Sunday, December 30, 2012

కొవ్వొత్తులతో కాదు నాకు నివాళి!

ముగిసిపోయే కధనుకాను
రగులుతున్న వ్యధను నేను
చనిపోలేదు నేను......
మీ కొవ్వొత్తుల వెలుగులో జీవించే ఉన్నాను
అత్యాచార తిమిరాన్ని తరిమికొట్టే ఆయుధంగా
నా చావు మీ ఉద్యమానికి స్ఫూర్తి ఐతే
నా మరణం కూడా ధన్యం!
నా మరణానికి కారణమైన కామాంధుల
తలలు తక్షణం తీసి కోటగుమ్మానికి  వ్రేలాడగట్టమని
ఆజ్ఞాపించే రాజే లేడా ఈ లోకంలో
రాచరికానికి సెలవిచ్చేసి, ప్రజలే ప్రభువులన్న
ప్రజాస్వామ్యంలో నా మరణానికి సమాధానం
కోట్లు ఖర్చుపెట్టి ఓట్లు కొనుక్కున్న
ఏ ప్రభువు నడగాలి ?
మరోసారి ఆడపిల్ల పై చేయి వేయాలంటే ఒణుకు పుట్టేలా
ఏ ప్రభువు శిక్షవేస్తాడు ఆ దుర్మార్గులకు?
ఎంతకాలానికి ?
 కన్నీళ్ళతోనో, కొవ్వొత్తులతోనో కాదు నాకు నివాళి
యత్రనార్యస్తు పూజ్యంతే అని పుస్తకాలకే పరిమితం చేయకండి
ప్రాధమిక విద్యనుండే పిల్లలకు బోధించండి
 మానవత్వమున్న మనుషులుగా తీర్చిదిద్దండి
స్త్రీలను పూజించక్కర్లేదు 
వారి ముఖంపై చిరునవ్వు చెదరనీయకండి
భయం నీడన బ్రతుకు వెళ్ళదీయకుండా 
కొంచెం ధైర్యంగా నడిచేలా రక్షణ కల్పించండి
హింసకు గురైన వారిపట్ల  కాస్త సానుభూతి చూపించండి
చులకనగా మాట్లాడి మా ఆత్మలకు కూడా
శాంతి లేకుండా చేయకండి 
ఇదే నాకు, నాలాంటి ఎందరో అభాగినులకు
నిజమైన నివాళి!!

** నేనుసైతం అంటూ  ఓ టపా రాసి చేతులు దులిపేసుకోవటం తప్ప ఏమీ చేయలేని నానిస్సహాయతకు బాధపడుతూ నిర్భయకు అశ్రునివాళి! రాబోయే సంవత్సరమైనా ఇటువంటి చేదు జ్ఞాపకాలు మిగల్చకుండా అంతా మంచే జరగాలి, అందరికీ మంచే జరగాలని కోరుకుంటూ ఈ వత్సరానికి వీడ్కోలు!



Friday, November 9, 2012

నాల్గు వసంతాలు!


ప్రియమైన పరిమళం

బ్లాగుల విరితోటలో నువ్వు చిరు పుష్పంలా విరిసి సరిగ్గా నాల్గు సంవత్సరాలు. కష్టాలూ సుఖాలూ, ఇష్టాలూ నష్టాలూ, అలకలూ అల్లర్లూ, కధలూ కాబుర్లూ... ఇవన్నీ పంచుకోవడానికీ, అప్పుడప్పుడూ మనసులోని భారం దించుకోవడానికీ నువ్వే వేదికయ్యావ్. తెలుగు బ్లాగుల సుమహారంలో నాకూ చోటు కల్పించావ్. ముఖపరిచయమైనా లేని వారితో అనుబంధం ఏర్పరిచావ్.నేను భయపడిన వేళ ధైర్యాన్నిచ్చి, బాధపడిన వేళ ఓదార్పునిచ్చి, నిరుత్సాహపడిన వేళ ప్రోత్సహించి, నా రాతలను భరించి, పొరపాట్లను సరిదిద్ది తమ చెలిమిని పంచిఇచ్చే మిత్రులను నాకు ఇచ్చావ్. చెలిమిని మించిన కలిమి కలదా ఇలలో... అటువంటి అపురూపమైన కానుకను  నువ్వు నాకు ఇచ్చావు. పరిమళం ఐ లవ్ యూ.... పుట్టినరోజు జేజేలు కూడా...

