Monday, February 7, 2011

దెయ్యమా ....పిచ్చా??


ప్రసన్నకి దెయ్యం పట్టిందట! కాదంట....పిచ్చని అంటున్నారు.ఆనోటా ఆనోటా వింటున్న మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయి.ఏంటీ వీళ్ళంతా....నిన్న మొన్నటి వరకు ప్రసన్నదేవత...సంసారాన్ని చక్కగా దిద్దుకుంది...అందరికీ తలలో నాలుకలా ఉంటుంది...ఎవరికి ఏ సహాయం కావాలన్నాసొంత మనిషిలా చేస్తుంది అన్న బంధువులే ఇప్పుడిలా అంటున్నారంటే ఏం జరిగిందో...ఆలోచిస్తూ ఉండగానే సుబ్బక్క వచ్చింది .బుజ్జీ! ప్రసన్నని చూట్టానికి వెళ్తున్నా...నువ్వు వస్తావా? ఒక్కనిముషం ఉండక్కా...కొంచెం మొహం కడుక్కొని వచ్చేస్తాను.ఇంతకూ ఏమైంది...దెయ్యం పట్టిందని అంటున్నారు...చేతికొచ్చినవన్నీ విసిరేస్తుందట!తల గోడకి కొట్టుకుంటుందట...తనలో తనే ఏడుస్తుందట లేకపోతే మౌనంగా ఉండిపోవడం చేస్తుందట! వింటూనే రెడీఅయి తాళంవేసి బయలుదేరాను.

ప్రసన్నక్క...తనతో నాకు మంచి అనుబంధమే ఉంది.బంధుత్వం కన్నా స్నేహంగా ఉంటుంది.తనకి ఏదైనా మానసిక సమస్యా ? వీళ్ళంతా మూర్ఖంగా దెయ్యం ..భూతం అంటూ భూతవైద్యం చేయిస్తున్నారా ? ఐనా మానసిక సమస్యలు ఏం ఉంటాయితనకి ? మంచి భర్త ,చక్కటి పిల్లలు దాదాపు సెటిలైపోయినట్టే ...ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఏమీ లేవు. ఇంట్లో కూడా తను ఎంతంటే అంతే! ఆలోచనలు సాగుతూ ఉండగానే ఇంట్లోకి అడుగు పెట్టాం.

ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది.అంతకు ముందే ఏదో సాంబ్రాణి లాంటిది వేసినట్టు వాసన వస్తోంది.ప్రసన్నక్క దివాన్ మీద
పడుకొని ఉంది.అంతకు ముందు ఎప్పుడు ఇంటికొచ్చినా ఎదురొచ్చి గలగలా పలకరించేది.ఇప్పుడు మేమెవరో తెలీనట్టు శూన్యంలోకి చూస్తూమౌనంగా ఉండిపోయింది . ఎంతలో ఎంత మార్పు! పసిమిఛాయ వన్నెతరిగి కళ్ళకింద నల్లటి వలయాలు...మెడలోనూ , చేతికీ ఏవో రక్షలు కట్టారనుకుంటా.లోపలినుండి వాళ్ళమ్మగారు ఏదో విభూతి నీళ్ళలో కలిపి పట్టుకొచ్చారు.మాట్లాడకుండా తాగేసి అటు తిరిగి పడుకుంది. పెద్దావిడ కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఉంటే బాధనిపించింది.కాసేపటి తర్వాత ఇద్దరం లేచి వెళ్ళొస్తామని చెప్పి...దివాన్ దగ్గరగా వెళ్లి వంగి వెళ్తానక్కా అని
చెప్పి వెనక్కి తిరుగుతుంటే నా చేయి పట్టుకుంది.ఆశ్చర్యంగా అనిపించింది. సరే సుబ్బక్కా ...నేను కాస్సేపు ఆగి వస్తాలే నువ్వెళ్ళు అంటూ దివాన్ మీద పక్కనే కూర్చుండిపోయాను .

