
గురువు అంటే అంధకారం తొలగించువాడని చెబుతారు.శిష్యుల అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించేవాడు కాబట్టే గురువుకు త్రిమూర్తులతో సమానమైన స్థానమిచ్చి పూజిస్తాం.అక్షరాభ్యాసం ఐన వెంటనే పిల్లలకు ...
గురుర్భ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః
అంటూ చెప్పించి గురువు బ్రహ్మ , గురువు విష్ణువు ,గురువు మహేశ్వరుడు గురువు సాక్షాత్ పరబ్రహ్మము అట్టి గురువుకు నమస్కారం చేయమంటూ బుద్ధులు గరుపుతాం ....
ఏక ఏవ పరో బంధుః విషమే సముస్థితే
గురు స్సకల ధర్మాత్మా తస్మై శ్రీ గురవేనమః
ఆపదలు కలిగినపుడు సకల ధర్మ స్వరూపుడగు ఎవడు ఆప్తుడై మన ఆపదలను నివృత్తి చేయునో అట్టి గురువుకు నమస్కారం ....
అట్టిగురువులకు శతకోటి వందనం మరి ఆ గురువుల వల్లే ఆపద వస్తే ....
ఆడపిల్లలకు రక్షణ లేకపోతే...పసి పిల్లలకు శిక్షణ పేరిట శిక్షలు వేస్తుంటే ....ఇక గురువులకు వందనాలకు బదులు దండనలే మిగులుతాయి.ఏ చానెల్ పెట్టినా ప్రతి రెండుమూడు రోజులకోసారి కీచక టీచర్ అని...ఆడపిల్లలమీద వేధింపులనీ వింటూంటే మనసుకెంత బాధనిపిస్తుందో చెప్పలేను.వారికి మాత్రం పిల్లలుండరా...వారూ ఎక్కడైనా చదువుతుంటే అటువంటి వేధింపులకు గురైతే అన్న ఆలోచనే రాదా అనిపిస్తుంది . కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన శిష్యుల్ని మలిన మనస్కులై ఎలా చూస్తారు ?
దండం దశగుణంభవేత్ అన్నారు కానీ దానికి ముందు సామ దాన బేధాల్ని పాటించకుండానే ...తమ తమ ఫ్రస్టేషన్లకు పసిపిల్లల్ని బలిపశువుల్ని చేసి చితక బాదుతున్న గురువులూ ఉన్నారు. వారి భవిష్యత్తు కోసమో...లేక తప్పు చేస్తేనో దండిస్తే ఫరవాలేదు చిన్న విషయాలకే ఓర్పును కోల్పోతున్నారు కన్ను, చెవి అని చూడకుండా కొడుతుంటే ఆతర్వాత పిల్లల తల్లితండ్రులు బాధపడాల్సి వస్తోంది.
కొన్నేళ్ళ క్రిందటివరకూ టీచర్లు పిల్లల్ని కొట్టడం , కంట్రోల్లో పెట్టడం సర్వసాధారణం!తల్లితండ్రులు కూడా పిల్లోడు బాగుపడతాడు అని పట్టించుకొనేవారు కాదు కానీ ఇప్పుడు అది పెద్ద నేరమైపోయింది. సహేతుకమైన కారణం ఉన్నా కూడా పిల్లల్ని దండించ కూడదు.తల్లితండ్రులు కూడా పిల్లల్ని కొట్టడం పట్ల ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు. ఈ మధ్య పిల్లల్నిదండిస్తే కంప్లైంట్ చేయటానికి ఏదో టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టినట్టున్నారు.బహుశా కొన్నాళ్ళకు తల్లితండ్రులు ఓ దెబ్బవేసినా అమెరికాలోలా టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసే రోజులోస్తాయేమో.
గురువులందరూ ఒకేలా ఉండరు....కీచక గురువులు మాత్రమే కాదు మహాత్ములూ ఉంటారు .ఓ వారం క్రితం అనుకుంటా పేపర్ లో చదివాను వైజాగ్ దగ్గర శ్రీకాకుళంలో అనుకుంటా ...స్టూడెంట్స్ తప్పు చేశారని టీచర్ శిక్షించుకున్నారట!పిల్లలు పశ్చాత్తాప పడ్డారని రాశారు.నిజంగా ఆయన ఆదర్శానికి వందనం!
ఏది ఏమైనా ఎక్కడో కొద్ది శాతం మంది చేసే తప్పులు వెలుగులోకి వచ్చి గురువులకు మాయని మచ్చను మిగులుస్తున్నాయి కాని మనిషికి చదువు చెప్పి సంస్కరించడానికి గురువే లేకపోతే ఆ సమాజాన్ని ఊహించలేం కదా?అందుకే గురువు ఎప్పుడూ పూజనీయుడే....ఏమంటారు?