* పరిమళాన్ని అనుసరిస్తున్న, మరియు ప్రోత్సహిస్తున్న బ్లాగ్ మిత్రులందరికీ కృతజ్ఞతాభివందనాలు!

Saturday, October 27, 2012

శాన్వీ.....

అమ్మా....
ఏ దేవదేవుడో పొరపాటున జారవిడుచుకున్న
దేవపారిజాత పుష్పానివి నువ్వు!
ఏ పురాణేతిహాసాల్లోనూ లేడమ్మా...
ఇంత కౄర రాక్షసాధముడు!
మానవత్వం మంటకలిసిన తరుణంలో
మాపాపపు లోకంలో క్షణమైననిలువక
 దివికేగి...నీదైవత్వాన్ని తిరిగి పొందిన
చిన్నారి దేవతవి నువ్వు!
నిన్ను స్వాగతించినవి నాల్గు చేతులేనేమో
కాని....
వీడ్కోలు పలుకుతున్నవి వేలచేతులు!
ఇక ఎన్ని కొవ్వొత్తులు వెలిగించినా
కానరాదు నీరూపు.....
వ్యధాభరిత హృదయంతో....
చెబుతున్నాం టాటాలూ....బైబైలూ....

* తనసొత్తనేమో తిరిగి తీసుకెళ్ళి ఆతల్లితండ్రులకి కడుపుకోత మిగిల్చిన ఆదేవుడ్నే వారికి ఈబాధను తట్టుకునే మానసిక స్థైర్యాన్ని ఇవ్వమని ప్రార్ధిస్తున్నా.....

Wednesday, October 24, 2012

దసరా(స్పెషల్ )శుభాకాంక్షలు!

మిత్రులందరికీ విజయదశమి శుభాకాంక్షలు.ఇక స్పెషల్ ఏమిటంటారా చూశారుగా పై లడ్డూలు....అవి నేనుచేసినవే.మొన్న ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రం చూశాక నాలోనేను చాలా మధనపడి ఇంగ్లీష్ రాకపోతే పోనీ కనీసం లడ్డూ చేయటం కూడా రాదాయే :( ఇది నాక్కూడా ఇజ్జత్ కా సవాల్ అని డిసైడ్ ఐపోయా.పైగా మావారిక్కూడా లడ్డూ అంటే ప్రాణం.నాగురించి మాత్రమే ఆలోచించుకోవడం స్వార్థం.ఆయన ఇష్టాన్నిపంచుకోవడం ప్రేమ.....నేర్చుకొని నేనే చేసిపెట్టడం త్యాగం...ఈవిధంగా జ్ఞానోదయమైన క్షణం, తక్షణం యూట్యుబ్ లో వెదికి లడ్డూ చేయువిధానం చూసేసి ...ఏదైనా ఒక మంచిపని చేయటానికి సంకల్పించినపుడు విజయదశమి కంటే మంచిరోజు మరేముంటుంది? ఆచరణలో పెట్టేశా...

ఇక నేను లడ్డూ చేసిన విధంబెట్టిదనిన...తలంటిపోసుకున్న జుట్టు ఎగరగా క్లిప్పు పెట్టినాను ...భళాభళి
చీరచెంగును నడుముచుట్టూ తిప్పిదోపినాను.....భళాభళీ...
ఘల్లుఘల్లుమను గాజులన్నిటిని వెనక్కి తోసినాను....భళాభళి!
ఆప్రకారంగా సిద్ధమైన నేను ఒకపొయ్యిమీద పంచదార పాకం పెట్టి,మరోపొయ్యిపై ఆయిల్ పెట్టాను.పొయ్యి కూడా వెలిగించానండోయ్.ఇప్పుడు సెనగపిండి జారుగా కలుపుకొని సిధ్ధం చేసుకున్నా.పాకం నెట్ లో చూపించినట్లు తీగపాకం వచ్చేసింది యాలకపొడి కలిపిఉంచా.కాగిన నూనెలో చట్రం పెట్టి పిండి పోశా కాస్త ఇంచుమించుగా బూందీ లాగే వచ్చింది :)దాన్ని పాకంలో వేసి జీడిపప్పు,కిస్మిస్ కలిపి లాడ్డూలా చుట్టేసుకోవడమే.

హమ్మయ్య సక్సస్ ఫుల్ గా తయారుచేసి అమ్మవారికి ముందుగా నివేదనచేసి ఆనందంగా శ్రీవారికి పెట్టాను.పైగా పొద్దున్నే వీళ్ళు లేవకముందే చేసేసా సర్ప్రైజ్ చేద్దామని :) ఇన్నాళ్ళకు మీమనసు అర్ధంచేసుకున్నా...రాబోయే దీపావళికే కాదు మీకెప్పుడు లడ్డూ తినాలనిపించినా నేనే చేసిపెడతాను అంటూ లడ్డూ ప్లేటు అందించానండి అంతే ఒక్కలద్డూ నోట్లోవేసుకోగానే ఆయననోట మాటే రాలేదండీ...బహుశా ఆశ్చర్యానందాలతో అనుకుంటా.లడ్డూ నువ్వు చేశావా అని పారిపోబోతున్న మావాడికి ప్రసాదంరా వద్దనకూడదు అంటూపెట్టా...అది తిన్నవెంటనే నేనెప్పుడూ నీకు ఇంగ్లీష్ రాదని అననమ్మా అంటూ కంటతడి పెట్టుకున్నాడు.నాకళ్లలోకూడా ఆనందభాష్పాలు.అంతలోకి ఆయన తేరుకున్నారనుకుంటా....ఏమికామెంటుతారో అని ఆత్రంగా చూస్తుంటే కళ్ళనిండా నీళ్ళతో (ఆనందభాష్పాలేనండీ) నన్ను దగ్గరికి తీసుకొని దీపావళికి చిన్ని రమ్మంది కదరా మనం వెళదాం సరేనా అన్నారు.నిన్నటివరకు చూద్దాంలే అన్నవారు ఒప్పేసుకున్నారు...ఆనందంగా అదేంటి ఎప్పుడూ రెండు తింటారుగా ఇంకోటి తీసుకోండిఅన్నా...అబ్బే చాలురా ఈరోజు మనింటికి ఎవరోకరువస్తారుగా అందరికీ నువ్వుచేసిన లడ్డూ టేస్ట్ చూపించు అన్నారు నాకళ్ళల్లో మళ్ళీ ఆనందభాష్పాలు....ఈవిధంగా ఆనందంగా దసరా పండుగ స్పెషల్ గా జరుపుకున్నామండీ....మీకందరికీ కూడా నోరు తీపిచేద్దామని.......అరె అదేంటి....అలావెళ్లిపోకండీ...తిని చూసి ఏదోకటి చెప్పండి pleezzzzzzz :) :)

Wednesday, October 10, 2012

పిట్టకధలు - 4 ( విధి )

మిత్రులారా! మన పాత పిట్టకధలు గుర్తున్నాయా! ఒకవేళ మర్చిపోతే లింకులివిగో...
పిట్ట కధలు -1
పిట్ట కధలు -2 (యయాతి చెప్పిన నీతి 
పిట్ట కధలు - 3

కైలాసమున పార్వతీపరమేశ్వరులు ముచ్చటించుకొను ఒకానొక సందర్భములో విధిబలీయమైనది దేవీ అని ఈశ్వరుడు చెప్పుచుండగా...పార్వతి, స్వామీ! అది సామాన్యులకు గాని మనవల్ల కానిదేమున్నది మనము తలచినచో విధికూడా తలవంచునుకదా అన్నదట!అప్పుడు శివుడు లేదుదేవీ విధిని తప్పించుట వ్రాసిన బ్రహ్మకైనా సాధ్యముకాదుసుమా అనగా పార్వతీదేవి ఉక్రోషముతో సకల చరాచర సృష్టికి శక్తినిచ్చు నావల్లకూడా కాదా అని అడుగగా మహాదేవుడు చిరునవ్వుతో కాదన్నాడట!

అప్పుడు ఆమె చేతినిచాచి భూలోకంవైపు చూపుతూ అక్కడ ఆడుతూ పాడుతూ తిరుగుతున్న ఒక పదహారేళ్ళ కుర్రవాడిని చూపించి అతని విధి ఏమిటి అని ప్రశ్నించింది. శివుడాపిల్లవాడిని చూసి పాపం అతడు కొద్దినిముషములలో పాము కాటువల్ల చనిపోవునని చెప్పాడు.పార్వతీదేవి వానిని నేనుకాపాడెదనని చెప్పి ఆపిల్లవాడినే చూస్తూవుండగా వాడు తనగుడిశలోకి వెళ్లి వుట్టిమీదున్న చద్ది అన్నం తెచ్చుకొని కంచంలో వడ్డించుకొని తినసాగాడు.అక్కడే ఓమూల చుట్టచుట్టుకొని వున్ననాగుపామొకటి అలికిడికి బెదరి అతనివెనుకగా పడగ విప్పి కాటువేయుటకు సిద్ధపడెను ఆక్షణమునే పార్వతి మనుష్యరూపంలో వచ్చి ఆపిల్లవాడిని గట్టిగా పిలిచింది.వెంటనే పిల్లవాడు అన్నం ముందునుండి చటుక్కున లేచి బయటకు వచ్చి చూడగా ఎవ్వరూ కనిపించలేదు.విజయగర్వముతో పార్వతీదేవి శివుడ్ని చూసి చూశారాస్వామీ మీరుకాదన్నది నావల్ల ఐనది అన్నది.స్వామి చిరునవ్వుతో అటుచూడుదేవీ ఏమిజరుగునో... పాము సరిగ్గా కాటువేసే సమయానికి వాడు చటుక్కున లేచివెల్లటంతో ఆకాటు అన్నం లోపడి విషపూరితమైనది తిరిగిలోపలికి వచ్చిఅన్నం తిన్న పిల్లవాడు చనిపోయాడు.పార్వతీదేవి నిర్ఘాంతపోయి మహాదేవునితో పంతమాడినందుకు తలదించుకొని మీరన్నది నిజమేస్వామీ అని ఒప్పుకొన్నదట!
* అందుకే మన పెద్దవాళ్ళు అన్నందగ్గరనుండి లేవకూడదని ఒకవేళ లేవాల్సివస్తే వేరేకంచంలో మళ్ళీ వడ్డించుకొని తినాలని అనేవారట!అంటే అప్పట్లో కరంట్ ఉండేదికాదుకదా దీపాలవెలుగులో ఏవైనా కీటకములు ,పురుగుపుట్రా పడినా కనిపించవని అలా చెప్పేవారేమో!


Friday, October 5, 2012

లడ్డూ బాబోయ్ ....లడ్డూ :) :)

కొన్నేళ్ళ క్రిందట అప్పటికి ఇంకా స్వగృహ ఫుడ్స్ అంటే పెద్దగా తెలీదు.అప్పుడు రాజమండ్రిలో వసుంధర స్వగృహ ఫుడ్స్ అని కొత్తగా పెట్టారు. మావూరికి దగ్గర సిటీ కావడంతో మాకు ఏం కావాల్సినా రాజమండ్రి వెళ్లి తెచ్చుకోనేవాళ్ళం. అలా ఏదో పనిమీద వెళ్ళినప్పుడు మా శ్రీవారు ఈ వసుంధరలో సన్నబూంది లడ్డు ఒక అరకేజీ తీసుకొచ్చారు.చిదిమినోట్లోవేసుకోగానే  కమ్మటి నేతి వాసనతో తియ్యగా....మెత్తగా ...ఆహా...ఏమి రుచి! ఇటువంటి లడ్డు ఇంతకుముందు ఎప్పుడూ తినలేదు అనుకొంటూ రెండురోజుల్లో అరకేజీ ఖాళీ చేసేశాం.

అప్పటికి లడ్డులు ఇంట్లో చేసినా,ఎవరైనా సారెగా పంచిపెట్టినా కొంచెంలావుబూందీతో చేసినవే! పండగకు బెల్లం మిఠాయి, పంచదార మిఠాయి ఇంట్లోనే చేసేవారు.స్వీట్స్  షాపులో కొనుక్కుంటే కాజాలు,జాంగ్రీలు ,జిలేబీ,ఇంకా రసగుల్లా,కోవా టైపు కొనుక్కోనేవాళ్ళం.అసలే  మా ఇంటాయనకి పంచదార మిఠాయి అంటే ఇష్టం. పంచిపెట్టిన సారె లడ్డూ కూడా వదలరు.సైజు కేజీకి నాలుగు... రెండు దఫాల్లో కానిచ్చేస్తారు.అటువంటిది ఇక ఇంత కమ్మటి లడ్డు దొరుకుతుంటే ఊరుకుంటారా? ఇక ఏ పనిమీద రాజమండ్రి వెళ్ళినా లడ్డూ పేకెట్ ఇంటికి వచ్చేది.అరకేజి అల్లా కేజీ అయ్యింది.తర్వాత కూడా పిల్లలు ఇష్టంగా తింటున్నారని,అలాగే కొనసాగింది.తర్వాత హైదరాబాద్ వచ్చేశాం.ఇక్కడ వీధికో స్వగృహ షాపు! ఇప్పుడు రెండు మూడు కూడా ఉన్నాయనుకోండి.ఇక ఈయనకి పండగే!

అప్పటివరకు ఫర్లేదు కాని ఇక ఇక్కడికొచ్చింది మొదలు...ఎప్పుడు స్వీట్ షాప్ కి వెళ్ళినా లడ్డూనే...ఏమండీ చిన్నివాళ్ళింటికెళ్దాం ఏమైనా..స్వీట్స్ తెండి అనటం పాపం లడ్డూలతో ప్రత్యక్షం.అత్తయ్య వాళ్లింటికెళ్ళినా, మా చెల్లెలి గారింటికి వెళ్లినా...వాళ్ళ అక్కగారింటికి వెళ్ళినా ఏ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా లడ్డూలే ! ఈయన పనిచేసే కాలేజిలో ఏ ఫంక్షన్ వచ్చినా,ఆగష్టు 15 కీ, టీచర్స్ డే కీ, దసరాకి... వినాయకచవితికి కూడా ఉండ్రాళ్ళ తోపాటూ లడ్డూకూడా ఆర్డరివ్వాల్సిందే.ఏ గుడికెళ్ళి కెళ్ళినా లడ్డూ ప్రసాదం తప్పకుండా కొంటారు.తిరుపతిలో ఐతే బ్ల్లాకులో ప్రసాదం కొనటం పాపమండీ అన్నా వినకుండా 20 లడ్డూలైనా కొంటారు.వాటిలో ఓ పది ఆయనకే :)  :)

ఇక ఈవిషయం ఆనోటా ఆనోటా బంధువులకి, స్నేహితులకి తెలిసిపోయింది.ఇక అప్పట్నుంచి మాఇంటికి ఎవరొచ్చినా బావగారికిష్టం అంటూ అన్నయ్యలూ, చిన్నాన్నగారికిష్టం, అన్నయ్యగారికిష్టం,మా పెద్దోడికిష్టం అంటూ ఎవరిమటుకు వారు ప్రేమగా లడ్డూ లే తెస్తున్నారు.ఇలా ఏళ్లు గడిచి పోతున్నా ఇంట్లో అందరికీ ముఖ్యంగా నాకు లడ్డూ మీద (నిజానికి జీవితంమీదే) విరక్తి పుట్టేసింది. ఈయన ఎప్పుడు తిన్నా ఒకటి తినరు రెండు కావాలి.ఐనా అప్పుడు కూడా ఇంకో లడ్డూ కావాలా బాబూ....అంటే నో అని మాత్రం అనరు. లడ్డూ మీద శ్రీవారికి విరక్తి రావాలంటే....కాదు కాదు అసలు లడ్డూ అనే మాటే మాఇంట్లో వినపడకుండా ఉండాలంటే ఏం చేయాలో సలహా ఇవ్వరూ ప్లీజ్ !

Wednesday, September 26, 2012

చీమ...చీమ....చీమ!

ఈగ....రాజమౌళిగారి సినిమా...తెలియనివారుండరు.ఆ సినిమాలో హీరో నాని మరుజన్మలో ఈగగా పుట్టి తన ప్రియురాల్ని ప్రొటెక్ట్ చేసుకోవడమే కాకుండా తనను చంపినా విలన్ మీద పగతీర్చుకుంటాడు.ఈ సినిమా సూపర్ హిట్ అయినా కధ మాత్రం వాస్తవానికి దూరంగా కామెడీగా అనిపిస్తుంది కదూ :) చీమ అని మొదలుపెట్టి ఈగ గురించి చెప్తున్నానని అనుకొంటున్నారా ...అక్కడికేవస్తున్నా.ఇటువంటి కామెడీనే ఈమధ్య మాఇంట్లో తరుచూ జరుగుతోంది.వింటే కామెడీయే కాని అదో పెద్ద టార్చర్.

గత నెలరోజులుగా మాఇంట్లో చీమలు వింతగా ప్రవర్తిస్తున్నాయి.అసలు సిటీకొచ్చి పన్నెండేళ్ళవుతోంది, రెండు అద్దె ఇల్లులు మారి రెండేళ్ళక్రితం సొంత ఫ్లాట్ లోకి వచ్చాం,ఎప్పుడూ  ఇక్కడా చీమలబెడద లేదు.ఇప్పుడు మొదలైంది.ఆ చీమలన్నాక ఇంట్లోకిరావా...బెల్లంచుట్టూ చేరవా..అని మీరనుకుంటున్నారు కదూ?అక్కడే వుంది  వింత! మాఇంట్లో చీమలు బెల్లం చుట్టూ చేరట్లేదండీ అన్నం చుట్టూ చేరుతున్నాయి.ఒక్క అన్నమే కాదు,ఉప్మా,దోస,
ఇంకా రవ్వ,పల్లీలు,పప్పులు మొదలైన వాటిని పడుతున్నాయి.స్వీట్స్ కాని,బెల్లం కాని, పంచదారకాని గట్టుపై పోసినా అస్సలు ముట్టుకోవటం లేదు.కావాలనే అన్నంగిన్నె పక్కన బెల్లంకోరు...స్వీట్ పాకెట్ పెట్టినా,గచ్చుమీద పంచదార చల్లినా పట్టించుకోవట్లేదు.కరెంట్ కుక్కర్ చల్లారితే చాలు మేం తినేలోపే చీమలమయం. అన్నం,పప్పు వంటివన్నీ పెద్ద పళ్ళెంలో నీళ్ళుపోసి వాటిమధ్య పెట్టుకుంటున్నాం.అన్నీ ప్లేసులు మారుస్తూ దాచుకోవాల్సి వస్తుంది. అన్నం దొరికిందా సరే లేకపోతె కబోర్డ్ మూలల్లో సిమెంట్ తోడేస్తున్నాయి. మందుచల్లినా,గోడవారలు పసుపు ఉప్పు కలిపి చల్లినా ఎన్నిచేసినా ఎక్కడ్నించి వస్తాయో తెలీటంలేదు.బారులు తీరి అలా దండులా వస్తుంటే నిజంగానే అవి నామీద పగపట్టాయేమో అనిపిస్తుంది.ఒకవేళ దాని పార్ట్ నర్ ని చూసుకోకుండా వేడి వేడి అన్నం కాని మీదవేసి చంపేశానేమో అని!అందుకే దాని దండుతో సహా దండెత్తి వస్తుందేమో :) ఇంకా నయం దానికి ఏ సమంతా లాంటివారో  ట్రైనింగ్ ఇచ్చి ఉంటే నా గతి ఏమి ఉండేదో కదా :(  :(

# నేనూ సుదీప్ రేంజ్ లో బాగా ఆలోచించి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోతున్నా పెస్ట్ కంట్రోల్ వాళ్ళని పిలిచి వాటిని ఫినిష్ చేస్తా హ్హ హ్హ హ్హా ....