బుజ్జీ...నువ్వు అక్కదగ్గర ఉంటావుకదా...నేను పదినిముషాలలో పాల పేకెట్లు తెచ్చుకుంటాను అని ప్రసన్నక్క వాళ్ళమ్మ కూడా బైటకి వెళ్లారు.అప్పటివరకు మౌనంగా ఉన్నతను బుజ్జీ ...నువ్వుకూడా నాకు పిచ్చో ....దెయ్యం పట్టిందో అనుకుంటున్నావా ..అని అడిగే సరికి షాకయ్యాను.అసలేం జరిగిందక్కా ...
బుజ్జీ....మా పెళ్ళయ్యి ఇరవై ఏడేళ్ళు...ఈ ఇరవైఏడేళ్ళూ...ఇల్లాలిగా ,కోడలిగా , తల్లిగా ...అన్ని బాధ్యతలూ సక్రమంగా నిర్వహించాను.ఎప్పుడూ పిల్లలకోసం ,ఆయనకోసం తాపత్రయపడ్డాను. పిల్లల్ని పెంచడంలో,చదివించడంలో ,పెళ్లి చేసినపుడు అన్ని విషయాల్లోనూ ....ఇన్నేళ్ళలో వాళ్ళకు ఏలోటూ రాకుండా ..ఎవరిచేతా ఒక్క మాట అనిపించుకోకుండా...నెట్టుకు రావడం మాటలేంకాదు దానికోసం నా ఆరోగ్యం ,ఆనందం అని ఎప్పుడూ చూసుకోలేదు.అలాగే అందరూ నన్నూ అలాగే ప్రేమగా చూసుకున్నారు.కాని ఇప్పుడు నా మనసుని అర్ధం చేసుకొనే తీరిక ఓపిక ఎవరికీ లేవు. ఒకవిషయం చెప్తాను మనమధ్యే ఉండనివ్వు.నువ్వూ నమ్మకపోతే నవ్వుకో ...దాదాపు పదిహేనేళ్ళ క్రితం ఓ జ్యోతిష్యుడు మీ బావగారిజాతకం చెప్పాడు. నమ్మాలో వద్దో తెలీదు నేనూ మూధనమ్మకాలకు దూరమే..కాని కొన్ని సంఘటనలు మా జీవితంలో ఆయన చెప్పినట్టూ జరిగాయి. ఆయన ఇంకో విషయం కూడా చెప్పారు.ఈ సంవత్సరం భార్యకు ప్రాణగండం అని! ఇది నిజం కావచ్చు కాకపోవచ్చు. కాని నాలో అంతర్గతంగా ఉన్న భయాన్ని చెప్పినపుడు ఎంత తేలిగ్గా తీసి పడేశారంటే ...పైగా ఆయనా ,పిల్లలూ ఎగతాళి చేశారు. మూర్ఖత్వం అన్నారు. అసలు పట్టించుకోకుండానే ..ఎవరి పనుల్లో వారు కాలం గడిపేస్తున్నారు. నా భయాన్నిగాని...నా ఫీలింగ్స్ కాని వాళ్లకి అక్కర్లేదు అర్ధం చేసుకోరు. అది నిజం అవునో కాదో ...ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకుందాం.నిజం ఐతే నాకోసం నేను బ్రతకకుండానే నా జీవితం అయిపోతుంది. ఒకవేళ నాది మూర్ఖత్వమే ఐనా ఇరవై ఏడేళ్ళు వాళ్ళకోసం బ్రతికాను...ఒక్క సంవత్సరం నాకోసం వాళ్ళేమీ చెయ్యకూడదా..సరదాగా కనీసం అప్పుడప్పుడైనా ఎక్కడికైనా తీసుకెళ్లటం...అసలు నాకూ చిన్న చిన్న కోరికలు ఉంటాయని...నాకూ మనసుంటుందని నా భయాన్నిఎగతాళి చేసే బదులు అర్ధం చేసుకొని ధైర్యాన్నివ్వాలని అనిపించదేం వీళ్ళకి....ఎందుకు నన్నర్ధం చేసుకోరు? విపరీతమైన కోపం వస్తుంది ...అందరిపైనా ప్రేమ స్థానంలో ద్వేషం పెరుగుతుంది చచ్చిపోవాలనిపిస్తోంది చచ్చి వీళ్ళందర్నీ ఎడిపించాలనిపిస్తోంది...అందరిపైనా ఉక్రోషం.....కన్నీళ్లు జలజలా రాలుతూండగా.....సడన్ గా ఆపేసి అటు తిరిగిపోయింది. గుమ్మంవైపు చూస్తె పెద్దమ్మ వచ్చేసింది.

అంతా అయోమయంగా అనిపించింది .ఏం మాట్లాడాలో తెలీలేదు .సరే పెద్దమ్మా...ఇక నేను వెళ్తాను అంటూ .....బయటికి నడిచాను. ప్రసన్నక్కకి దెయ్యం పట్టిందా ...లేక పిచ్చా అని ఆలోచిస్తూ కళ్ళనిండా నీళ్ళతో భారమైన మనసుతో ఇంటి దారి పట్టాను.

18 comments:

  1. కళ్ళనిండా నీళ్ళతో.. భారమైన మనసుతో..
    సుడులు తిరిగే ఆలోచనలతో.. మీ బ్లాగ్ ముంగిటే నిలబడిపోయాను :(
    ప్రసన్నక్క కుటుంబసభ్యులకి మల్లే నూటికి 90 మందికి ఇది చూడటానికి చిన్న సమస్యలా కనిపిస్తుండవచ్చు కానీ మన మనసుకి ఇష్టమైనట్లుగా మనకోసం మనం బ్రతకలేకపోవడం ఎంత తీవ్రమైన నరకమో అనుభవిస్తే కానీ తెలియదు...

    ReplyDelete
  2. మీరు వాళ్ళ ఫామిలీ తో మాట్లాడారా పరిమళం గారూ...వాళ్ళకి అర్థం అవుతుంది కదా ఇదీ పరిస్థితీ అని చెపితే...ఒకొక్కసారి ఆవిడ చెప్పటం కంటే, బయట వాళ్ళు చెపితే ఫామిలీ మెంబర్స్ కి బాగా తెలుస్తుంది. డాక్టర్ల తో చెప్పిస్తే ఇంకా బెటరేమో...
    పిల్లలు బాగా పెద్ద అయిపోయాక కావలసినంత వ్యాపకం లేక స్త్రీలు ఇలా బాధ పడతారని , ఆదరణ తగ్గిందని మానసిక క్షోభకు గురి అవుతారని ఒక డాక్టరు గారు వ్రాసిన వ్యాసం లో చదివాను.

    ReplyDelete
  3. పరిమళగారూ! యథార్థ గాథ అయితే మటుకు మీరే వాళ్ళతో ఏమైనా మాట్లాడాల్సింది.
    ( మీరు మామూలుగా ఒక అంకితప్రవృత్తి కలిగి ఉన్న గృహిణి స్థితి గురించి రాసి ఉంటారనుకుంటాను.)

    ReplyDelete
  4. ఏంటండీ మీరు కూడానూ... దెయ్యం పట్టిందా... లేక పిచ్చా అని అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. ఆవిడ అంత స్పష్టంగా తన సమస్యని చెప్పాక కూడా దెయ్యం అన్న కోణం ఎక్కడుంది. అవకాశం చూసుకొని వాళ్ళవాళ్లకి చెప్పి మంచి డాక్టర్ చేత కౌన్సిలింగ్ ఇప్పిస్తే అందరూ ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు ఎగిరిపోతాయి.ఆవిడకి పిచ్చి లేదు,దయ్యమూ పట్టలేదు. ఆడవాళ్ళు తన ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా కుటుంబానికి ప్రియారిటీ ఇచ్చి ఒక స్థాయిదాటాక తమ మీద తామే సానుభూతి పెంచుకుంటారు. అవతలివాళ్ళనుంచి దానిని ఆశిస్తారు. దొరక్కపోతే తమను లెక్కచెయ్యడం లేదని బాధ పడతారు. శృతిమించితే అది హిస్టీరియాకి దారి తీస్తుంది. మీ ప్రసన్నక్క ఇంకా తన కంట్లోల్లోనే ఉన్నారు కనుక చిన్నపాటి కౌన్సిలింగ్ చాలు.దయచేసి మీకు తనపట్ల నిజంగా అభిమానం ఉంటే ఆ దశలో తనకి సహాయం చెయ్యండి.

