Wednesday, March 9, 2011

వందేళ్ళ పండుగట!


మార్చి ఎనిమిదో తారీఖు! మహిళా దినోత్సవం...అదీ వందోది. ఇక ఈ వారమంతా బట్టల షాపుల్లో , బంగారం షాపుల్లో ..ఇంకా సూపర్ మార్కెట్లల్లో ఒకటేవిటి చాలా వాటిల్లో రాయితీలు ప్రకటించారు స్త్రీలకోసం!మనవాళ్ళెంతక్కువా ...మీటింగులు పెట్టుకున్నారు,ఆటల పోటీలు,పాటల పోటీలు ,వంటలపోటీలు ఎడా పెడా పెట్టేసుకునితెగ సంబర పడిపోయారు.అసంబ్లీలో కూడా మన మహిళా మంత్రులు కేకులులూగట్రా కోసి పండుగ చేసుకున్నారు.ఆ రోజుకి మాట్లాడే అవకాశంఇచ్చినందుకు తెగమురిసిపోయి సభాపతిగారికి కృతజ్ఞతలు తెలిపి ...ఇంకా ఇటువంటి అవకాశం ప్రతి రోజూ కల్పించాలని విన్నవించారట!

వందేళ్ళ మహిళా దినోత్సవం!
ఎన్నేళ్ళ చరిత్ర చూసినా ....
ఏమున్నది గర్వకారణం ?
స్త్రీజాతి చరిత్ర సమస్తం
జీవన్మరణ పోరాటం!
కడుపులో శిశువుకి
గర్భస్రావపు పీడలు
విసిరేసిన పసి దేహాలు
చెత్తకుప్పల్లోవాటిజాడలు
అందమైన బాల్యంపైనా
వేధింపుల నీడలు
యువతికియవ్వనమంతా
ప్రతిదినమొక గండం
సగటు గృహిణి జీవితం
నిరాశా నిస్పృహలమయం
వృద్ధాప్యపు మజిలీలోనా
గుచ్చుకుంటున్ననిర్లక్ష్యపు ముళ్ళు !

మహిళలు ఇప్పటి వరకూ సాధించింది ఏం లేదని చెప్పటం నా ఉద్దేశ్యం కాదు సుమండీ ....సాధించిన దానికి సంతృప్తిని చెంది ...అదే విజయమనుకుంటే పొరపాటేమో ఆలోచించండి.ఎంతమంది యాసిడ్ దాడుల్లో,గొంతు కోసే ఉన్మాదుల చేతుల్లో ,వరకట్నపు కోరల్లో బలైపోయారో....ఇంకెంతమంది మానసికంగా,శారీరకంగా హింసించబడి ఆత్మహత్యలు చేసుకున్నారో? బలైపోయిన వారికి చట్టం ద్వారా న్యాయంజరుగుతుందా? దోషులకు తగిన శిక్షలు అమలుజరుగుతున్నాయా?ఒకవేళ జరిగితే ఎంతశాతం ?
మరి బాధల, భయాల నీడన ఎందుకీ ఉత్సవాలు?ప్రతి మహిళ ముఖంలో చెదరని చిర్నవ్వు...హృదయం నిండా ధైర్యంనింపుకొని ఆత్మస్థైర్యంతో జీవించినరోజు అప్పుడు అసలైన మహిళల పండుగ!

4 comments: