Thursday, April 30, 2009

మహాకవి శ్రీ శ్రీ


ఆవేశం ఆయన సిరా ...
ఆయన కవితలు అక్షర చైతన్యాలు ....
పతితులార భ్రష్టులార , బాధా సర్ప దష్టులార ....అంటూ కవిత్వాన్ని వెన్నెల వాకిళ్ళ లోంచి శ్రామికుడి చెమట చుక్కల్లోకి ఈడ్చుకు వచ్చిన ప్రజాకవి .ఆ మానవీయుని శత జయంతి సందర్భంగా...."సిప్రాలి " నుండి .....

సిరిసిరిమువ్వలు

పాతబడి కుళ్లిపోయిన
నీతులనే పట్టుకుని మనీషుల మంటూ
నూతన జీవిత లహరికి
సేతువు నిర్మింతురేల ?సిరిసిరి మువ్వా !

నీత్యవినీతులలో గల
వ్యత్యాసము తెలిసినట్టి వాడెవ్వడు ?నా
కత్యవసరమొకటే , ఔ
చిత్యం వర్తమునందు, సిరిసిరి మువ్వా !

ప్రాస క్రీడలు

ఈ మంత్రుల హయాం లోన
రామ రాజ్యమెప్పుడు ?
పడమటి దిక్కున సూర్యుడు
పొడుచుకొచ్చినపుడు

ప్రజాస్వామ్య పార్టీల్లో
ప్రజలకు తావెప్పుడు ?
నేటి బీరకాయలోన
నేయి పుట్టినప్పుడు

లిమ క్కులు

నేను
ముసలివాణ్ణి
కాను అసలు వాణ్ణి
పడగెత్తిన తాచుపాము బుసలవాణ్ణి
పీడితుల్ని వెంటేసుకు మసలువాణ్ణి
అందుకున్న ఆకాశపు కొసల వాణ్ణి

ఔను
నిజంగా నేను
ప్రజల కవినేను
ఎంచే తంటేను
వాళ్ళని చదివేను
చదివిందే రాసేను

కదన విహారానికి కత్తి పట్టు
కార్మిక వీరుడవై సుత్తి తిప్పు
ప్రగతి విరోధుల భిత్తి కొట్టు
సామ్య వాదాన్ని నీ గుండెల్లో హత్తి పెట్టు
సమానతా సదాశయాన్ని నెత్తి కెత్తు

సామ్య వాదం
ఈనాటి వేదం
అందరిలో మారుమోగే నినాదం
అందరికీ అందిస్తుంది మోదం
అది సఫలం సుఫలం శ్రీదం

Monday, April 27, 2009

నాన్న చెప్పిన కధ - 1


మంచి మనిషి

అనగనగా ఓ ఊరిలో గొప్ప ధనవంతుడున్నాడు. అతనికి ఎన్నేళ్ళైనా సంతానం కలగలేదు . అనారోగ్యంతో భార్య కూడా చనిపోయింది . తన తరుపు బంధువులు , భార్య తరుపు బంధువులు ఆస్తి కోసం ఇతనెప్పుడు పోతాడా ....అని రాబందుల్లా ఎదురు చూడసాగారు .ఇదంతా చూసిన ధనికునికి విరక్తి కలిగి ఓ గుడిని కట్టించి , ఓ పూజారిని నిత్యమూ పూజ చేసేందుకు నియమించాడు .ఆగుడికి ఎవ్వరు వచ్చినా ఉండటానికి సత్రమూ , భోజన శాలా కట్టించి పేదవారికి నిత్యాన్నదానం జరిగేలా ఏర్పాట్లు చేశాడు .ఖర్చుల నిమిత్తం తనకున్న పొలాలూ ,తోటలూ గుడికి మాన్యంగా రాసిచ్చాడు .

అతనికి వృద్ధాప్యం వచ్చింది . దేవాలయం ఆస్తుల్ని భద్రంగా కాపాడుతూ గుడి వ్యవహారాలన్నీ చూసుకొనే వారెవరికైనా బాధ్యత అప్పగించుదామని చూడసాగాడు . విషయం తెలిసి భూములపై వచ్చే ఆదాయానికి ఆశపడి ,కనీసం మంచిజీతమైనా దొరక్కపోతుందా అని ధనికుని వద్దకు ఎంతోమంది వచ్చేవారు .కానీ ఆ ధనికుడు అందర్నీ తిప్పి పంపేసేవాడు . నాకు మంచి మనిషి కావాలి అతనికే ఈ బాధ్యత అప్పగిస్తాను అని అందరితో అనేవాడు .చాలా మంది అతన్ని మూర్ఖుడనీ , పిచ్చివాదనీ అన్నా ఎవరినీ లెక్కచేసేవాడు కాదు .

రోజూ ఉదయం నుండి సాయంత్రం వరకూ గుడికి వచ్చి పోయే వారిని గమనిస్తూ ఉండేవాడు .ఓ రోజు ఒక వ్యక్తి దర్శనానికి వచ్చాడు . చిరిగిన బట్టల్లో , పెద్దగా చదువు కున్నట్టు కూడా కనపడని అతడ్ని ధనవంతుడు తన దగ్గరకు రమ్మని సైగ చేశాడు ." అయ్యా !మీరు ఈ దేవాలయ నిర్వహణ బాధ్యతని స్వీకరించ గలరా ? "అని అడిగాడు . అతడు ఆశ్చర్యం గా "నేను ఎక్కువ చదువుకోలేదు ఇంత పెద్ద గుడి బాధ్యత నేనెలా నిర్వహినచగలను ?" అన్నాడు .

నాకు పండితుడక్కర్లేదు మంచి మనిషైతే చాలు ఈ బాధ్యత అప్పగించి విశ్రాంతి తీసుకోదలిచాను అన్నాడు .
అప్పుడా మనిషి "నేను మీకు పరిచయం లేదు .ఇంతమందిలో నన్నే మంచివాడిగా ఎందుకు భావించారు " అడిగాడు .
" మీరు మంచివారని నాకు తెలుసు గుడికి వచ్చే దారిలో ఓ రాయి పాతుకుపోయి ఉంది చాలా రోజులుగా దాని మొన బయటికి వచ్చి అందరి కాళ్ళకీ తగులుతూ ఉంది . తగిలిన వారు ముందుకు తూలటమో , లేక పడిపోతే లేచి దుమ్ము దులుపుకు పోవడమో చేస్తున్నారు .నేను చాలా రోజులుగా చూస్తూనే ఉన్నాను ఎవ్వరూ పట్టించుకోలేదు . కానీ మీ కాలికి ఆ రాయి తగల్లేదు .అయినా మీరు కష్టపడి ఆరాయిని తవ్వితీసివేసి ,అక్కడ నేలంతా చదును చేశారు .అన్నాడా ధనవంతుడు .
అప్పుడా వ్యక్తి " ఇదేమీ పెద్ద పని కాదు మనకు గానీ ఎదుటివారికి గానీ హాని కలిగించే రాళ్ళు , ముళ్ళు లాంటివి తొలగించడం ప్రతీ మనిషి కర్తవ్యం " అన్నాడు .
తన కర్తవ్యాన్ని తెలుసుకొని నడుచుకొనే వాడే మంచిమనిషి .అంటూ ఆ ధనికుడు దేవాలయ బాధ్యతలన్నీ ఆ వ్యక్తికి అప్పగించాడు .

నీతి : మంచివారికి మంచే జరుగుతుంది .

కొసమెరుపు : నాన్న గారు చెప్పిన ఈ కధ చిన్నప్పట్నించీ మనసులో ముద్రించుకుపోయి ఇప్పటికీ బయటికెల్లినపుడు రోడ్డు మీద అరటి తొక్కలున్నా , కాళ్ళకి తగిలేలా రాళ్ళున్నా వంగి ఏరేస్తూ మా వారి చేత , నాతో వచ్చినవారిచేతా చివాట్లు తింటూ ఉంటాను :) :)

Saturday, April 25, 2009

కృష్ణశాస్త్రి కవిత

సుందర లోకం

చుక్కల కావలి దిక్కున
సుందరలోకం !
మిక్కిలి దూరం , ప్రయాణ
మెంతైనా భారం !