    ReplyDelete
  5. @ సుధాగారు.....నా ఆలోచన ఆమెకి దయ్యమా ...పిచ్చా అని కాదండీ అవి ఆమెకా లేక ఆమెని అర్ధం చేసుకోలేని మనుషులకా అని! బహుశా నేను సరిగా చెప్పలేకపోయాననుకుంటా !వాళ్ళింట్లో చదువుకున్నవాళ్ళే అంతా ...చెప్పేంత చనువు నాకు లేదు అందుకే బాధపడుతున్నా...వీలైనపుడల్లా తనకి సాంత్వన కలిగించడానికి ప్రయత్నిస్తున్నా!

    ReplyDelete
  6. From your narration, you might be better off talking to the lady in question and giving her moral support, like letting her confide her fears and speak her mind without judging.

    ReplyDelete
  7. అయ్య్యో ఎంతపని జరిగిందండీ....ఆవిడ బాధ వర్ణనాతీతం కాదూ!
    మీకు మనసు విప్పి చెప్పుకున్నారంటే మీ పై ఆవిడకెంత నమ్మకం ఉండాలి. మీరే ఆవిడని ఈ స్థితి నుండి బయటపడేయాలి. సరే వాళ్ళ కుటుంబ సభ్యులకి నచ్చజెప్పేటంత పరిచయం మీకు లేకపోవచ్చు కానీ ఆవిడని వాళ్లనుండి ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళి (కొద్దిరోజులకైనా) ఆవిడ మనసుకి ప్రశాంతత చేకూర్చగలరేమో ఆలోచించండి.

    సలహాలు చెప్పడం చాలా ఈజీ అని మీరు అనొచ్చు, నిజమే కానీ ఆవిడ పరిస్థితిని అర్థం చేసుకున్నవారు మీరొక్కరే...కాబట్టి మీరే అడుగు ముందుకు వేయ్యాలి.

    ReplyDelete
  8. పరిమళ౦ గారు..ఆమె ని కౌన్సిలి౦గ్ కి తీసికొని వెళ్ళ౦డి ....తప్పు చేస్తున్నది...వివర౦ కావాల౦టే చెప్పగలను :)

    ReplyDelete
  9. భర్తకోసం, పిల్లలకోసం తమ జీవితాలనే త్యాగం చేసే వనితలు ఎంతోమంది. ఎక్కడిదాకానో ఎందుకు, మా అమ్మ కూడా అంతే. మా నాన్నతో తప్ప ఇంకేవరితోనూ ఆవిడ ఇంటి బయటకి అడుగు పెట్టడం నేనెరుగను.

    ఇలా తమకంటూ ఒక ముద్దూ ముచ్చటా లేకుండా మన కోసమే జీవితం ధారపోసినవాళ్ళ గురించి కానీసాలోచన లేకపోటం దారుణం. గిరీశం పంతులన్నట్టు "barbarous"

    ReplyDelete
  10. పరిమళ గారు మీరు ప్రసన్న గారి పరిస్థితి వివరిస్తూంటే చదువుతున్న మాకే చాలా బాధగా ఉంది, అలాంటిది మీకు పరిచమున్న వ్యక్తులను చూసి ఎల ఫిలవుతున్నారో అర్థం చేసుకోగలం..నేడు చాల కుటుంబాలలో మహిలళకు అన్ని సమకురుస్తున్నాం కదా అని ఇంట్లో వాళ్ళు వాల్ల గురించి పట్టించుకోవడం లేదు. కుటుంభానికంతా రోజంతా చాకిరి చేసి అలిసిపోయిన చాల మంది మహిళలు ఇలాంటి పరిస్థితినే ఎదురుకుంటున్నారు. ఒంటరిగా ఫిలవుతున్న వ్యక్తులను పట్టించుకోకపోతే ఇలాంటి పరిస్థితే వస్తుంది.దినికి మనం దయ్యమో, భూతమో అనుకోవాల్సిన పనిలేదు.మా ఇంట్లో కూడ మా వదిన కూడ ఇలాగే ప్రవర్థించింది.తనను మంచి వైద్యుడి దగ్గరకు తిసుకెళ్ళి చూపించాము. తను ప్రస్తుతం బాగనే ఉంది. మీకు విలైతే ఒక మంచి వైద్యుడికి చూపించండి. ప్రసన్న గారు తప్పకుండ బాగుపడతారు. తను మళ్ళి మాములు మనిసి కావడానికి తనకు కొంత సమయం కేటాయించమని మీరే వారి కుటుంబ సబ్యులకు నచ్చచెప్పండి.తన పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రసన్న గారు తప్పకుండా బాగుపడతారు.

    ReplyDelete
  11. @ వేణు గారు సమస్య చిన్నదైనా వారి మానసిక స్థితిని బట్టి ఉంటుంది.మీరన్నట్టు ఆ బాధ అనుభవించేవారికే తెలుస్తుంది ధన్యవాదాలండీ.
    @ కొత్తపాళీ సర్ మీ స్పందనకు ధన్యవాదాలు.
    @ ఎన్నెలగారు...నిజమేనండీ.వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడి ఒప్పించెంత చనువు మామధ్యలేదు.కాని నావంతు ప్రయత్నం చేస్తున్నానండీ.
    @ మందాకినీ గారు, పై టపా కల్పితం కాదండీ నా మనసును కలచివేసిన నిజం! ధన్యవాదాలు.

    ReplyDelete
  12. @ అంకుష్ గారు నేనుకూడా అదే కోరుకున్టున్నానండీ...ధన్యవాదాలు.
    @ లలిత గారు...నాకు వీలైనప్పుడల్లా వెళ్లి తన భయం పోగొట్టే ప్రయత్నం చేస్తున్నా! ధన్యవాదాలు.
    @ సౌమ్య గారు, అర్ధం చేసుకొనే వారైతే ఆమె తన భయాన్ని,బాధని చెప్పుకున్నపుడే అర్ధం చేసుకునేవారు.నేను చెబితే నువ్వెవరు ..నీకేంటి ఇంట్రస్ట్ ,మాకు ఆమాత్రం బాధ్యత లేదనుకున్నారా అంటే చెప్పటానికి నాదగ్గర సమాధానం లేదు.ఐనా అప్పుడప్పుడూ వెళ్లి పలకరించి వస్తున్నా...కొంత కోలుకుంటే నాదగ్గరున్న పుస్తకాలు ఇచ్చి ఏదో వ్యాపకం కల్పించాలని చూస్తున్నా! మీ స్పందనకు ధన్యవాదాలు .
    @ మౌళి గారు , కౌన్సిలింగ్ వరకూ అవసరం ఉండేది కాదండీ ఇంట్లోవాళ్ళు అర్ధం చేసుకుని ఉంటే....నేను జ్యోతిష్యాన్ని నమ్మను.ఇలా ఎవరైనా నమ్మితే వాల్లనమ్మకాన్నిమార్చుకోమని చెప్పలేను.ఎందుకంటే ఎవరి అనుభవాల్ని బట్టి వారి నమ్మకాలుంటాయి.అంతేకాదు నావాళ్ళు ఇటువంటి పరిస్థితిలో ఉంటే వారిపై నాకు బాధ్యతతోపాటు హక్కు కూడా ఉంటుంది కాబట్టి కౌన్సిలింగ్ ఇప్పించడమో...నేనే తోడుగా ఉండి భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేసేదాన్ని.ఇప్పుడుకూడా నాకు వీలైనంతలో ప్రయత్నిస్తున్నానండీ...మీ స్పందనకి ధన్యవాదాలండీ

    ReplyDelete
  13. @ ప్రసన్నగారు , నిజమేనండీ...వాళ్ళ ఋణం తీర్చుకోలేం కనీసం నీకేం తెలీదు...ఇంక ఆపునీచాదస్తం ...లాంటి మాటలతో కించపరచకుండా వారిని అర్ధం చేసుకుంటే చాలు ! ధన్యవాదాలు.
    @ డేవిడ్ గారు, ఏళ్ల తరబడి కుటుంబానికి ఎంత చేసినా సాధారంగా దాన్ని స్త్రీలు చాకిరీగా అనుకోకుండా బాధ్యతగానే భావిస్తారు.ఎంత శ్రమ పడినా ఒక చిన్న మెచ్చుకోలు తో అంతా మర్చిపోతారు.వారు కోరుకునేదల్లా కాస్త ఓదార్పు ,తన కోసం కాస్త సమయం,మరికాస్త గుర్తింపు...మీ వదినగారి ఆరోగ్యం ఇప్పుడు బావుంది కదండీ! ఊళ్ళల్లో కూడా చాలామంది స్త్రీలలో హిస్టీరియా లక్షణాలు కనబడుతూ ఉంటాయి.దేవుడు పూనాడని ,దెయ్యం పట్టిందనీ రకరకాలుగా చెప్తూ ఉంటారు బహుశా వారి మానసికస్థితి కుటుంబ సభ్యులు అర్ధం చేసుకుంటే వారికీ పరిస్థితి రాదు.స్పందించినందుకు ధన్యవాదాలండీ.

    ReplyDelete
  14. పరిమళం గారు .. హిస్టిరియ నో మరేదో మరేదో కావచ్చు .. నాకు అవన్నీ తెలీవు ...
    ఆవిడా తన కుటుంబ సబ్యుల ప్రేమ కోరుకుంటున్నారు .. వాళ్ళ attention కోరుకుంటున్నారు ... అయన భర్త కాని పిల్లలు కాని ఆవిడని కూర్చోపెట్టి అసలు ఆవిడకి ఏమి కావాలో మాట్లాడార ..
    అన్నేళ్ళు ఆవిడ వాళ్ళకి అన్ని సేవలు చేసింది .. అమ్మ కోసం .. వాళ్ళు ఆ మాత్రం చెయ్యలేరా .. అర్ధం కూడా చేసుకోలేర ... హ్మ .. ఏమి చెప్పాలో తెలియడం లేదు ..
    పోనీ ఒక సారి మీరే వాళ్ళందరిని కూర్చోపెట్టి మాట్లాడి explain చేసి చూడండి .. పాపం ఆవిడ .. అంత బాధ పడుతున్నారో .. ఇది డిప్రెషన్ కి దారి తీస్తే ఇంకా ఆవిడ తిరిగి మాములు మనిషి కాలేరేమో కూడా కదా ..
    నేను చిన్న పిల్లని మిగత వాళ్ళలాగా పెద్ద పెద్ద మాటలు చెప్పలేకపోవచ్చు కాని నా మటుకు ప్రేమ ఆప్యాయత ఉంటె ఇంకేమి మందులు అక్కర్లేదు అని నేను నమ్ముతాను ..
    అన్నింటికంటే ముక్య విష్యం ఇగ్నోరన్స్ అది పెద్ద కాస్ అవచ్చు ఎన్నో జబ్బులకి మెయిన్ గా మానసిక రోగాలకి అలాంటప్పుడు పక్కనే కూర్చోపెట్టుకుని చెయ్యేసి మాట్లాడితే .. పాపం వాల్ల్లకి ఎంత ఓదార్పుగా బలంగా ఉంటుందో కదా ..
    నా దగ్గర ఉంటె నేను ఆవిడతో కుర్చుని బోళ్ళు కబుర్లు చెప్పి ఏదైనా ట్రై చేస్తాను .. కాసేపు బయటకి తీస్కెళ్ళి .. అది చేసి ఇది చేసి ... ఆఫ్టర్ ఆల్ ఇట్స్ ఏ లైఫ్

