కొన్నేళ్ళ క్రిందట అప్పటికి ఇంకా స్వగృహ ఫుడ్స్ అంటే పెద్దగా తెలీదు.అప్పుడు రాజమండ్రిలో వసుంధర స్వగృహ ఫుడ్స్ అని కొత్తగా పెట్టారు. మావూరికి దగ్గర సిటీ కావడంతో మాకు ఏం కావాల్సినా రాజమండ్రి వెళ్లి తెచ్చుకోనేవాళ్ళం. అలా ఏదో పనిమీద వెళ్ళినప్పుడు మా శ్రీవారు ఈ వసుంధరలో సన్నబూంది లడ్డు ఒక అరకేజీ తీసుకొచ్చారు.చిదిమినోట్లోవేసుకోగానే కమ్మటి నేతి వాసనతో తియ్యగా....మెత్తగా ...ఆహా...ఏమి రుచి! ఇటువంటి లడ్డు ఇంతకుముందు ఎప్పుడూ తినలేదు అనుకొంటూ రెండురోజుల్లో అరకేజీ ఖాళీ చేసేశాం.
అప్పటికి లడ్డులు ఇంట్లో చేసినా,ఎవరైనా సారెగా పంచిపెట్టినా కొంచెంలావుబూందీతో చేసినవే! పండగకు బెల్లం మిఠాయి, పంచదార మిఠాయి ఇంట్లోనే చేసేవారు.స్వీట్స్ షాపులో కొనుక్కుంటే కాజాలు,జాంగ్రీలు ,జిలేబీ,ఇంకా రసగుల్లా,కోవా టైపు కొనుక్కోనేవాళ్ళం.అసలే మా ఇంటాయనకి పంచదార మిఠాయి అంటే ఇష్టం. పంచిపెట్టిన సారె లడ్డూ కూడా వదలరు.సైజు కేజీకి నాలుగు... రెండు దఫాల్లో కానిచ్చేస్తారు.అటువంటిది ఇక ఇంత కమ్మటి లడ్డు దొరుకుతుంటే ఊరుకుంటారా? ఇక ఏ పనిమీద రాజమండ్రి వెళ్ళినా లడ్డూ పేకెట్ ఇంటికి వచ్చేది.అరకేజి అల్లా కేజీ అయ్యింది.తర్వాత కూడా పిల్లలు ఇష్టంగా తింటున్నారని,అలాగే కొనసాగింది.తర్వాత హైదరాబాద్ వచ్చేశాం.ఇక్కడ వీధికో స్వగృహ షాపు! ఇప్పుడు రెండు మూడు కూడా ఉన్నాయనుకోండి.ఇక ఈయనకి పండగే!
అప్పటివరకు ఫర్లేదు కాని ఇక ఇక్కడికొచ్చింది మొదలు...ఎప్పుడు స్వీట్ షాప్ కి వెళ్ళినా లడ్డూనే...ఏమండీ చిన్నివాళ్ళింటికెళ్దాం ఏమైనా..స్వీట్స్ తెండి అనటం పాపం లడ్డూలతో ప్రత్యక్షం.అత్తయ్య వాళ్లింటికెళ్ళినా, మా చెల్లెలి గారింటికి వెళ్లినా...వాళ్ళ అక్కగారింటికి వెళ్ళినా ఏ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా లడ్డూలే ! ఈయన పనిచేసే కాలేజిలో ఏ ఫంక్షన్ వచ్చినా,ఆగష్టు 15 కీ, టీచర్స్ డే కీ, దసరాకి... వినాయకచవితికి కూడా ఉండ్రాళ్ళ తోపాటూ లడ్డూకూడా ఆర్డరివ్వాల్సిందే.ఏ గుడికెళ్ళి కెళ్ళినా లడ్డూ ప్రసాదం తప్పకుండా కొంటారు.తిరుపతిలో ఐతే బ్ల్లాకులో ప్రసాదం కొనటం పాపమండీ అన్నా వినకుండా 20 లడ్డూలైనా కొంటారు.వాటిలో ఓ పది ఆయనకే :) :)
ఇక ఈవిషయం ఆనోటా ఆనోటా బంధువులకి, స్నేహితులకి తెలిసిపోయింది.ఇక అప్పట్నుంచి మాఇంటికి ఎవరొచ్చినా బావగారికిష్టం అంటూ అన్నయ్యలూ, చిన్నాన్నగారికిష్టం, అన్నయ్యగారికిష్టం,మా పెద్దోడికిష్టం అంటూ ఎవరిమటుకు వారు ప్రేమగా లడ్డూ లే తెస్తున్నారు.ఇలా ఏళ్లు గడిచి పోతున్నా ఇంట్లో అందరికీ ముఖ్యంగా నాకు లడ్డూ మీద (నిజానికి జీవితంమీదే) విరక్తి పుట్టేసింది. ఈయన ఎప్పుడు తిన్నా ఒకటి తినరు రెండు కావాలి.ఐనా అప్పుడు కూడా ఇంకో లడ్డూ కావాలా బాబూ....అంటే నో అని మాత్రం అనరు. లడ్డూ మీద శ్రీవారికి విరక్తి రావాలంటే....కాదు కాదు అసలు లడ్డూ అనే మాటే మాఇంట్లో వినపడకుండా ఉండాలంటే ఏం చేయాలో సలహా ఇవ్వరూ ప్లీజ్ !