అక్కడ నాచిట్టితల్లి
హాయిగానే ఉంటుంది
ఒక్కత్తే వాళ్ల మామ్మ
ఒడిలో కూర్చుంటుంది

అక్కడ ఇంద్ర ధనుస్సులు
అల్లిన పందిళ్ళు ...
అక్కడ వెన్నెల కలాపి
చల్లిన వాకిళ్ళు .....

Thursday, April 23, 2009

మరునకుమారునివా ?


ప్రియతమా !
మదనుని
వాడి శరములైదూ ఒకేసారి
ఎక్కుపెట్టినట్టుండే నీ కొంటె చూపులెక్కడ ?
అరుణుడిపై కినుకబూని ఉషోదయానికన్నా
ముందే జలజలా రాలే పారిజాతాల్ని
తలపించే నీ చిరునవ్వులెక్కడా ?

మరునికి మారునివన్నానని అలిగి
మనసిజుడే దొంగిలించాడా ?
వెన్నెలంతా రాశి పోస్తే నీవన్నానని
ఆ జాబిల్లే దోచుకెళ్ళాడా ?

ఎవరేం చేసినా ......
మంచున తడిసిన మరుమల్లెలన్నీ
ప్రోగు చేస్తే ....అది నీ మనసు ...
ఆ పరిమళాన్ని నానుండి ఎవ్వరూ
దూరం చేయలేరు ......

Sunday, April 12, 2009

ఎన్నికల వేళ........


లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ...ఒకసారి రైలులో ప్రయాణం చేయవలసివచ్చింది .రైల్వే ఉన్నతాధికారులు ఆయనకు A.c భోగీలో ప్రయాణానికి ఏర్పాటు చేశారు .అప్పుడాయన వారిని వారించి , ఒక పేద దేశాన్ని పాలించే మంత్రి పేదవాడే అయి ఉంటాడు అని జనరల్ భోగీలోనే ప్రయాణం చేశారట .ధనాన్ని , వనరుల్నీ అవసరాల మేరకే ఉపయోగించుకోవాలని శాస్త్రిగారు ఆచరణలో చూపించారు.

మనం ఒక మంచి నాయకుడ్ని ఎన్నుకోవడం దేశాభివృద్ధికి ఏంటో ఉపయోగకరం ...ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరం కూడా ...కనుక జాతీయ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి నాయకుడ్ని ఎన్నుకుందాం .

ఒకవేళ అర్హత గల అభ్యర్ధి లేదని భావిస్తే , ఎన్నికల బరిలో ఉన్న ఏ అభ్యర్ధీ నచ్చలేదని ప్రిసైడింగ్ అధికారి వద్ద లభించే ప్రత్యెక పత్రంలో రాసిచ్చే అవకాశం ఉంటుంది .దీనివల్ల మన ఓటు దుర్వినియోగ మవకుండా ఉంటుంది .

మన స్వప్రయోజనాలకోసం ఎన్నోసార్లు క్యూ లో నిలబడతాం .రేషన్ కార్డూ , డ్రైవింగ్ లైసెన్స్ , బిల్లులు కట్టేందుకు ..సినిమా టిక్కెట్ కోసం కూడా కష్టపడి వరుసలో నిలబడతాం .అలాగే జాతీయ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని బాధ్యత గల పౌరులుగా ప్రజాస్వామ్యం మనకిచ్చిన హక్కును వినియోగించుకుందాం ...ఓటు వేద్దాం ..

