Friday, January 2, 2009

యుద్ధం చేస్తున్నా !

యుద్ధం చేస్తున్నా ! నా హృదయంతో .....
తన నిండా నింపుకున్న నీ తలపుల్ని
తుడిచెయ్యాలని.......
యుద్ధం చేస్తున్నా ! నా కళ్ళతో
నాలోని నీ రూపుని కన్నీరుగా
తోసెయ్యాలని .......
యుద్ధం చేస్తున్నా ! నా పెదవుల్తో
పలకొద్దని నీ పేరుని
పదే పదే ......
కానీ ప్రతి సారీ ఓడిపోతున్నా
సర్వాంతర్యామివై నన్ను వేధిస్తున్నావ్
ఐనా నేను గెలవాలని ప్రయత్నిస్తున్నా ....
ఓడిపోవాలని కోరుకుంటూనే .........

Thursday, January 1, 2009

నూతన సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం

గమ్య మెరుగని పయనంలో
దాటామొక మజిలీ
తీపి మరిచి ,చేదు విడిచి
స్థిత ప్రజ్ఞత సంతరించుకున్న ,
ఈ చివరి రోజు ........
నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ,
ప్రార్ధిస్తున్నా..... సర్వే జనాఃసుఖినో భవంతు

*మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Friday, December 26, 2008

ధైర్యం - అధైర్యం

ఒక మనిషి తాను చేయ దల్చుకున్న పని పట్ల నమ్మకం కంటే , దాని వ్యతిరేక శక్తి పట్ల నమ్మకం పెంచుకోవడాన్ని "అధైర్యం "అంటారు . తాను చేయదల్చుకున్న పని పట్ల , తన స్వశక్తి మీద నమ్మకం డామినేట్ చేయటాన్ని "ధైర్యం " అంటారు .జరగబోయే నష్టం కన్నా ,సాధించ బోయే లాభం విలువ ఎక్కువుంటే రిస్క్ తీసుకోవడమే ధైర్యం .గెలుపు అస్పష్టంగా ఉన్నా కూడా ధైర్యం చేయడాన్ని "సాహసం '' అంటారు . పెద్ద కష్టాల్ని ఎదుర్కోవడానికి సాహసం కావాలి . చిన్న కష్టాల్ని ఎదుర్కోవడానికి "ఓర్పు " కావాలి .
* అస్తమిస్తున్న సూర్యుడన్నాడట..
నా పని ఇక ఎవరు చేస్తారని ....
నాకు ఆ పని వదలండి ప్రభూ !
అన్నదట ఆత్మవిశ్వాసం
నిండిన " ప్రమిద "
-రవీంద్ర నాధ్ ఠాగూర్ -

Tuesday, December 23, 2008

ముద్దు (ఓ కొంటె కవిత )

అమ్మ పెట్టింది తొలిముద్దు
నాన్న పెట్టారు మలిముద్దు
మళ్లీ ఇన్నేళ్ళకి నువ్వూ .......

నుదుటి పైన ముద్దు అది
నులి వెచ్చని తొలి పొద్దు
బుగ్గ మీది ముద్దు అది
చేయదు ఏ సద్దూ
పెదవి పైన ముద్దు అది
పగడపు రంగును అద్దు
మెడ మీది ముద్దు అది
మోహపు సరిహద్దు
ఆపై నీ కొంటె తనానికి
లేదిక హద్దూ.....పద్దూ .......