    ReplyDelete
  15. పరిమళ గారు,
    ప్రసనక్కకు కావాల్సింది తనను అర్థం చేసుకుని తనకు కొంచం ప్రాముఖ్యతనిచ్చే మనుషులు. అది తన స్వంత కుటుంబ సభ్యుల నించే వారు కోరుకుంటున్నా అది వేరే ఎవ్వరి దగ్గర దొరికినా సంతోషిస్తారు. మీరు ఆ కుటుంబ సభ్యులు ఇప్పుడు మీరు చేస్తున్న కొంచం సాయమైనా చేయనీయరు అనుకుంటే అసలు వారిని కదపబోకండి. మీరు చేస్తున్న ఈ సాయం తప్పక మేలు చేస్తుంది ఆమెకు.ఆమెకు తనకంటూ ప్రత్యేకంగా ఏ పని అంటే ఇష్టమో, కొంచం బాగా చేస్తానని గర్వమో అలాటి పనుల్లో ప్రోత్సహించండి. కొంచం వాకింగ్ లాటి ఫిసికల్ ఎక్సర్సైస్ ఏదన్నా పది నిమిసాలైనా సరే అలవాటు చేసుకోటానికి ప్రోత్సహించండి. పైన చెప్పినట్టు వీలయితే కొంత సమయమైనా సరే (రోజులే అవ్వాల్సిన పని లేదు) ఆమెను ఆ వాతావరణానికి దూరం ఉండే వసతి కల్పించండి. మొత్తం అన్నీ చెయ్యటానికి మీకు కుదరకపోవచ్చు. తను తన పరిస్థితి చెప్పుకున్న మీలాటి స్నేహితులు ఇంకెవరైనా ఉన్నారేమో కనుక్కుని వారితో పంచుకోండి భాద్యతలు.

    ఒక్క చివరి మాట.
    ఆత్మహత్య గురించి మాట్లాడితే, ముఖ్యంగా వివరంగా అంటే ఎక్కడ, ఎప్పుడు, ఎలా చేసుకోవాలి అన్నవి, దానికి కావాల్సినవి ఎలా సమకూర్చుకోవాలి అనేవి తను మాట్లాడుతుంటే మాత్రం డేంజర్ సిగ్నల్స్ అని గమనించగలరు. డెబ్బై అయిదు శాతం మంది ఆత్మహత్య చేసుకునే ముందు దాని గురించి మాట్లాడి తీరుతారు.

    ReplyDelete
  16. కావ్యగారు,

    డిప్రెషన్ అంత పెద్ద భూతమేమీ కాదండీ :-)
    డెభ్భై శాతం మందివరకూ డిప్రెషన్ నుంచి కోలుకుంటారు. మిగితా వారిలో కూడా చాలా గుణం కనిపిస్తుంది.

    ReplyDelete
  17. @ కావ్యగారు, మీరనుకున్నది నిజమేనండీ...వాళ్లకి తనతో గడపడానికి కూడా టైం లేదని బాధ ! నేనూ వీలైనప్పుడల్లా వెళ్లి కలుస్తున్నా!తను త్వరలోనే కోలుకుంటుందని నా నమ్మకం కాకపొతే కొంత టైం పడుతుంది .ధన్యవాదాలు.

    @ భావకుడన్ గారు, మీరు చెప్పిన సూచనలు పాటించేలా చూస్తానండీ.వాళ్ళ ఇంట్లోవాళ్ళు మంచివాళ్ళే..కాని ఆమె చెప్పింది విని ఆమె భయాన్ని పోగొట్టడానికి బదులు కొట్టి పడేస్తారని,తనేం చెప్పినా నీకేం తెలుసంటూ హేళన చేస్తారనీ బాధపడుతుంది.సూసైడల్ టెండేన్సీఐతే కనపడలేదుగాని, తను చచ్చిపొతే వీళ్ళు ఎలా ఉంటారో అనే బాధ...అలా జరిగితేనే తన విలువ అప్పుడు తెలుస్తుంది అనే చిన్న కసి...కసి అనికూడా కాదేమో ఉక్రోషం కరెక్ట్ అనుకుంటా!
    అంతేనండీ...ఆమెకి భర్తన్నా పిల్లలన్నా ప్రాణం.నేను ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నా...వాల్లమ్మాయితో మాట్లాడి తన నాలుగేళ్ల బాబుని రాబోయే అకడమిక్ ఇయర్ లో వాళ్ళమ్మమ్మ దగ్గరుండి చదివేలా ఒప్పిస్తున్నానండీ :) మీ సూచనకీ , సహకారానికి చాలా కృతజ్ఞతలు.
    @ నాకే దూరపు బంధువైన ప్రసన్నక్క గురించి టపాలో చదివి ఇంతలా స్పందించి సలహాలూ , సూచనలూ ఇచ్చి ఆత్మీయత చూపించిన మీరంతా ఆత్మబందువులే ! బ్లాగ్ మిత్రులందరికీ మరోసారి ధన్యవాదాలు!

    ReplyDelete