Friday, April 10, 2009

పాటల సందడి - గున్నమామిడి కొమ్మమీద

నాకు చాలా నచ్చిన పాట




చిత్రం : బాలమిత్రుల కధ
గానం : ఎస్. జానకి
రచన : ఆత్రేయ
సంగీతం : సత్యం


గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది
ఒక గూటిలోన కోయిలుంది
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి

చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది
అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది
చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది
అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది
పొద్దున చిలకను చూడందే
ముద్దుగ ముచ్చటలాడందే
పొద్దున చిలకను చూడందే
ముద్దు ముద్దుగ ముచ్చటలాడందే
చివురులు ముట్టదు చిన్నారి కోయిల
చిలక ఊగదు కొమ్మ ఊయల //గున్న మామిడీ //

ఒక పలుకే పలుకుతాయి
ఒక జట్టుగ తిరుగుతాయి
ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి
ఒక పలుకే పలుకుతాయి
ఒక జట్టుగ తిరుగుతాయి
ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి
రంగూ రూపు వేరైనా
జాతి రీతి ఏదైనా
రంగూ రూపు వేరైనా
తమ జాతి రీతి ఏదైనా
చిలకా కోయిల చేసిన చెలిమి
ముందు తరాలకు తరగని కలిమి //గున్న మామిడీ//

* రంగు, రూపు... జాతి, రీతి బేధం లేని నిష్కల్మషమైన స్నేహానికి అద్దం పట్టే ఈపాట అంటే నాకు చాలా ఇష్టం.

Tuesday, April 7, 2009

నీకు సరదానా ??

ప్రియతమా !
పగలంతా ఊపిరివై చిర్నవ్వునీ
రేయంతా జ్ఞాపకమై నిద్దురనీ
దోచేయటం నీకు సరదానా ?

ఊహల్లో ఉప్పెనవై మనసునూ
నా ఎదలో కలవరమై నన్నూ
ఉడికించటం నీకు సరదానా ?

గగనంలో జాబిలివై అందక
చేరువైన చెలిమిని పొందక
ఊరించటం నీకు సరదానా ?

Friday, April 3, 2009

శ్రీ రామనవమి శుభాకాంక్షలు


బ్లాగ్ మిత్రులకు......
ఎల్లవేళలా శ్రీరామచంద్ర మూర్తి కరుణా కటాక్షములు
మీయందు ఉండాలని కోరుకుంటూ .....
శ్రీ రామనవమి శుభాకాంక్షలు.

మంగళ హారతి

పాడరే చెలులారా ...
పరిణయ మంగళ గీతి
హాయిగా ...పరిణయ మంగళ గీతి

మహర్షి మాటను జవదాటకనూ
హరివిల్లు విరిచెనే రామ చంద్రుడు
జనకుని కూతురు ఈ జానకిని
పరిణయమాడెనే రఘు రాముడు //పాడరే //

దవుదవ్వున తామరపూవులు
జల్లరే విర జల్లరే .....
చందన సుమము వసంత రజము
చల్లరే ..పై చల్లరే .....// పాడరే //

నవ వధువును సాధించిన
రామునకీయరే జయ హారతీ
కోరిక తీరిన సీతా కన్యకు
ఈయరే శుభ హారతీ ...//పాడరే //

Thursday, April 2, 2009

మన్నించు నేస్తం !


పింకీ ....అప్పుడు నెల ఉంటుందేమో దాని వయసు .తెల్లని తెలుపు ...గుండ్రటి ,నల్లటి కళ్ళూ ...చిన్ని మూతీ ..ఎంత ముద్దుగా ఉండేదో ..

బాబాయ్ గారింట్లో దాన్ని చూసి ముద్దుగా ఒళ్ళో పడుకోబెట్టుకుంటే ..హడావుడిగా క్రిందికి దూకి ...వాకిట్లోకి వెళ్లి ----పని కానిచ్చి తిరిగి తోకూపుకుంటూ నా దగ్గరకొచ్చి నిలబడిన దాని సంస్కారానికి ముచ్చట పడిపోయి దాని సహోదరులనుండి విడదీసి మరీ తెచ్చుకున్నాను .( మా వారికిష్టం లేకపోయినా )

పింకీని నేనూ ,పిల్లలూ చాలా గారంగా చూసేవాళ్ళం .పోటీపడి దానికి స్నానం చేయించడం , జుట్టు దువ్వడం , పాలుపోయడం ...మావారి కొరకొర చూపుల్ని లెక్కచేయకుండా మా పని మేం చేసుకునేవాళ్ళం .దానిష్టమైనవి ఉడక పెట్టిన గుడ్డు , చికెన్ బోన్స్ , కార్ట్ బిస్కెట్స్ .ఇక పుచ్చాకాయంటే దానికి ప్రాణం .