Friday, December 19, 2008

కృష్ణ శాస్త్రి కవిత

* అక్కడ ఇంద్ర ధనుస్సులు అల్లిన పందిళ్ళు
అక్కడ వెన్నెల కళ్ళాపి చల్లిన వాకిళ్ళు .
భావుకత బహుశా ఆయన ఇంటి పేరో ఏమో .....
సాహిత్యం వెన్నెల బాటైతే కృష్ణ శాస్త్రి కవిత ఆ మార్గాన పరుగులు తీసే వెండి రథం అంటారు ఆయన సహ కవులూ ,అభి మానులు ......ఎన్ని పాటలు రాశారో ,ఎన్ని కవితామాలికలల్లారో తెలీదు కాని తెలుగు పరిమళమంతా ఆయన కవిత్వంలో గుభాళిస్తుంది .ఆయన కవితావేశం గురించి మాట్లాడేంతదాన్ని కాదు గాని ,అన్నమంతా పట్టి చూడక్కర్లేనట్టు "మేఘ సందేశం "చిత్రం కోసం ఆయన వ్రాసిన ....
ఆకులో ఆకునై , పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై ,నును లేత రెమ్మనై
ఈ అడవి దాగిపోనా .......
ఈ ఒక్క పాటే చాలు మనసు నిండి పోతుంది .వింటుంటే ప్రకృతిలో విలీనమవ్వని హృదయం ఉంటుందా ?
"నేను మానవతా వాదిని , వట్టి హృదయ వాదిని "అని చెప్పుకొనే శాస్త్రి గారు పద్య రచనలు మాత్రమే కాదు ,గద్య రచనలో కుడా దిట్టే నట .ఎల్లప్పుడూ ఆయన చుట్టూ జనం ,కబుర్లు ,సాహితీ విమర్శలూ ,ఇష్టాగోష్టులు ఉండ వలసిందేనట .అటువంటి మహా మనీషి జీవితంలో విషాదం ఊహించలేం .కాని ఆయనకు గొంతుక ఆపరేషన్ అయి స్వర పేటిక తీసేశారని , తర్వాత కూడా ఆయన నోట్ బుక్ ల ద్వారా సంభాషించే వారని చదివి నప్పుడు నా హృదయం ఆర్ద్రమై పోయింది .మీ అందరికి తెలిసే వుండొచ్చు కాని భారమైన హృదయపు ఆవేదన పంచుకోవాలన్న ఆరాటంతో
వ్రాస్తున్నా .......
గొంతుకు ఆపరేషనై నప్పుడు బొంబాయి హాస్పటల్ లో ఆయన వ్రాసిన ఓ కవిత ......
**నా మందిర గవాక్షంలో నుంచి
తొలి అరుణ స్వర్ణ కాంతి వచ్చి
నా రెప్పలను తాకినప్పుడు
కళ్లు విప్పి స్వాగతం చెప్తాను
వేకువ గాలి ముని వేళ్ళతో
నా మొగం నిమిరి నప్పుడు
చిరునవ్వు నవ్వుతాను
పెరటిలో నుంచి కొత్తగా విరిసిన
విభాత సుమ పరిమళం వచ్చి
పలకరిస్తే ' ఔ 'నని తల ఊపుతాను .
కాని ........గవాక్షం లోనికి ,రవ్వంత ఒరిగిన
మావి కొమ్మ చివర నిలిచి
'కో ' అన్న వనప్రియారవానికి
బదులు మాత్రం చెప్పలేను ,
ఇక ...........బదులు మాత్రం చెప్పలేను .
*నిందించదానికీ ,కీర్తించడానికి కాదు .మానవుని మానవునిగా చేయడానికే కావ్య నిర్మాణ మట! ఆ నిర్మాణానికి రాళ్లెత్తిన ,రంగులద్దిన కవులకూ ,భావుకులకూ ......... నా వినమ్ర పూర్వక వందనములు .

Monday, December 15, 2008

నువ్వు - నేను

ఉదయించే సూర్యుడు నువ్వైతే
వికసించే పద్మం నేనౌతా
గర్జించే మేఘం నువ్వైతే
చిరుజల్లునై పులకిస్తా
ఎగసిపడే కడలివి నువ్వైతే
ప్రవహించే నదినై చేరుకుంటా
మల్లె వంటి మనసు నీదైతే
పరిమళమై చేరువౌతా
జాబిలి నువ్వైతే
వెన్నెల నేనౌతా
ఇన్ని మాటలేల .........
నువ్వు పురుషుడివి
నేను ప్రకృతిని .

Saturday, December 13, 2008

మరో దీపావళి

ఎవరెన్ని విధాల తప్పొప్పులెంచినా జరిగిన ఎన్కౌంటర్ చాలా మందికి సంతోషాన్ని కలిగించిందనేది వాస్తవం .ఆ చాలా మందిలో నేను కూడా ఉన్నాను . స్త్రీ శక్తి మరోసారి సత్యభామగా మారి ఈ కలియుగ నరకుడ్ని అంతమొందించక ముందే
పోలీసులే ఆ పని చేసారు .ప్రజలు టపాసులు కాల్చి మరో దీపావళి చేసుకున్నారు .మరోసారి ఇటువంటి దారుణాలు పునరావృతం కాకుండా ఈ సంఘటన ఒక కనువిప్పుగా వుంటుందని భావిస్తున్నాను .
***ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే .