫ్లాట్ అవుతారో...అవుతున్నారో .... నా మట్టి బుర్రకి తెలియలేదు ఒకవేళ 100% లవ్ సినిమాలో లాగా యు ఆర్ ది గ్రేట్ అంటూ ఉండాలా ? మీకెవరికైనా తెలిస్తే చెప్తారా ప్లీజ్ ....

Wednesday, November 9, 2011

నేను ఫెయిల్ అయ్యాను ప్చ్ ....

sad,emoticon,face,fun,happy,smile,smiley,emotion,funny


ఈ ఎనిమిది నెలలుగా నాకోసం నేను కొంత సమయం కూడా కేటాయించుకోలేని పరిస్థితులు ! అవేంబాధించేవి బాధపెట్టేవి కాదులెండి ...అంతా మంచే! కాకపొతే బ్లాగ్ బంధువులకు దూరమయ్యాననే ఒక చిన్న ఫీలింగ్ అప్పుడప్పుడూ ముల్లులా గుచ్చుకునేది.ఈ రోజెందుకో సడన్ గా గుర్తుకొచ్చింది మూడు వసంతాలకు ముందు ఇదే రోజు "నీ మౌనం" అనేబుల్లి కవితతో బ్లాగ్ లోకంలో అడుగు పెట్టానని !గృహిణిగా వంద శాతం మార్కులతో పాసయ్యాను కాని ....ప్చ్ ....బ్లాగ్ లోకంలో ఫెయిల్ అయ్యా ఐనా పరిమళానికి హ్యాపీ బర్త్ డే చెప్పాలనిపించి...ఇలా ......

అన్నట్టు మిత్రులంతా కుశలమే కదూ !

Friday, March 11, 2011

ప్రతిజ్ఞ!


తెలుగు వెలుగును ఖండాంతరాలకు వ్యాపింపచేసిన మహనీయులు వారు.వారి విగ్రహాలు తెలుగువారి వారసత్వ సంపద!వారసులం మనమే వాటిని కూల్చేసుకున్నామా?పంచభూతాల సాక్షిగా మహనీయుల విగ్రహాలు నేలకూలిన వేళ ....మనసు కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే ....టాంక్ బండపై ప్రతిజ్ఞ చేశారని టివిలో చూసినపుడు వీరంతా భారత పౌరులుగా మొదట చేసిన ప్రతిజ్ఞను మరిచారా ..లేక చిన్ననాడు వీరిచేత ఉపాధ్యాయులు కాని, తల్లితండ్రులు కాని ఈ ప్రతిజ్ఞను వల్లె వేయించలేదో తెలియలేదు.దుఃఖం వస్తోంది.అతి ప్రాచీనమని మురిసిపోయే మన నాగరికత ఇదేనాఅని!

స్కూళ్ళలో చెప్పిస్తున్నారోలేదో....ఒకవేళ చెప్పినా దాని అర్ధం వివరిస్తున్నారో లేక మొక్కుబడిగా చెబుతున్నారో తెలీదు.కనీసం తల్లితండ్రులైనా తప్పనిసరిగా తమ పిల్లలకు ఈ ప్రతిజ్ఞ నేర్పించి , అర్ధం వివరించి వారి మనసులో దేశభక్తి పెంపొందేలా చూడాలి.బాధ్యతాయుతమైన భారతీయ పౌరులుగా తీర్చి దిద్దాలి.

ప్రతిజ్ఞ

భారతదేశము నా మాతృభూమి.
భారతీయులందరూ నా సహోదరులు.
నేను నా దేశమును ప్రేమించుచున్నాను.
సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము.
దానికి అర్హుడనగుటకై కృషి చేయుదునని,
నేను నా తల్లితండ్రులనూ, ఉపాధ్యాయులనూ, పెద్దలందరినీ గౌరవింతునని,
నా దేశము పట్ల, దాని ప్రజల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉందునని ప్రతిఙ చేయుచున్నాను.
వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందమునకు మూలము.

Wednesday, March 9, 2011

వందేళ్ళ పండుగట!


మార్చి ఎనిమిదో తారీఖు! మహిళా దినోత్సవం...అదీ వందోది. ఇక ఈ వారమంతా బట్టల షాపుల్లో , బంగారం షాపుల్లో ..ఇంకా సూపర్ మార్కెట్లల్లో ఒకటేవిటి చాలా వాటిల్లో రాయితీలు ప్రకటించారు స్త్రీలకోసం!మనవాళ్ళెంతక్కువా ...మీటింగులు పెట్టుకున్నారు,ఆటల పోటీలు,పాటల పోటీలు ,వంటలపోటీలు ఎడా పెడా పెట్టేసుకునితెగ సంబర పడిపోయారు.అసంబ్లీలో కూడా మన మహిళా మంత్రులు కేకులులూగట్రా కోసి పండుగ చేసుకున్నారు.ఆ రోజుకి మాట్లాడే అవకాశంఇచ్చినందుకు తెగమురిసిపోయి సభాపతిగారికి కృతజ్ఞతలు తెలిపి ...ఇంకా ఇటువంటి అవకాశం ప్రతి రోజూ కల్పించాలని విన్నవించారట!

వందేళ్ళ మహిళా దినోత్సవం!
ఎన్నేళ్ళ చరిత్ర చూసినా ....
ఏమున్నది గర్వకారణం ?
స్త్రీజాతి చరిత్ర సమస్తం
జీవన్మరణ పోరాటం!
కడుపులో శిశువుకి
గర్భస్రావపు పీడలు
విసిరేసిన పసి దేహాలు
చెత్తకుప్పల్లోవాటిజాడలు
అందమైన బాల్యంపైనా
వేధింపుల నీడలు
యువతికియవ్వనమంతా
ప్రతిదినమొక గండం
సగటు గృహిణి జీవితం
నిరాశా నిస్పృహలమయం
వృద్ధాప్యపు మజిలీలోనా
గుచ్చుకుంటున్ననిర్లక్ష్యపు ముళ్ళు !

మహిళలు ఇప్పటి వరకూ సాధించింది ఏం లేదని చెప్పటం నా ఉద్దేశ్యం కాదు సుమండీ ....సాధించిన దానికి సంతృప్తిని చెంది ...అదే విజయమనుకుంటే పొరపాటేమో ఆలోచించండి.ఎంతమంది యాసిడ్ దాడుల్లో,గొంతు కోసే ఉన్మాదుల చేతుల్లో ,వరకట్నపు కోరల్లో బలైపోయారో....ఇంకెంతమంది మానసికంగా,శారీరకంగా హింసించబడి ఆత్మహత్యలు చేసుకున్నారో? బలైపోయిన వారికి చట్టం ద్వారా న్యాయంజరుగుతుందా? దోషులకు తగిన శిక్షలు అమలుజరుగుతున్నాయా?ఒకవేళ జరిగితే ఎంతశాతం ?
మరి బాధల, భయాల నీడన ఎందుకీ ఉత్సవాలు?ప్రతి మహిళ ముఖంలో చెదరని చిర్నవ్వు...హృదయం నిండా ధైర్యంనింపుకొని ఆత్మస్థైర్యంతో జీవించినరోజు అప్పుడు అసలైన మహిళల పండుగ!

Friday, February 25, 2011

బంద్.....ప్రశాంతం ??


టీవిలో న్యూస్ వస్తోంది చిరునవ్వులు చిందిస్తున్న న్యూస్ రీడర్ న్యూస్ చదువుతోంది ప్రశాంతంగా ముగిసిన బంద్! బంద్ సంపూర్ణం!ఫలానా చోట రెండు భోగీలు తగలబెట్టారు,ఫలానా స్టేషన్ కి నిప్పు పెట్టారు ,రెండు కాలేజీ బస్సులు దగ్ధం చేశారు , మరోచోట బస్సులపై రాళ్ళు రువ్వారు , షాపులు ధ్వంసం చేశారు,బస్సులు నిలిపివేశారు .మొత్తానికి బంద్ ప్రశాంతంగా ముగిసింది . ఇంతలో ఒక వ్యక్తి స్క్రీన్ మీదకి వచ్చిప్రజలంతా స్వచ్ఛందంగా సహకరించారు బంద్ సక్సస్ అయింది అంటూ మాట్లాడాడు.నాకు కొద్దిరోజుల క్రిందట ఒక పెద్దాయన మాట్లాడుతూ మేం గాంధీ మార్గాన్ని అనుసరిస్తాం అన్నమాటలు గుర్తుకొచ్చి ఇదేనా ఇప్పటి గాంధీగిరి అనుకున్నా!

బంద్ రెండురోజులూ గుడ్డూ , బ్రెడ్డూ కూడా దొరకలేదు.మా బంధువులమ్మాయి చెల్లెలి పెళ్ళికని ఇద్దరు చిన్న చిన్న పిల్లలతో బస్ కి ఊరికేల్తుంటే బస్ ఆపేసారట!పాపం ఆమె భర్త ఎక్కువరోజులు సెలవు పెట్టడం కుదరక ఆమెని పిల్లల్ని రెండు రోజుల ముందు పంపిస్తే జరిగింది ఇది !ఆమె దిగి ఆటోల్లేక సిటీ బస్ లు తిరగక నానా అవస్తలు పడి వెనక్కోచ్చేసిందట! మా కజిన్ ఒకడు పెట్రోల్ బంక్ లు లేక బయట లూజు పెట్రోల్ కొంటె లీటరు 150/-తీసుకున్నారట.తిరిగిన కొద్ది ఆటోలూ రెట్టింపు కంటే ఎక్కువ వసూలు చేశారు.సొమ్ము చేసుకోనేవారంతా మనుషుల అవసరాన్ని సొమ్ము చేసుకొన్నారు.నాకు తెలిసి ఇవే కాని బయట ఇలాంటివి ఎన్నో జరిగి ఉంటాయి.

మన సంగతే ఇలా ఉంటే ఇక ఏరోజు కారోజు సరుకులు తెచ్చుకోనేవారు, ఈ రోజు ఆటో నడిపితేనే రేపు గడిచేది అన్నవాళ్ళూ,చిన్న చిన్నటీస్టాల్స్ , తోపుడు బండ్ల వాళ్ళు ,పువ్వులమ్ముకొనేవాళ్ళూ, బంద్ తో మాకు సంబంధం లేదు మీరు రాకపోతే జీతం కోతే అనేచోట పనిచేసే చిన్న ఉద్యోగులూ ...ఇలా చెప్పుకుంటూ పొతే నష్ట పోయేవాళ్ళూ , కష్టపడేవాళ్ళూ ఎంతోమంది ఉన్నారు.ఆకలికి , అవసరానికీ , కష్టానికి కుల మత జాతి ప్రాంతీయ బేధాలు లేవుకదా ? అవి అందరికీ ఒక్కటే !

ఇంతకూ నాకు అర్ధం కానిది నిజంగానేనండీ ...ఒక సామాన్య గృహిణిగా నాకు అర్ధం కానిది ఈ బస్సులు రైళ్ళూ అవీ తగలేసి ప్రభుత్వాన్ని నష్టపరిస్తే ఆ నష్టమంతా ప్రజా ప్రతినిధులూ ,మంత్రులూ ఏమన్నా భారిస్తారా ఆభారమంతా ఏదోక రూపంలో ప్రజలమీదే కదా వేసేది. బంద్ లు చేసుకోవచ్చేమో మనది ప్రజాస్వామ్యం కనుక !కాని ప్రభుత్వ , ప్రెవేటు ఆస్తులు ధ్వంసం చేయటం వల్ల నష్టం ఎవరికి ? లాభపడేది ఎవరు ?