పళ్ళు వస్తూన్నప్పుడు మొదలైంది మాకు తంటా ! ఏది కనిపించినా కొరికి పెట్టేది ...ముఖ్యంగా చెప్పులు .అది చేసే చేష్టల కన్నా మావారు చూసే చూపులు ఎదుర్కోవడమే కష్టం గా ఉండేది .కానీ పింకీ చాలా తెలివైంది .కొద్దికాలం లోనే తోకూపుకుంటూ .కాళ్ళ పైకెగబాకుతూ మవార్ని మార్చేసింది .

సంవత్సరం ఐంది .పిల్లలు సరదాగా దాని పుట్టిన రోజుని జరుపుకున్నారు .నా పూలతోటకు భలే కాపలాగా ఉండేది బయటి వారెవరూ ఒక్క పూవు కూడా కోయకుండా .

కొన్నాళ్ళకు పింకీ తల్లయింది .ఎనిమిది పిల్లలు .మొదటిసారి అవటం వల్లా ,ఎక్కువ పిల్లల వల్లా ...చాలా పలుచటి స్కిన్ తో బలహీనంగా పుట్టాయి పిల్లలు .వాటినెంత జాగ్రత్తగా పోదువుకోనేదో పొట్టకింద .ఆ ప్రేమే వాటి ప్రాణాలు తీసింది .అవి లుకలుక మంటూ కాస్త దూరం జరగ గానే ....పళ్ళతో దగ్గరకు లాక్కునేది .నాట్లు పడి గాలి లోపలికెళ్ళి పిల్లలు చనిపోయేవి .నన్ను తప్ప ఎవ్వర్నీ దగ్గరికి రానిచ్చేది కాదు .ఒక్కొక్కటిగా పిల్లలన్నీ చనిపోతుంటే చూడలేక చివరగా మిగిలిన ఒక్క పిల్లనీ వేరు చేసి బాటిల్ తో బయటి పాలు పట్టి పెంచాను .నేలతిరిగే సరికి అది పింకీ కంటే ముద్దుగా ,బంతిలా తయారైంది .పిల్లలు దానికి ప్రెట్టీ అని పేరు పెట్టారు .పింకీ ,ప్రేట్టీల ఆటల మధ్య పిల్లలకు టైం తెలిసేది కాదు .

మా బంధువులు బ్రతిమాలి ప్రెట్టీ ని పెంచుకుంటామని తీసుకెళ్ళి పోయారు .కొన్ని రోజులు పింకీ దిగులుగా కనిపించినా ..త్వరగానే మర్చిపోయింది .దాదాపు మూడు సంవత్సరాలు మాలో ఒకటిగా కలిసిపోయింది పింకీ .

తర్వాత కొన్నాళ్ళకి మేం హైదరాబాద్ వస్తూ అపార్ట్ మెంట్స్ లో కష్టం అని తెలిసిన వారికిచ్చేశాం పింకీని .గొలుసు పట్టుకొని వాళ్లు తీసుకెళ్తుంటే వెళ్లనని గొడవ చేసింది .అయినా బలవంతంగా తీసుకెల్లేప్పుడు అది చూసిన చూపు ...నా జీవితాంతం మర్చిపోలేను .అది జాలో ....నాపై ప్రేమో ....నన్ను క్షమించేంత దయో ....
ఆ చూపుకి భాషే ఉంటే ...బహుశా ఈ వీడ్కోలు శాశ్వతం చేయకు నేస్తం ! అని అడిగి ఉండేదేమో ?

ఇప్పటికీ బయటికెళ్ళినప్పుడు కుక్క పిల్లలు కనిపిస్తే పింకీ ..దాని జాలి చూపులు గుర్తుకొచ్చి గొంతులో దుఃఖం సుడులు తిరుగుతుంది .అపరాధ భావనతో తల వాలి పోతుంది .