
చైత్రమింకా బొట్టిపెట్టి పిలిచిందో లేదో ...
తనుమాత్రం కుహూ మంటూ వచ్చేసింది
కోయిలమ్మ !
వసంతలక్ష్మికి స్వాగత గీతిక పాడుతూ ...
దారికిరువైపులా ఎర్రగా ...
విరగబూసిన మోదుగ పూలు
రాబోయే రోజుల్లో భానుని ప్రతాపానికి
చిహ్నాల్లా కనిపిస్తున్నాయ్
పిల్లల పరీక్షల కష్టాన్ని రాబోయే
సెలవులు మరిపించినట్టు ...
పగటి వేసవి తాపాన్ని
సాయంత్రం మల్లెలు మరిపిస్తున్నాయ్
వేపపూత సౌరభాన్ని మోసుకొస్తున్న
చిరుగాలులు రాత్రిళ్ళని ...
పరిమళభరితం చేస్తున్నాయ్
కొత్త చివుళ్ళు తొడిగిన చెట్లూ ..
విరగబూసిన మల్లె పొదలూ ...
మధుమాసాన్ని మధురంగా
మార్చేస్తున్నాయ్ !
ఆరు ఋతువుల్లోనూ వసంతాన్ని
మహారాణిని చేస్తున్నాయ్!
మరి మనం కూడా ఆరు రుచుల ఉగాదిని
ఆహ్లాదభరితంగా జరుపుకుందామా
ఉగాది శుభాకాంక్షలతో.....మీ పరిమళం.